సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి అవినీతి, అక్రమాలపై తేరా చిన్నపరెడ్డి ఇచ్చి న ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. జానారెడ్డి అక్రమాలపై తానిచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఏ మాత్రం స్పందిం చడం లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు తేరా చిన్నపరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ నవీన్‌రావు విచారించారు.
జనారెడ్డి అధికార దుర్వినియోగం, అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేశామని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం సమర్పించామని చిన్నారెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను జానారెడ్డి ఏ విధంగా తుంగలో తొక్కిందీ సీబీఐకి, కేంద్ర హోంశాఖకు ఆధారాలతో వివరించామన్నారు. అయితే సీబీఐ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కేంద్ర హోంశాఖ మాత్రం జానారెడ్డిపై తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించిందని, అయితే ఇప్పటి వరకు వారు ఏ విధంగానూ స్పందించలేదని, అందుకే కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సీబీఐ తరఫు న్యాయవాదిని పిలిపించి, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను 21కి వాయిదా వేశారు.
పూర్తి వివరాలు అందజేయండి: హైకోర్టు
Published Fri, Nov 14 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement