D. sridhar babu
-
సనోఫీ హెల్త్‌కేర్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న ఫ్రెంచ్ సంస్థ సనోఫీ భారత్‌లో సుమారు రూ.3,655 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) కోసం 2030 నాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సనోఫీ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మ్యాడలిన్ రోచ్ వెల్లడించారు. ఇందులో రూ.914 కోట్లు వచ్చే ఏడాదికల్లా వ్యయం చేస్తామని చెప్పారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సనోఫీ జీసీసీ నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించిన సందర్భంగా రోచ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంలో ప్రస్తుతం 1,000 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. కొత్త ఫెసిలిటీకి 2,600 మంది ఉద్యోగులు కూర్చునే సామర్థ్యం ఉందన్నారు. -
'ఇద్దరు సీఎంలది ఆధిపత్యపోరు'
హైదరాబాద్: ప్రాంతీయ సెంటిమెంట్లకు ఛాంపియన్లమని పేరుతెచ్చుకునే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇష్టానుసారంగా ప్రకటనలు గుప్పిస్తున్నారని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఇద్దరు సీఎంల మధ్య ఆధిపత్యపోరు జరుగుతున్నదని, ఇది ఇరు రాష్ట్రాలకూ చేటు చేస్తుందన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన నిధుల కోసం టీపీసీసీ పోరాడుతుందని స్పష్టం చేశారు. -
'టీఆర్ఎస్ ఏ ముఖంతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది'
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తో పొత్తుకు ససేమిర అని ఇప్పడు బీజేపీతో పొత్తుకు యత్నిస్తోన్న టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబు నిప్పులు చెరిగారు. సోమవారం హైదరాబాద్‌లో శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఓడించేందుకు బీజేపీ యత్నించిందని ఆయన ఆరోపించారు. అలాంటి బీజేపీతో టీఆర్ఎస్ ఏ ముఖంతో పొత్తు పెట్టుకుంటుందంటూ ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలే టీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి... మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన జిల్లాకు చెందిన పెద్దపల్లి ఎంపీ వివేక్ చేరికపై తనకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నమ్మి తామంతా పని చేశామని... కానీ వివేక్ వంటి వారు కాంగ్రెస్‌పై నమ్మకం లేక పార్టీని విడిచి వెళ్లారన్నారు. వివేక్ మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తమ పార్టీ అధిష్టానానికి వివరిస్తామన్నారు. -
బంద్ విజయవంతం
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు నుంచి శాసనసభా వ్యవహారాలశాఖను మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. సీఎం కిరణ్ తీరుపై నిరసనలు వెల్లువెత్తాయి. ఊరూరా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కీలకదశకు చేరుకున్న తరుణంలో... ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సందర్భంగా శాఖ మార్పును తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఆకాంక్షను అవమానించేలా ముఖ్యమంత్రి వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ ముఖ్య నేతలు జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే బంద్‌లో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తది తర నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. కార్యకర్తలు ఉదయం నుంచే బస్‌స్టేషన్ నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నగరంలో ఒకటి రెండు సంఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా జరిగింది. తెరిచిన ఉన్న ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని, జిలేబీ సెంటర్‌ను కార్యకర్తలు బలవంతంగా మూసివేసేందుకు ప్రయత్నిస్తూ సామగ్రి ఎత్తేయడంతో ఉద్రిక్తత నెల కొంది. పోలీసులు వచ్చి ఆందోళన సద్దుమణిగింపజేశారు. మిగతా పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లోనూ బంద్ ప్రభా వం కనిపించింది. జిల్లా అంతటా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరగలేదు. సినిమాహాళ్లు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించారు. దిష్టిబొమ్మల దహనం సీఎం తీరును నిరసిస్తూ అన్ని మండలాల్లో ఆయన దిష్టిబొమ్మల శవయాత్రలు, దహనాలు నిర్వహించారు. అనేక చోట్ల రాస్తారోకోలు చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నాయకులందరూ సీఎం తీరును ముక్త కంఠంతో ఖండించారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం దిష్టిబొమ్మ శవయాత్రలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు. మంత్రి సొంత నియోజకవర్గం మంథనిలో కాంగ్రెస్ నాయకులు 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. కాటారంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోగా సహచరులు అడ్డుకున్నారు. యైటింక్లయిన్‌కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించా రు. మంథని జేఎన్టీయూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. గొల్లపల్లి బస్టాండ్‌లో క్యారం ఆడుతూ నిరసన తెలిపారు. హుస్నాబాద్‌లో బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించిన ఓయూ జేఏసీ
హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు స్థానచలనం కల్పించిన నేపథ్యంలో ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌ను బుధవారం ఓయూ జేఏసీ ముట్టడించింది. సీఎంకు నిరసనగా ఓయూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓయూ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. కాగా, శ్రీధర్‌బాబును తొలగించడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర మంత్రులు సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ ప్రాంతానికి చెందిన మంత్రులపై మొండివైఖరిని అవలంభిస్తున్నారని ఇప్పటికే కొందరు సీఎం పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు శాసన సభ వ్యవహారాలను తప్పించి, వాణిజ్య పన్నులు కేటాయించడం వారిలో మరింత ఆగ్రహన్ని పెంచింది. వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్ బాబుకు అప్పగించారు. అయితే వాణిజ్య శాఖను తీసుకునేందుకు తాను సిద్ధంగా లేనని శ్రీధర్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
‘సమైక్య’ ఊసే వద్దు
పీసీసీ చీఫ్‌కు స్పష్టం చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపీలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మంత్రివర్గ బృందానికీ (జీవోఎం) సమర్పించే నివేదికలో రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే ప్రస్తావనే తీసుకురావొద్దని తెలంగాణ మంత్రులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తెగేసి చెప్పారు. అయితే, విభజన వల్ల సీమాంధ్రలో తలెత్తే సమస్యలను ప్రస్తావిస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అవసరమైతే తాము కూడా అందుకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలోనూ సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు వ్యవహరించాలని, ఈ విషయంలో పార్టీ ప్రతినిధిగా పీసీసీ అధ్యక్షుడు వెళితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రుల నివాస ప్రాంగణంలో సోమవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, రాంరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బసవరాజు సారయ్య, పి.సుదర్శన్‌రెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీమంత్రి షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు బొత్సతో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ నేతలంతా డిప్యూటీ సీఎం నివాసంలో సమావేశమై పీసీసీ చీఫ్‌కు, జీవోఎంకు సమర్పించాల్సిన నివేదికపై కసరత్తు చేశారు. అప్పుల్లో ఎక్కువ భారాన్ని తెలంగాణపై మోపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు. -
భయమా.. బద్దకమా!
=ఆక్రమణల తొలగింపుపై ఉదాసీనత ఎందుకు? =రెవెన్యూ యంత్రాంగంపై మండిపడ్డ ప్రజాప్రతినిధులు =డీఆర్సీలో పట్టణ ప్రాంత సమస్యల ప్రస్తావన సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారు. భూ కబ్జాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏమాత్రం చలనం ఉండట్లేదు. ఎందుకింత ఉదాసీనత? ఆక్రమణదారుల నుంచి ఇబ్బందులుంటున్నాయా? లేదంటే వాటిని తొలగించలేని నిర్లక్ష్యవైఖరా?’ అంటూ రెవెన్యూ, జీహెచ్ఎంసీ యంత్రాంగంపై జిల్లా సమీక్షా మండలి సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో మండలి పట్టణ ప్రాంత సమావేశం జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ప్రసాద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, వాటర్‌బోర్డు ఎండీ శ్యామలరావు, కలెక్టర్ బి.శ్రీధర్, అర్బన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇది అధికారుల నిర్వాకమే... శేరిలింగంపల్లి మండలం కుడికుంట సర్వేనంబర్ 188లో ని చెరువు శిఖంలో ఓ ప్రైవేటు సంస్థ రియల్ వ్యాపారం సాగిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసినా యంత్రాంగం ఇప్పటివరకు స్పందించలేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ శ్రీధర్ స్పందిస్తూ.. అధికారులతో సర్వే చేయించగా ఆక్రమణలున్నట్లు గుర్తించి జీహెచ్ఎంసీకి నివేదిక ఇచ్చామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్... సదరు సంస్థకు నోటీసులు జారీ చేశామని, పరిస్థితిని సమీక్షిస్తానన్నారు. కుత్బుల్లాపూర్ మండలంలో మైనింగ్ కోసం ఓ కంపెనీకి భూమి కేటాయిస్తే దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని, ఇది చట్టవిరుద్ధమని ఎమ్మెల్యే కూన శ్రీశైలం అన్నా రు. మల్కాజ్‌గిరిలోనూ ఇదే తరహాలో ఆక్రమణలున్నాయంటూ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ చెప్పగా... తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదులిచ్చారు. నీళ్లివ్వండి.. రోడ్లు వేయండి... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా శివార్లలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. కేటాయింపులో కోతలు పెడుతుండడంతోనే సమస్య తీవ్రతరమవుతుందని ఎమ్మెల్యేలు ఎం.కిషన్‌రెడ్డి, కేఎల్లార్ తదితరులు వాటర్‌బోర్టుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో బిల్లులు చెల్లించిన మేరకు నీళ్లిస్తున్నామని వాటర్‌బోర్డు ఎండీ శ్యామలరావు స్పష్టంచేశారు. మల్కాజ్గిరి వాంబే కాలనీలో నిర్మాణాలు చేపట్టి ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ లబ్ధిదారులకు అందించలేదని, అక్కడి సామగ్రిని కొందరు దొంగిలిస్తున్నారని ఎమ్మెల్యేలు అన్నారు. నీటివసతి లేకపోవడంతో అబ్దుల్లాపూర్‌మెట్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తాగునీటిని కేటాయించాలని కోరగా...పంచాయతీల పరిధిలో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అక్కడ నీటి సరఫరా నిలిపివేశామని, చెల్లిం పులు చేసిన వెంటనే పునరుద్ధరిస్తున్నామని శ్యామలరావు చెప్పారు. వర్షాలతో గ్రేటర్ రోడ్లు అధ్వానంగా మారాయని, వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా, ప్రణాళిక రూపొందించి మరమ్మతులు చేస్తామని ఆర్అండ్బీ అధికారులు సమాధానమిచ్చారు. విలీనంపై తేల్చండి ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో పంచాయతీల విలీనంపై స్పష్టత ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు బదులిచ్చారు. నాగేశ్వర్ నిరసన అల్వాల్ ప్రభుత్వ పాఠశాలలో భవనం లేక విద్యార్థులు రోడ్ల పక్కన కూర్చోవాల్సి వస్తోందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఓ సోమిరెడ్డి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయగా.. సంతృప్తి చెందని ఆయన కుర్చీలోంచి లేచి వేదిక ముందు బైఠాయించారు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ప్రకటనలు చేశారని, అయినా ఫలితం కనిపించలేదన్నారు. ఇందుకు ఎమ్మెల్యే జేపీ మద్దతు పలికారు. వారంలోపు షెడ్లు వేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
థర్డ్ అంపైర్ చెబితే వినాల్సిందే: శ్రీధర్‌బాబు
థర్డ్ అంపైర్ చెబితే వినాల్సిందే ఉపాధ్యాయ గర్జనలో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి లక్ష్యంగా పరోక్ష విమర్శలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనమేనని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ‘‘యుద్ధం అయిపోయింది. మేం గెలిచాం. అంతిమ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. అయితే ఇంకా చివరి బంతి ఉందని అంటున్నారు. అంటే నో బాల్ వేస్తే పది పరుగులు గుంజవచ్చనే యత్నంలో ఉన్నారు. కానీ మ్యాచ్ అయిపోయింది. థర్డ్ అంపైర్‌పై నమ్మకం ఉంచాలి. ఆయన చెప్పినప్పుడు మైదానం వీడివెళ్లాలి. క్రీ డాస్ఫూర్తి ఉన్నవాళ్లు చేయాల్సిందిదే. ఆ క్రీడాస్ఫూర్తి ఉంది కాబట్టే మంత్రులమైనా, ఎమ్మెల్యేలమైనా ఓపిగ్గా ఉన్నాం. నేను చెప్పినా, సీఎం చెప్పినా, ఎవరేం చెప్పినా సీడబ్ల్యూసీ చేసిన తీర్మానమే శిలాశాసనం. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తథ్యం..’’ అని చెప్పారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ పీఆర్టీయూ నిర్వహించిన ‘ఉపాధ్యాయ గర్జన’లో శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీల నేతలతో పాటు కొందరు సొంతపార్టీ నేతలు కూడా సీఎంపై ధ్వజమెత్తారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘కొందరు పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారు. 1955లో నెహ్రూ ఏమన్నారు? తెలంగాణ ప్రజలు ఎప్పుడు విడిపోవాలని కోరుకుంటే అప్పుడు తెలంగాణ ఇవ్వాల్సిందేనని అన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయిన సంగతి గుర్తుతెచ్చుకోవాలి. 60 శాతం తమిళులే ఉన్నారని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఆనాడు అయ్యదేవర కాళేశ్వరరావు చెప్పారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా అందుకే. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్నవారు చరిత్ర చూడాలి. హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డవారే అభివృద్ధి చెందారు తప్ప వారు హైదరాబాద్‌కు చేసిందేమీ లేదు. నీళ్లు, ఉద్యోగాలంటూ.. హైదరాబాద్ విషయంలో రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించవద్దు. నీటి సమస్య వస్తుందంటున్నవాళ్లు ఇన్నేళ్లు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేదెందుకు? మనవాళ్లు బెంగళూరులో చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతమాత్రాన బెంగళూరు మనది అనడం సమంజసమా? న్యూయార్క్‌లోనూ, వాషింగ్టన్లోనూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతమాత్రాన అవి మనవే అంటే ఊరుకుంటారా? ప్రపంచంలోని ఏ రాజ్యాంగంలోనూ అలా లేదు..’ అని అన్నారు. కరీంనగర్ పర్యటన సందర్భంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని సీఎం చెప్పారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు మాటమార్చి వెధవ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఆయన మాటలు వింటుంటే కడుపులో మండుతోంది. సీఎం పదవి నిలుపుకునేందుకు మూడేళ్లుగా అధిష్టానం మాటకు సరేనని ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఆయన తెలుగు జాతిని విడగొట్టవద్దని అంటున్నారు. అసలు ఆయనకు తెలుగువచ్చా? ఆయన భాష ఎవరికైనా అర్థమవుతుందా? నా ఇంటి వెనకాలే ఉంటారు. ఆయన మాటలు కానీ, బొత్స సత్యనారాయణ మాటలు కానీ నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. మేం ఆంటోనీ కమిటీ వద్దకు వెళ్లినప్పుడు హైదరాబాద్ సంగతేంటని అడిగారు. ఒకటే ఉదాహరణ చెప్పాం. తిరుపతికి వెళ్లినప్పుడు అక్కడ హుండీలో డబ్బులు వేస్తాం. అంతమాత్రాన తిరుపతి మాక్కావాలంటే కుదురుతుందా అని అడిగాం. కమిటీకి బోధపడింది. తెలంగాణ వచ్చితీరుతుంది..’ అని పేర్కొన్నారు. పట్టుచీరల షోరూములు ఎక్కడికీ వెళ్లవు..! సమన్యాయం చేస్తామన్నవాళ్లు సీమాంధ్రకు కావాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలని గుత్తా సూచించారు. రాజధాని ఎక్కడ ఉండాలో, ఎలాంటి రక్షణ కావాలో చెప్పాలి తప్ప విభజనను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ‘‘సీమాంధ్ర మంత్రుల భార్యలు ఢిల్లీ వెళ్లి విభజనను అడ్డుకోవాలని చూశారు. తల్లీ మీ పట్టుచీరల షోరూములు ఎక్కడికీ వెళ్లవు. మీ రాజధానిలో కూడా పెద్ద పెద్ద షోరూములు వస్తాయి. సీమాంధ్ర మంత్రులు కూడా రాష్ట్రాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు. మా నోటికాడి బుక్క లాక్కోకండి. అన్నదమ్ముల్లా కలిసి ఉందాం..’’ అని అన్నారు. మేం కలిసి ఉండమంటే యాసిడ్ పోసి బెదిరించి కలిసి ఉండాల్సిందేనన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదని కేశవరావు అన్నారు. ముఖ్యమంత్రి నీటివివాదాల గురించి మాట్లాడుతున్నారంటూ.. నీటి పారుదల శాఖ మంత్రి వెంటనే దానిపై వివరణ ఇచ్చిన సంగతి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మాటల్లో కొంచెం కూడా సిగ్గూ లజ్జా లేదని విమర్శించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యే ముఖ్యమంత్రి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటుపై ఇంకా ఆలస్యం చేస్తే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. చంద్రబాబు జూలై 30 కంటే ముందు ఒకలా, ఇప్పుడు మరొకలా ఊగిసలాట ధోరణితో ఉన్నారని సీపీఐ నేత చాడ విమర్శించారు. గర్జనసభకు తెలంగాణ పది జిల్లాల నుంచి భారీగా ఉపాధ్యాయులు తరలివచ్చారు. పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటరెడ్డి, పి.సరోత్తమరెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి ప్రసంగించారు. -
ఎన్నాళ్లీ అనిశ్చితి?
ఏపీ ఎన్జీవోల సమ్మెపై కేబినెట్లో మంత్రి జానారెడ్డి ప్రభుత్వ తీరుపై అపోహలున్నాయని వ్యాఖ్య త్వరలో అన్నీ సర్దుకుంటాయన్న కిరణ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సమ్మెపై శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. సమ్మెపై ప్రభుత్వ తీరును తెలంగాణకు చెందిన మంత్రి కె.జానారెడ్డి తప్పుబట్టారు. సీఎం కిరణ్కుమార్రెడ్డితోసహా సీమాంధ్ర మంత్రులు అందుకు అభ్యంతరం తెలిపారు. సమ్మెను విరమింపజేసే విషయంలో ప్రభుత్వ తీరుపై అనేక అపోహలు కలుగుతున్నాయని జానా అనగా, తెలంగాణ ఉద్యోగుల సమ్మె సమయంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడూ పాటిస్తున్నామని కిరణ్ చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యోద్యమాన్ని జానా ప్రస్తావించారు. సమ్మెతో ఆ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవస్థ స్తంభించిందన్నారు. 50 రోజులు దాటుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఉద్యోగ సంఘాలతో చర్చించి తక్షణమే సమ్మె విరమించేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిపై మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయిస్తే బాగుండేదన్నారు. తెలంగాణ ఎన్జీఓలు సమ్మె చేసిన ప్పుడు అనుసరించిన విధానాన్నే ఇప్పుడూ పాటిస్తున్నామని కిరణ్ బదులిచ్చారు. సీమాంధ్రలో 6 లక్షలకుపైగా ప్రభుత్వ సిబ్బంది సమ్మె చేస్తున్న తరుణంలో రచ్చబండను నిర్వహించలేమన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలన్నీ త్వరలో సర్దుకుంటాయని, తరవాత రచ్చబండతో సహా అన్ని కార్యక్రమాలనూ భారీగా ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీధర్‌బాబు ఆగ్రహం రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న తనకు తెలియకుండా జిల్లాలో పలు పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయడంపై మంత్రి డి.శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలిపారని సమాచా రం. వాటిని గ్రేటర్లో కలపకుండా ప్రత్యేక మున్సిపాలిటీలుగా చేసి ఉంటే బాగుండేదని మంత్రి ప్రసాద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం, హైదరాబాద్‌పై వివాదం నేపథ్యంలో గ్రేటర్ పరిధిని పెంచడంపై చాలా అపోహలున్నాయని మరికొందరు మంత్రులు అన్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని కిరణ్ చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానించినందునే విలీనంపై ప్రభుత్వం జీఓ ఇచ్చిందని తెలిపారు. నిర్ణయాల్లో తొందరపాటు తగదని, అలాంటి నిర్ణయాల వల్లే కేబినెట్లో మూడు సీట్లు ఖాళీ అయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజీనామాలు చేసినా కేబినెట్‌కు మంత్రులు జె.గీతారెడ్డి, దానం నాగేందర్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, అహ్మదుల్లా, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య మినహా తక్కిన మంత్రులంతా భేటీకి హాజరయ్యారు. మంత్రులు కొండ్రు మురళి, మహీధర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు తదితరులు రాజీనామాలు చేసినట్టు ప్రకటించినప్పటికీ భేటీలో పాల్గొనడం విశేషం.