K. Janareddy
-
మేం చేయకపోతే మీరు చేశారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేయకపోతే బీఆర్ఎస్ చేసిందా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సంస్కారం లేకుండా రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేస్తున్నారని, సంస్కారం లేని వారి గురించి తాను ఎక్కువ మాట్లాడబోనని వ్యాఖ్యానించారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అసమ్మతి నేత జగదీశ్వరరావు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆయనను బుజ్జగించిన జానారెడ్డి ఆదివారం తన నివాసంలో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పారు. అనంతరం జగదీశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇతర నేతలతో కలసి జానారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని, 1995 నాటికే దేశంలోని ఐదు లక్షల గ్రామాలకు విద్యుత్ అందించింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. తమ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్, రూపాయికి కిలోబియ్యం, ఆహారభద్రత, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాలు అమలయ్యాయని, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వచ్చాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు కోల్పోయింది కాంగ్రెస్ నేతలయితే, ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకుంది బీఆర్ఎస్ నేతలని ధ్వజమెత్తారు. గత తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ చేస్తానని చెప్పిన పనుల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుడికి సీఎం పదవి, మూడెకరాల భూమి పంపిణీ ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ‘అటవీ హక్కులు కాంగ్రెస్ కల్పించకపోతే పోడు భూములు వచ్చేవా? 2004లోనే ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి వారి కరెంటు బిల్లులను మాఫీ చేసింది కాంగ్రెస్ కాదా? అంతకంటే మీరు ఎక్కువేం చేశారు? మేం ఇచ్చిన వాటిని కొనసాగించారు’అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఐదున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతానని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీని ప్రజలు సహించే స్థితిలో లేరని జానా అన్నారు. -
అసెంబ్లీ నుంచి జానారెడ్డి వాకౌట్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి ప్రతిపక్షనేత కె.జానారెడ్డి శుక్రవారం వాకౌట్ చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష నేత జానారెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగల సమస్యను లేవనెత్తారు. దీనిపై సమాధానం చెప్పాలని ఆయన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. అందుకు ఆయన సమాధానంపై జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటెల సమాధానంతో తాము సంతృప్తి చెందలేదని తెలుపుతూ జానారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. రెండేళ్లలో లక్ష ఉద్యోగాలకు నోటిపికేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వ చర్యలు చేపట్టనుందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పటికే రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో గురువారం ఉస్మానియా యూనివర్శిటీలో నిరుద్యోగుల ఐకాస ర్యాలీ నిర్వహించి.. అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. -
పూర్తి వివరాలు అందజేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి అవినీతి, అక్రమాలపై తేరా చిన్నపరెడ్డి ఇచ్చి న ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. జానారెడ్డి అక్రమాలపై తానిచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఏ మాత్రం స్పందిం చడం లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు తేరా చిన్నపరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ నవీన్‌రావు విచారించారు. జనారెడ్డి అధికార దుర్వినియోగం, అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేశామని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం సమర్పించామని చిన్నారెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను జానారెడ్డి ఏ విధంగా తుంగలో తొక్కిందీ సీబీఐకి, కేంద్ర హోంశాఖకు ఆధారాలతో వివరించామన్నారు. అయితే సీబీఐ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కేంద్ర హోంశాఖ మాత్రం జానారెడ్డిపై తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించిందని, అయితే ఇప్పటి వరకు వారు ఏ విధంగానూ స్పందించలేదని, అందుకే కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సీబీఐ తరఫు న్యాయవాదిని పిలిపించి, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను 21కి వాయిదా వేశారు. -
మమ్నల్ని అడగకుండానే నియమిస్తారా?
రూల్స్ కమిటీలో కాంగ్రెస్ సభ్యుల నియామకంపై జానా అభ్యంతరం స్పీకర్ మధుసూదనాచారికి లేఖ! సాక్షి, హైదరాబాద్: తమను సంప్రదించకుండానే తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ‘రూల్స్’ కమిటీలో ఎలా నియమించారని, ఈ విషయం లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని సీఎల్పీనేత కె.జానారెడ్డి ఆక్షేపించారు. ఈ మేరకు బుధవారం ఆయన అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. అయితే ఈ లేఖను అధికారికంగా బయట పెట్టని జానా, అందులో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. మంగళవారం స్పీకర్ రూల్స్ కమిటీని ప్రకటించారు. ఆ కమిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు. వీరిని కమిటీలోకి తీసుకునే ముందు సీఎల్పీ నేతను సంప్రదించలేదని తెలుస్తోంది. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన భట్టి విక్రమార్కను పార్టీ తరఫున రూల్స్ కమిటీలో ఉంచాలన్న ఆలోచనలో సీఎల్పీ ఉన్న ట్లు సమాచారం. ఈ కారణంగానే జానా స్పీకర్‌కు లేఖ రాసినట్లు చెబుతున్నారు. -
'పీసీసీ చీఫ్ పదవి ఆశించడం లేదు'
-
'పీసీసీ చీఫ్ పదవి ఆశించడం లేదు'
న్యూఢిల్లీ: తాను పీసీసీ అధ్యక్ష పదవి ఆశించడం లేదని తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... పీసీసీ అధ్యక్షుణ్ని అధిష్టానం మార్చాలనుకుంటే సలహాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల సందర్భాను సారంగా మాట్లాడలేకపోతున్నారని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మేధోమథనం సదస్సు ఎప్పుడనేది పొన్నాల తనతో చెప్పలేదని అన్నారు. అలాగే నిన్న ప్రకటించిన సీఎల్పీ కమిటీ ఏర్పాటుపై కూడా తాను పొన్నాలతో చర్చించలేదని తెలిపారు. పీఏసీ ఛైర్మన్ ఎవరనేది తానే నిర్ణయిస్తానని జానారెడ్డి వెల్లడించారు. -
పార్టీలో సమర్థవంతమైన నేతలు ఉన్నప్పటికీ...
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీ వీడటం తీవ్ర విచారకరమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు కె.జానారెడ్డి అన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చకోవడంపై గురువారం హైదరాబాద్‌లో విలేకర్లు ప్రశ్నించినప్పుడు కె.జానారెడ్డిపై విధంగా స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకులకు కొదవ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ నాయకులను సరైన సమయంలో సరైన విధంగా తాము ప్రొజెక్ట్ చేయలేకపోయామని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధిష్టానం... ఎన్నికల ముందు హడావుడిగా రాష్ట్ర నాయకత్వంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిందంటూ పరోక్షంగా పీసీసీ చీఫ్ పొన్నాల నియామకాన్ని జానారెడ్డి వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేస్తామనమి ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు సాధ్యమైనంత త్వరలో పార్టీ పరిస్థతిని సమీక్షించుకుంటామని జానారెడ్డి వెల్లడించారు. -
సిద్దాంతాలు నచ్చితే ఎవరైనా రావొచ్చు: జానా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సిద్దాంతాలు నచ్చిన వారెవరైనా పార్టీలో చేరవచ్చని మాజీ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ తిరిగి సొంతగూటికి రావడంపై ప్రశ్నించగా.. ఆయన పై విధంగా స్పందించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ దిగ్విజయ్‌తో భేటీ అయిన విషయం తనకు తెలియదన్నారు. కాగా, ఎంపీ ,ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి దిగ్విజయ్‌కు జానారెడ్డి పలు ప్రతిపాదనలు ఇచ్చినట్టు సమాచారం. అయితే అంతకు ముందు అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ దిగ్విజయ్‌తో సమావేశమయ్యారు. -
అది నివేదికైతే అంగీకరించొద్దు: జానారెడ్డి
కేంద్రానికి జానారెడ్డి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి రాష్ట్ర విభజనపై పంపిన నివేదికను అంగీకరించవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లేదని పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం గాంధీభవన్‌లో మంత్రి రఘువీరారెడ్డి, పీసీసీ నాయకులు బి.కమలాకరరావు, మాదాసు గంగాధర్, కుమార్‌రావు, జెల్లి సిద్ధయ్య, సుధాకర్‌బాబులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జానారెడ్డి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రానికి సీఎస్ పంపింది సమాచారమా? ప్రభుత్వ నివేదికా? అనేది తెలియలేదు. సమాచారమే అయితే అభ్యంతరం లేదు. నివేదిక అయితే మాత్రం మేం అంగీకరించం. ఎందుకంటే అది కేబినెట్ ఆమోదం లేని నివేదిక అవుతుంది. అందుకే దాన్ని ఆమోదించవద్దని కే ంద్రాన్ని కోరుతున్నాం..’ అని చెప్పారు. -
ఎన్నాళ్లీ అనిశ్చితి?
ఏపీ ఎన్జీవోల సమ్మెపై కేబినెట్లో మంత్రి జానారెడ్డి ప్రభుత్వ తీరుపై అపోహలున్నాయని వ్యాఖ్య త్వరలో అన్నీ సర్దుకుంటాయన్న కిరణ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సమ్మెపై శుక్రవారం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. సమ్మెపై ప్రభుత్వ తీరును తెలంగాణకు చెందిన మంత్రి కె.జానారెడ్డి తప్పుబట్టారు. సీఎం కిరణ్కుమార్రెడ్డితోసహా సీమాంధ్ర మంత్రులు అందుకు అభ్యంతరం తెలిపారు. సమ్మెను విరమింపజేసే విషయంలో ప్రభుత్వ తీరుపై అనేక అపోహలు కలుగుతున్నాయని జానా అనగా, తెలంగాణ ఉద్యోగుల సమ్మె సమయంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడూ పాటిస్తున్నామని కిరణ్ చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యోద్యమాన్ని జానా ప్రస్తావించారు. సమ్మెతో ఆ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవస్థ స్తంభించిందన్నారు. 50 రోజులు దాటుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఉద్యోగ సంఘాలతో చర్చించి తక్షణమే సమ్మె విరమించేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిపై మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయిస్తే బాగుండేదన్నారు. తెలంగాణ ఎన్జీఓలు సమ్మె చేసిన ప్పుడు అనుసరించిన విధానాన్నే ఇప్పుడూ పాటిస్తున్నామని కిరణ్ బదులిచ్చారు. సీమాంధ్రలో 6 లక్షలకుపైగా ప్రభుత్వ సిబ్బంది సమ్మె చేస్తున్న తరుణంలో రచ్చబండను నిర్వహించలేమన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలన్నీ త్వరలో సర్దుకుంటాయని, తరవాత రచ్చబండతో సహా అన్ని కార్యక్రమాలనూ భారీగా ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీధర్‌బాబు ఆగ్రహం రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న తనకు తెలియకుండా జిల్లాలో పలు పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయడంపై మంత్రి డి.శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలిపారని సమాచా రం. వాటిని గ్రేటర్లో కలపకుండా ప్రత్యేక మున్సిపాలిటీలుగా చేసి ఉంటే బాగుండేదని మంత్రి ప్రసాద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం, హైదరాబాద్‌పై వివాదం నేపథ్యంలో గ్రేటర్ పరిధిని పెంచడంపై చాలా అపోహలున్నాయని మరికొందరు మంత్రులు అన్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని కిరణ్ చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానించినందునే విలీనంపై ప్రభుత్వం జీఓ ఇచ్చిందని తెలిపారు. నిర్ణయాల్లో తొందరపాటు తగదని, అలాంటి నిర్ణయాల వల్లే కేబినెట్లో మూడు సీట్లు ఖాళీ అయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజీనామాలు చేసినా కేబినెట్‌కు మంత్రులు జె.గీతారెడ్డి, దానం నాగేందర్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, అహ్మదుల్లా, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య మినహా తక్కిన మంత్రులంతా భేటీకి హాజరయ్యారు. మంత్రులు కొండ్రు మురళి, మహీధర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు తదితరులు రాజీనామాలు చేసినట్టు ప్రకటించినప్పటికీ భేటీలో పాల్గొనడం విశేషం. -
ఇరుప్రాంతాల వారు సంయమనం పాటించాలి: జానారెడ్డి
అలిపిరి వద్ద రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై సమైక్యవాదుల దాడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.జానారెడ్డి శనివారం ఖండించారు. సంయమనం పాటించాలని అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతాల ప్రజలకు ఆయన సూచించారు. రెచ్చగొట్టే చర్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎంతో సహా ఎవరైన పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని జానారెడ్డి స్పష్టం చేశారు. సీఎం సమైక్య రాష్ట్రం అని చెప్పడం ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు. లేదంటే కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని జానారెడ్డి తెలిపారు.