‘సమైక్య’ ఊసే వద్దు
పీసీసీ చీఫ్‌కు స్పష్టం చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపీలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మంత్రివర్గ బృందానికీ (జీవోఎం) సమర్పించే నివేదికలో రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే ప్రస్తావనే తీసుకురావొద్దని తెలంగాణ మంత్రులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తెగేసి చెప్పారు. అయితే, విభజన వల్ల సీమాంధ్రలో తలెత్తే సమస్యలను ప్రస్తావిస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అవసరమైతే తాము కూడా అందుకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలోనూ సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు వ్యవహరించాలని, ఈ విషయంలో పార్టీ ప్రతినిధిగా పీసీసీ అధ్యక్షుడు వెళితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రుల నివాస ప్రాంగణంలో సోమవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, రాంరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బసవరాజు సారయ్య, పి.సుదర్శన్‌రెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీమంత్రి షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు బొత్సతో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ నేతలంతా డిప్యూటీ సీఎం నివాసంలో సమావేశమై పీసీసీ చీఫ్‌కు, జీవోఎంకు సమర్పించాల్సిన నివేదికపై కసరత్తు చేశారు. అప్పుల్లో ఎక్కువ భారాన్ని తెలంగాణపై మోపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు.