కరోనా టీకా... ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ ఇదే. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మే1వ తేదీ నుంచి టీకా వేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన... వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో ఇప్పుడు ఎక్కడ విన్నా టీకా టాపిక్కే నడుస్తోంది. టీకా ఎలా వేయించుకోవాలి? టీకా వేయించుకునేందుకు ఏం చేయాలి? మొబైల్ యాప్‌లుంటాయా? ఒక కుటుంబంలో ఒక స్మార్ట్ ఫోనే ఉంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? అసలు రిజిస్ట్రేషన్ ఉండాలా? నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళితే వేయరా? మరి చదువులేని వారు.. స్మార్ట్ ఫోన్లపై అవగాహన లేని వారి పరిస్థితి ఏంటి? వ్యాక్సిన్ కోసం ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం?... రాష్ట్ర ప్రజానీకంలో తలెత్తుతున్న ఇలాంటి సందేహాలన్నిటికీ కోవిన్ పోర్టల్ సమాధానమిస్తోంది.
కోవిడ్–19 వ్యాక్సిన్ కోసం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి?
www.cowin.gov.in లింకు ద్వారా కోవిన్ పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ ‘రిజిస్టర్/సైన్‌ఇన్ యువర్ సెల్ఫ్’అనే ట్యాబ్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ రిజస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
వ్యాక్సినేషన్‌కోసం మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలా?
మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అధీకృత మొబైల్ యాప్ లేదు. కోవిన్ పోర్టల్ ద్వారానే రిజిస్టర్ చేసుకోవాలి. ఆరోగ్య సేతు ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఏ వయసు వారు కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి?
ప్రస్తుతానికి 45 ఏళ్లు దాటిన వారంతా రిజిస్టర్ చేసుకోవచ్చు. మే1 తేదీకి 18 ఏళ్లు నిండిన వారంతా బుధవారం నుంచి కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశముంది.
వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరా?
అవసరం లేదు. ప్రస్తుతం కొన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కొన్ని స్పాట్ రిజిస్ట్రేషన్ల ద్వారా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. కానీ, కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని వెళ్లడం ద్వారా ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నామన్న విషయం ఎలా ధ్రువీకరించబడుతుంది?
మీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ నిర్ధారణ జరిగిన వెంటనే వ్యాక్సినేషన్ కేంద్రం, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన రోజు, సమయం తదితర వివరాలన్నీ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి. మీరు ఈ వివరాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
అపాయింట్‌మెంట్ లేకుండా వ్యాక్సినేషన్ చేయరా?
వ్యాక్సినేషన్ కేంద్రాల్లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాక్సిన్ కోసం అపాయింట్‌మెంట్ ఇస్తారు. అక్కడకు వెళ్లి సమయం వృధా చేసుకోకుండా ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది.
రెండోసారి వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరా?
అవును. రెండు డోసులు తీసుకుంటేనే వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం ఉంటుంది. అది కూడా రెండుసార్లూ ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకోవాలి.
రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలి?
మొదటి డోస్ తీసుకున్న 4 నుంచి 6 వారాల్లోపు కోవాగ్జిన్, 6 నుంచి 8 వారాల్లోపు కోవిషీల్డ్ రెండో డోస్ తీసుకోవాలి. మీ అనుకూలతను బట్టి ఈ కాలపరిమితి లోపు రెండో డోస్ తీసుకోవాలి.
కోవిన్ ద్వారా రెండో డోస్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అవుతుందా?
అవును. రెండో డోస్ వ్యాక్సినేషన్ అపాయింట్‌మెంట్ కోసం కోవిన్ పోర్టల్ మీకు సాయపడుతుంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అపాయింట్‌మెంట్ సమయంలో సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి?
1075 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.కోవిన్ పోర్టల్ ద్వారా కూడా మీ సందేహాలు తీర్చుకోవచ్చు.
అన్ని చోట్లా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారా?
లేదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఉచితంగా ఇస్తారు. ప్రై వేటు ఆసుపత్రుల్లో రుసుము వసూలు చేస్తారు.
వ్యాక్సిన్‌ను మనం ఎంపిక చేసుకోవచ్చా?
అన్ని రకాల వ్యాక్సిన్లు శ్రేయస్కరమైనవే. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఎందుకు?
మీరు వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా నిర్ధారణకు, అవసరమైన చోట చూపించేం దుకు సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.
ఈ సర్టిఫికెట్ ఎవరిస్తారు?
మీకు వ్యాక్సిన్ ఇచ్చిన కేంద్రంలోనే సర్టిఫికెట్ కాపీ ఇస్తారు. మీరు అడిగి మరీ తీసుకోవచ్చు.
ఈ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?
కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతులో ఈ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ద్వారానే దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వ్యాక్సినేషన్‌కు వెళ్లేటప్పుడు ఏ ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి?
వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఇచ్చిన ధ్రువపత్రాలనే వ్యాక్సినేషన్‌కు వెళ్లేటప్పుడు తీసుకెళ్లాలి.
రెండో డోస్ ఎక్కడైనా తీసుకోవచ్చా?
అవును. మన దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రం, ఏ జిల్లాలోనైనా రెండో డోస్ తీసుకోవచ్చు. కానీ, మీరు మొదటి డోస్ తీసుకున్న చోట మాత్రమే మీరు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ (మొదటిసారి తీసుకున్నది) అందుబాటులో ఉండే అవకాశముంది.
వ్యాక్సినేషన్ కారణంగా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరిని సంప్రదించాలి?
మీరు వ్యాక్సిన్ వేసుకున్న కేంద్రంలో లేదా 1075 టోల్‌ఫ్రీ నంబర్, 9111–23978046 అనే హెల్ప్‌లైన్‌నంబర్ లేదా 0120–4473222 అనే టెక్నికల్ హెల్ప్‌లైన్‌నంబర్ లేదా nvoc2019@gov.in అనే ఈమెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
చదవండి:
యూకే వేరియంట్‌లాగా వేగంగా వ్యాపిస్తోంది
70 టన్నుల ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రాక
Comments
Please login to add a commentAdd a comment