గ్రేటర్‌లోనే 10 వేల కరోనా కేసులు | Coronavirus Cases Reaches To Ten Thousanad In GHMC | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లోనే 10 వేల కరోనా కేసులు

Published Sun, Jun 28 2020 8:00 AM | Last Updated on Sun, Jun 28 2020 8:17 AM

Coronavirus Cases Reaches To Ten Thousanad In GHMC - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు 10 వేలు దాటాయ్‌.  శనివారం 888 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృత్యువాత పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,436 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీటిలో ఒక్క  జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 10,150 పాజిటివ్‌ కేసులున్నాయి. ఇప్పటికే 243 మంది మృతి చెందారు. వీరిలో 206 మందికిపైగా నగరవాసులే. అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో హైదరాబాద్‌ తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో రంగారెడ్డి, మూడో స్థానంలో మేడ్చల్, నాలుగో స్థానంలో సూర్యాపేట, ఐదోస్థానంలో నిజామాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. కాగా దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో కరోనా మృత్యు మృదంగం మోగిస్తోంది. (కోటికి చేరుకున్న కరోనా కేసులు)

ఇప్పటికే పలువురు ఉద్యోగులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా శనివారం ఐడీపీఎల్‌ లైన్స్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) సురేష్‌ సహా రాజేంద్రనగర్‌ డివిజన్‌లో పని చేస్తున్న లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ అబ్దుల్‌హమీద్‌లు కరోనాతో మృతి చెందారు. సిటీసౌత్‌ సర్కిల్‌లో పని చేస్తున్న మరో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ గుండెపోటుతో చనిపోయినట్లు సమాచారం. విద్యుత్‌ సంస్థలో ఒకేరోజు ముగ్గురు క్షేత్రస్థాయి ఉద్యోగులు మృతి చెందడంతో ఆ విభాగంలో విషాదం నెలకొంది. ఇప్పటికే 300 మంది పోలీసు సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడగా.. తాజాగా మరో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో సీసీఎస్‌లో 8, సైబర్‌ క్రైంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న పది మంది ఆరోగ్య మిత్రలకు కరోనా వైరస్‌ సోకింది. ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలో ఇప్పటికే వంద మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడగా, గాంధీలో 30 మంది వైద్య సిబ్బందికి వైరస్‌ సోకడంతో ఆస్పత్రి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.   

శివారులో శివాలు! 
గ్రేటర్‌ను ఇప్పటికే బెంబేలెత్తిస్తున్న కోవిడ్‌.. తాజాగా శివారు మున్సిపాలిటీలను చుట్టేస్తోంది. పాతబస్తీ, ఓల్డ్‌ మలక్‌పేట్, జియాగూడ, సబ్జిమండి, మేకల మండి, మలక్‌పేట గంజ్‌ మార్కెట్లు కేంద్రంగా కోర్‌సిటీలో విస్తరించిన వైరస్‌.. తాజాగా ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అటు, ఇటుగా ఉన్న శివారు మున్సిపాలిటీల్లో విరుచుకుపడుతోంది. జీహెచ్‌ఎంసీకి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు బయట, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు లోపల ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోజుకు సగటున 50 నుంచి 100 కేసులు నమోదవుతున్నాయి. జల్‌పల్లిలో అత్యధికంగా 90, బోడుప్పల్‌లో 35, మీర్‌పేటలో 28, పీర్జాదిగూడ, నిజాంపేటలో 15 కేసుల చొప్పున నమోదయ్యాయి. బడంగ్‌పేట్, జవహర్‌నగర్‌లో 12, నార్సింగ్‌లో 11, తుర్కయాం జాల్‌లో 10 కేసులు నమోదయ్యాయి. బండ్లగూడ జాగీర్, మణికొండలలో 9 కేసుల చొప్పున నమోదు కాగా, పెద్ద అంబర్‌పేటలో నాలుగు కేసులు వెలుగు చూశాయి.

నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులతో పాటు పోలీసు విభాగం, సచివాలయ ఉద్యోగులు, జర్నలిస్టులు సహా ఐటీ, దాని అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది శివారు మున్సిపాలిటీల్లోనే నివాసం ఉంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా వీరంతా రోజూ  
కోర్‌సిటీలోని ఆఫీసులకు వెళ్లి వస్తున్నారు. అలాగే శివారు ప్రాంతాల్లోని రైతులు, ఇతర వ్యాపారులు తమ ఉత్పత్తులను నగరంలోని ప్రధాన మార్కెట్లకు తరలించి విక్రయిస్తుంటారు. ఇప్పటి వరకు కోర్‌íసిÜటీకే పరిమితమైన కరోనా వైరస్‌.. రాకపోకలు పెరగడంతో శివారు ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుతం గ్రేటర్‌తో పోటీ పడుతున్నట్లుగా శివారు జిల్లాల్లో కేసులు పెరుగుతుండటానికి ఇదే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

నిలిచిన టెస్టులతో పరేషాన్‌..  
కరోనా వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా శివారులోని మొత్తం 30 నియోజక వర్గాల్లో 50 వేల టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు 36 వేల నమూనాలు సేకరించింది. ప్రస్తుతం ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్‌లో 2,290 టెస్టులు.. ప్రైవేటు ల్యాబ్స్‌లో 2,160 టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు సేకరించిన నమూనాల్లో 30 వేల నమూనాలను పరీక్షించి, రిపోర్టులు జారీ చేసింది. మరికొన్ని నమూనాల రిజల్ట్స్‌ రావాల్సి ఉంది. ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్స్‌ల్లో పరీక్షల నిర్వహణ తీరు అధ్వానంగా ఉన్నట్లు ప్రభుత్వ నిపుణుల కమిటీ గుర్తించింది. ఇప్పటికే టెస్టుల నిర్వహణ సామర్థ్యానికి మించి నమూనాలు వచ్చి చేరడం, మరో వైపు ప్రైవేటు ల్యాబ్స్‌లో టెస్టుల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రభుత్వం ఆయా డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షలను నిలిపివేసింది. నమూనాల సేకరణ కూడా ఆపేయడంతో ఇప్పటికే దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రుల్లోని పడకలు కూడా రోగులతో నిండిపోవడంతో కొత్తగా వైరస్‌ బారిన పడిన వారికి అడ్మిషన్‌ దొరకని దుస్థితి. 
 
హోం క్వారంటైన్‌లోనే మూడు వేలకుపైనే.. 
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,349 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 9,262 కేసులు నమోదు కావడం విశేషం. నగరంలో మార్చి నుంచి మే వరకు 1,616 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. జూన్‌లో 26 రోజుల్లోనే.. 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 237 మంది మృతి చెందారు. వీరిలో 200 మందికిపైగా కోర్‌సిటీ సహా శివారు ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. కరోనా బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం 34 కోవిడ్‌ ఆస్పత్రులను ఎంపిక చేసింది. వీటి పరిధిలో 17,081 పడకలను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. వీటిలో 10,970 ఐసోలేషన్‌ బెడ్స్‌ ఉండగా.. 3,227 పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సరఫరా ఫెసిలిటీ ఉంది.

1,448 ఐసీయూ పడకలు ఉండగా, వీటిలో 460 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గాంధీ, కింగ్‌కోఠి, ఛాతి ఆస్పత్రి, ఆయుర్వేద, నేచర్‌ క్యూర్, ఉస్మానియా ఆస్పత్రుల్లోని ఐసీయూ, ఐసోలేషన్‌ పడకలు రోగులతో నిండిపోయాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొత్తగా వైరస్‌ బారిన పడిన వారికి అడ్మిషన్‌ దొరకని పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా లేవు. ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఏ లక్షణాలు లేని పాజిటివ్‌ బాధితులతో పాటు వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు కూడా విధిలేని పరిస్థితుల్లో హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ప్రస్తుతం 7,436 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మూడు వేలకుపైగా కేసులు హోం క్వారంటైన్‌లో ఉండటం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement