సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరులో చేపట్టిన డాక్టర్ వైఎస్సార్ వైద్య కళాశాల నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే అన్ని విభాగాలకు సంబంధించి 25 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందుకు సుమారు రూ.70 కోట్లు వెచ్చించారు. ఎన్‌సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. చలిగాలులను తట్టుకుంటూనే సుమారు 500 మంది వరకు కూలీలు శ్రమిస్తున్నారు. స్థానిక తలారిసింగి ప్రభుత్వ ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. ఈ నిధుల్లో సగం కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది.
మూడు బ్లాక్‌ల్లో పనుల జోరు
మెడికల్ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇక్కడ పనులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో సమీక్షిస్తుంటారు. ప్రస్తుతం మెడికల్ కళాశాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.ఈ బ్లాక్‌లోని పలు భవన నిర్మాణాలు మూడవ అంతస్తుకు చేరుకున్నాయి. కొన్ని భవనాల నిర్మాణ పనులు మొదటి అంతస్తు దాటాయి. నర్సింగ్ కళాశాల విభాగానికి సంబంధించి ఒక బ్లాక్‌లో భవన నిర్మాణం రెండవ అంతస్తు శ్లాబ్‌కు సిద్ధమైంది. ఇదే బ్లాక్‌లోని పలు భవనాల పనులు పిల్లర్ల స్థాయిలో ఉన్నాయి. ప్రధాన వైద్య కళాశాల బ్లాక్‌కు సంబంధించి ఎన్‌సీసీ ఇంజనీరింగ్ అధికారులు మరింత దృష్టి పెట్టారు. భూమిని చదును చేసి పిల్లర్లకు బాగా లోతుగా తవ్వే పనులకే చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఆయా పనులన్ని సజావుగా జరగడంతో పిల్లర్ల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి.
గడువులోగా పూర్తి చేస్తాం
చలితీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణంలోను నిర్మాణ పనులకు ఇబ్బందులు లేకుండా ఎన్‌సీసీ సంస్థ పనిచేస్తోంది. నాణ్యతలో రాజీ లేకుండా నిరంతరం తమ ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.నిర్మాణ సామగ్రి శాంపిళ్లను కూడా ల్యాబ్‌ల్లో నాణ్యత నిర్థారణ పరీక్షలు జరిపిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈఏడాది డిసెంబర్ నెలాఖరుకు మొత్తం పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నాం. శీతాకాలం ముగియగానే పనులు మరింత వేగవంతం చేస్తాం.
– డీఏ నాయుడు, ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్, ఏపీఎస్‌ఎంఐడీసీ.
Comments
Please login to add a commentAdd a comment