సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యువత ఎక్కువగా కరోనా బారిన పడుతోంది. అందులోనూ యువతుల కంటే యువకులే రెట్టింపు స్థాయిలో వైరస్ ప్రభావానికి గురవుతున్నారు. తాజాగా వైరస్ బారినపడిన బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ.. వయసు, స్త్రీ, పురుషుల వారీగా విభజించి నివేదిక తయారు చేసింది. దాని ప్రకారం ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ప్రధానంగా 21 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు 47.06 శాతం కరోనా బారినపడ్డారు. ఇతర అన్ని వయసుల వారితో పోలిస్తే వీరే అధికంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత 41–50 ఏళ్ల మధ్య వయసు వారు 18.24 శాతం మంది ఉన్నారు. 51–60 ఏళ్ల వయసువారు 14.38 శాతం ఉన్నారు.
యువతుల కంటే యువకుల్లోనే రెట్టింపు...
రాష్ట్రంలో శుక్రవారం నాటికి మొత్తం 1,20,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు 47.06 శాతం ఉండగా, యువకులు 31.49 శాతం, యువతులు 15.57 శాతం ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం యువతుల కంటే యువకుల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఇక 21–30 ఏళ్ల వయసుగలవారిలో యువకులు 14.52 శాతం కరోనా బారిన పడగా, యువతులు కేవలం 8.07 శాతం ఉన్నారు. అలాగే 31–40 ఏళ్ల వయసులో యువకులు 16.97 శాతం, యువతులు 7.50 శాతం ఉన్నారని నివేదిక వెల్లడించింది. యువతులు ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలను పాటిస్తుండటం వల్ల వారిలో కరోనా తక్కువగా వ్యాపిస్తోందని అంటున్నారు. తప్పనిసరిగా మాస్క్‌లు, స్కార్ఫ్‌లు ధరించడంతోపాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవడం వల్ల యువతుల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని చెబుతున్నారు.
పెద్దల్లో వ్యాప్తికి యువతదే పరోక్ష పాత్ర...
పెద్ద వయసువారు, చిన్న పిల్లలకు వైరస్‌ను వ్యాపింప చేయడంలో యువతీ యువకులదే పరోక్ష పాత్రగా ఉందని ఇటీవల పలు సంస్థలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవసరమున్నా లేకపోయినా బయటకు వెళ్లడం, ఒకవేళ వెళ్లినా తమకు ఏమీ కాదన్న ధీమాతో తిరగడంతో ఇలా జరుగుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. చాలామంది యువతీయువకులు లక్షణాలు లేకుండా కరోనా బారినపడుతున్నారని, అలా ఇంటికి వచ్చినవారు పెద్దలకు పరోక్షంగా వ్యాప్తింపజేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యువకులు మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, తరచుగా చేతులను శానిటైజ్ చేసుకోకపోవడం, ఇంటికొచ్చాక స్నానం చేయకపోవడం తదితర కారణాలవల్ల పెద్దలకు వైరస్ సోకుతోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment