సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటు దేశంలో కరోనా ఉధృతి అధికమైంది. అటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజల్లో నిర్లక్ష్యం ఫలితంగా తెలంగాణలోనూ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఆరు రోజుల వ్యవధితో పోలిస్తే ఇప్పుడు 26 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కొన్నిచోట్ల స్వల్పంగా, కొన్నిచోట్ల కాస్తంత ఎక్కువగానే నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో ఈ నెల 8వ తేదీన 31 కరోనా కేసులుండగా, శనివారం 46 నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8వ తేదీన 10 కేసులుంటే, శనివారం 15 కేసులకు పెరిగాయి. కాగా శనివారం 50,998 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 228 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ఆదివారం ఉదయం బులెటిన్‌లో వెల్లడించారు. మొత్తం ఇప్పటివరకు 92,00,465 నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,01,161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో శనివారం 152 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,97,515 మంది కోలుకున్నారు. ఈ ఒక్కరోజులో ఒకరు చనిపోగా, మొత్తం కరోనాతో 1,653 మంది మృతి చెందారు.
367 మంది వెంటిలేటర్‌పై..
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 కరోనా యాక్టివ్ కేసులుండగా, అందులో ఇళ్లు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో 795 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.78 శాతం ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ఇప్పటివరకు ప్రతీ పది లక్షల జనాభాలో 2,47,191 మందికి పరీక్షలు చేశారు. శనివారం నిర్వహించిన 50,998 కరోనా పరీక్షల్లో 46,067 ప్రభుత్వంలో.. 4,931 ప్రైవేట్‌లో చేశారు. ఆదివారం లెక్కల ప్రకారం రాష్ట్రంలోని కరోనా రోగుల్లో 590 మంది ఆక్సిజన్ పడకలపై, 367 మంది వెంటిలేటర్/ఐసీయూ పడకలపై చికిత్స పొందుతున్నారు.
2.15 లక్షల మందికి వ్యాక్సిన్..
రాష్ట్రంలో శనివారం నాటికి 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలసి మొత్తం 2,15,980 మంది టీకా వేయించుకున్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటి డోస్ టీకా తీసుకున్నవారు 5,27,117 మంది కాగా, రెండో డోస్ టీకా తీసుకున్నవారు 2,22,080 మంది ఉన్నారు. అంటే మొత్తం మొదటి, రెండో డోస్ టీకాల సంఖ్య 7,49,197కు చేరింది. ఇక శనివారం 60 ఏళ్లు పైబడిన 10,539 మందికి, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 7,793 మందికి మొదటి డోస్ టీకా ఇచ్చారు. ఇటు 753 మంది వైద్య సిబ్బంది, 474 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా శనివారం మొదటి డోస్ టీకా ఇచ్చారు. అలాగే ఈ ఒక్కరోజులో 165 మంది వైద్య సిబ్బందికి, 2,693 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోస్ టీకా వేశారు. ఇలా ఒక్కరోజులో మొదటి, రెండో డోస్ టీకా పొందినవారు 22,417 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment