పదవీ విరమణ అనంతరం పనిచేసేవారు, కారుణ్య నియామక ఉద్యోగులకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: కారుణ్య నియామకాల కింద పనిచేసే ఉద్యోగులు, పదవీ విరమణ అనంతరం సర్వీసులో కొనసాగే వారి వేతనాల(కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్)ను ఆర్టీసీ పెంచింది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను సవరించిన విషయం తెలిసిందే. 2017 వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించి అమలులోకి తెచ్చింది. దీంతో వారి వేతనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో కన్సాలిడేటెడ్ చెల్లింపులనూ సవరిస్తూ ఆర్టీసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
బ్రెడ్ విన్నర్ స్కీం పేరుతో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు కొనసాగుతాయి. సర్వీసులో ఉండి చనిపోయే ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. వారి అర్హతల ఆధారంగా ఈ కేటాయింపులుంటాయి. అయితే, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో, గత ప్రభుత్వం కారుణ్య నియామకాలను సరిగా చేపట్టలేదు. దీంతో దాదాపు 1800 కుటుంబాలు ఎదురుచూస్తూ వచ్చాయి.
ఆయా కుటుంబాల ఒత్తిడి పెరగటంతో దశలవారీగా వారికి ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పూర్తిస్థాయి ఉద్యోగం కాకుండా, తాత్కాలిక పద్ధతిలో ఇవ్వనుంది. మూడేళ్లపాటు వారి పనితీరు పరిశీలించి తదనుగుణంగా పర్మినెంట్ చేసే విషయంపై నిర్ణయం తీసుకునేలా అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చెల్లించనుంది. డ్రైవర్ గ్రేడ్–2, కండక్టర్ గ్రేడ్–2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టుల్లో నియామకాలు ప్రారంభించింది.
ఇప్పుడు ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న వారి రెమ్యునరేషన్‌ను పెంచింది. అలాగే, ఆర్టీసీలో వివిధ పోస్టుల్లో పనిచేసి పదవీ విరమణ చేసినవారు తిరిగి వారి సేవలు కొనసాగించే పద్ధతి కూడా అమలులో ఉంది. ఆయా స్థాయిల్లో ఖాళీగా ఉండే పోస్టుల ఆధారంగా వారి సర్వీసులను ఆర్టీసీ కొనసాగిస్తుంది. వారికి కూడా ఆయా పోస్టుల ఆధారంగా కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చెల్లిస్తారు. ఇప్పుడు వాటిని కూడా పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment