కరోనాతో మృతి చెందిన వారియర్స్‌కు బుధవారం ఉస్మానియా వైద్య కళాశాలలో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న వైద్య సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబాలను పరామర్శించి తగిన ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. కనీసం వారిని పట్టించుకోవడం లేదని తెలంగాణ వైద్యుల సంఘం ఆరోపించింది. ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించింది. కరోనా సోకిన వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు చికిత్స అందించడంలోనే కాకుండా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలలతోపాటు అనుబంధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, పారిశుధ్య సిబ్బందిసహా హెల్త్‌కేర్ వర్కర్స్ అంతా గత రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
మృతులకు కొవ్వొత్తులతో నివాళి
ఇటీవల మృతి చెందిన డాక్టర్ నరేష్, డాక్టర్ ప్రసన్నకుమారి, డాక్టర్ కె.శ్రీనివాస్, స్టాఫ్‌నర్సు విక్టోరియా జయమణి, ల్యాబ్ టెక్నీషియన్ ఎండీ ఖర్సీద్ అలీ, డి.గోవర్థన్, మధులత సహా ఇతర వైద్య సిబ్బంది మృతికి సంతాపంగా బుధవారం రాత్రి ఏడు గంటలకు ఆయా ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్‌తో పోరాడుతున్న వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం కల్పించాలని, మృతి చెందిన హెల్త్‌కేర్ వర్కర్స్ కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి గెజిటెడ్ స్థాయి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం మృతులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడమే కాకుండా సీఎం కేజ్రీవాల్ స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారని, కానీ మన తెలంగాణ హెల్త్‌కేర్ బాధితులు వీటికి నోచుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు.
పరామర్శలకు కూడా నోచుకోలేమా?
వైద్య, ఆరోగ్యశాఖలో ఇప్పటివరకు ముగ్గురు వైద్యులు సహా మరో ఎనిమిది మంది స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు మృతి చెందితే నష్టపరిహారం చెల్లించకపోవడమే కాకుండా కనీసం వారి కుటుంబాలను పరామర్శించకపోవడం శోచనీయమని ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకుడు డాక్టర్ బొంగు రమేశ్ అన్నారు. వైరస్ బారిన పడిన వైద్యులకు నిమ్స్‌లో వైద్యసేవలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందే కానీ, ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడాన్ని పరిశీలిస్తే.. వైద్యులు, వారి కుటుంబాలపై ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతుందని విమర్శించారు. కోవిడ్ చికిత్సలను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని డాక్టర్ రమేష్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment