సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ వేదికగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 30 శాతం ఫిట్‌మెంట్ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు వరంలా కనిపించగా, ఖజానాకు మాత్రం కాస్త భారంగా మారింది. రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపుపై సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి మోదం..ఖేదం అంటూ రెండు రకాల అభిప్రాయాలు వెలువడ్డాయి.
30 శాతం ఫిట్‌మెంట్ వల్ల జీహెచ్‌ఎంసీలోని దాదాపు ఆరువేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు, మరో ఏడువేల మంది పెన్షనర్లకు వేతనాలు పెరగనున్నాయి. వీరితోపాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులకు సైతం వేతనాలు పెంచుతామని సీఎం హామీ ఇవ్వడంతో వారివీ పెరగ్గలవని భావిస్తున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఖజానాపై భారం పడనుంది.
జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం అందరికీ వెరసి నెలకు దాదాపు రూ.120 కోట్లు వేతనాల కింద చెల్లిస్తున్నారు. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.1440 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. సీఎం ప్రకటించిన ఫిట్‌మెంట్‌ను వర్తింపచేస్తే నెలకు దాదాపు రూ.36 కోట్ల వంతున సంవత్సరానికి రూ.432 కోట్లు అదనపు భారం పడుతుంది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు కూడా పెరిగే వేతనాలు వర్తింపచేయాల్సి ఉంటుంది.
జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచే వాటిని చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ వివిధ ప్రాజెక్టులను నెత్తికెత్తుకోవడంతో ఇప్పటికే ప్రతినెలా వేతనాల చెల్లింపులకు తిప్పలు పడుతోంది. గతంలో మొదటివారంలోనే వీటిని చెల్లించేవారు. ప్రస్తుతం నెలాఖరు వరకు జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు రూ.38 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి మరో రూ.38 కోట్లు ప్రతినెలా అందుతున్నందున వేతనాలు చెల్లించగలుగుతున్నారు. వేతనాలు పెరగనున్నందున అందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం పెరగనిదే కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకూ వర్తింపు..
- జీహెచ్‌ఎంసీ స్థానికసంస్థ అయినా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకూ పీఆర్‌సీ వర్తింపు ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఫిట్‌మెంట్ కనుగుణంగా పెరిగే జీతాలు చెల్లించేందుకు స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సమాచారమివ్వడం సంప్రదాయం మాత్రమేనని పేర్కొన్నారు.
- మరికొద్ది రోజుల్లో , ఈనెలాఖరున రిటైర్ కావాల్సిన వారు జీహెచ్‌ఎంసీలో 17 మంది ఉన్నారు. ఈసంవత్సరాంతానికి రిటైర్ కావాల్సిన వారు 236 మంది ఉన్నారు.
- రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల రానున్న మూడేళ్లలో రిటైర్ కానున్న 858 మందికి లబ్ధి కలిగిందని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
- రిటైర్మెంట్ వయసు పెంపుపై జీహెచ్‌ఎంసీలో కొందరు హర్షం వ్యక్తం చేయగా,కొందరు ఎక్కువకాలం పనిచేయాలని తమకు లేదని పెదవి విరిచారు.
- వేతనాలు, రిటైర్మెంట్ వయసుపెంపుపై మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వోద్యోగులతోపాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి సీఎం తన పెద్ద మనసు చాటుకున్నారని కొనియాడారు. మేయర్, తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment