ఏపీ ఎన్జీవోల సమ్మెపై కేబినెట్‌లో మంత్రి జానారెడ్డి
ప్రభుత్వ తీరుపై అపోహలున్నాయని వ్యాఖ్య
త్వరలో అన్నీ సర్దుకుంటాయన్న కిరణ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సమ్మెపై శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. సమ్మెపై ప్రభుత్వ తీరును తెలంగాణకు చెందిన మంత్రి కె.జానారెడ్డి తప్పుబట్టారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితోసహా సీమాంధ్ర మంత్రులు అందుకు అభ్యంతరం తెలిపారు. సమ్మెను విరమింపజేసే విషయంలో ప్రభుత్వ తీరుపై అనేక అపోహలు కలుగుతున్నాయని జానా అనగా, తెలంగాణ ఉద్యోగుల సమ్మె సమయంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడూ పాటిస్తున్నామని కిరణ్ చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యోద్యమాన్ని జానా ప్రస్తావించారు. సమ్మెతో ఆ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవస్థ స్తంభించిందన్నారు. 50 రోజులు దాటుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఉద్యోగ సంఘాలతో చర్చించి తక్షణమే సమ్మె విరమించేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిపై మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయిస్తే బాగుండేదన్నారు. తెలంగాణ ఎన్జీఓలు సమ్మె చేసిన ప్పుడు అనుసరించిన విధానాన్నే ఇప్పుడూ పాటిస్తున్నామని కిరణ్ బదులిచ్చారు. సీమాంధ్రలో 6 లక్షలకుపైగా ప్రభుత్వ సిబ్బంది సమ్మె చేస్తున్న తరుణంలో రచ్చబండను నిర్వహించలేమన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలన్నీ త్వరలో సర్దుకుంటాయని, తరవాత రచ్చబండతో సహా అన్ని కార్యక్రమాలనూ భారీగా ప్రారంభిస్తామని చెప్పారు.
శ్రీధర్‌బాబు ఆగ్రహం
రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న తనకు తెలియకుండా జిల్లాలో పలు పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయడంపై మంత్రి డి.శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలిపారని సమాచా రం. వాటిని గ్రేటర్‌లో కలపకుండా ప్రత్యేక మున్సిపాలిటీలుగా చేసి ఉంటే బాగుండేదని మంత్రి ప్రసాద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం, హైదరాబాద్‌పై వివాదం నేపథ్యంలో గ్రేటర్ పరిధిని పెంచడంపై చాలా అపోహలున్నాయని మరికొందరు మంత్రులు అన్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని కిరణ్ చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానించినందునే విలీనంపై ప్రభుత్వం జీఓ ఇచ్చిందని తెలిపారు. నిర్ణయాల్లో తొందరపాటు తగదని, అలాంటి నిర్ణయాల వల్లే కేబినెట్‌లో మూడు సీట్లు ఖాళీ అయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
రాజీనామాలు చేసినా కేబినెట్‌కు
మంత్రులు జె.గీతారెడ్డి, దానం నాగేందర్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, అహ్మదుల్లా, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య మినహా తక్కిన మంత్రులంతా భేటీకి హాజరయ్యారు. మంత్రులు కొండ్రు మురళి, మహీధర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు తదితరులు రాజీనామాలు చేసినట్టు ప్రకటించినప్పటికీ భేటీలో పాల్గొనడం విశేషం.