సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాల నుంచి ఇప్పటివరకు కొందరు కరోనా వైరస్‌ను తీసుకురాగా, తాజాగా ఢిల్లీ నుంచి వస్తున్న వారి నుంచి కరోనా వ్యాపిస్తోందని గుర్తించారు. ఆదివారం మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో ఇద్దరు ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చారు. వారికి సంబంధించిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 70 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రార్థనల కోసం ఇటీవల ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 5 వేల మంది వెళ్లొచ్చినట్లు అంచనా వేశారు. వారిలో ఇప్పటివరకు తెలంగాణకు సుమారు ఆరుగురు కరోనా మోసుకురాగా, అందులో ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు పాజిటివ్‌గా నిర్ధారించిన 70 మందిలో మొట్టమొదట కరోనా సోకిన వ్యక్తికి గతంలోనే నయం కాగా, తాజాగా 11 మందికి కూడా నెగెటివ్ వచ్చినట్లు సర్కారు ప్రకటించింది. వారిని సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించగా, ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైద్య నిర్ధారణ పరీక్షల్లో వారందరికీ నెగెటివ్ వచ్చిందనీ, ఇది ఎంతో సంతోషకరమైన విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. నెగెటివ్ వచ్చిన 11 మందిలో ఇండోనేసియాకు చెందిన 9 మంది బృందం, వారికి తోడుగా వచ్చిన మరో ఇద్దరు యూపీ, ఢిల్లీకి చెందినవారున్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వీరందరినీ సోమవారం డిశ్చార్జి చేస్తారు. వీరుగాక మరో 58 మందికి ఆసుపత్రిలో చికిత్స అందజేస్తారు. వారికి నయం అయ్యాక విడతల వారీగా డిశ్చార్జి చేస్తారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై నిఘా...
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్న దృష్ట్యా నిఘా వర్గాలు డేగ కన్నేశాయి. క్వారంటైన్‌లో ఉన్న వారి పరిస్థితిని రోజువారీ అంచనా వేస్తూనే, మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన వారిపైనా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అసలు ఢిల్లీ నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ రావడానికి ప్రధాన కారణమేంటో అధ్యయనం చేస్తున్నాయి. ఎవరి ద్వారా వైరస్ వచ్చిందనేది అంతుబట్టడంలేదు. ఢిల్లీలో ఒక ప్రార్థనా మందిరానికి ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో వెళ్తుంటారు. అక్కడికి తీసుకెళ్లేందుకు కొందరు ఏజెంట్లు కూడా పనిజేస్తున్నారు.
ఇటీవల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ ప్రార్థనా మందిరానికి వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటికే అక్కడికి వెళ్లొచ్చిన వారిలో కొందరికి పాజిటివ్ రాగా, వారి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఎంతమందిని కలిశారన్న దానిపై కొంత సమాచారం సేకరించారని తెలిసింది. వందల సంఖ్యలో వారితో కాంటాక్టు అయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఢిల్లీకి తీసుకెళ్లిన ఏజెంట్‌ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అతని నుంచి మరింత సమాచారాన్ని రాబడుతున్నట్లు సమాచారం. అక్కడికి వెళ్లొచ్చిన ఒక వ్యక్తి కుటుంబంలో ఇప్పటికే ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment