గిరిజనుల జీవన ప్రమాణాలు పూర్తిస్థాయిలో పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. పాడేరులో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు ఓ వైపు వేగంగా పూర్తి చేస్తుండడంతో పాటు, ఆ స్థాయి వైద్య సేవలను ముందుగానే అందుబాటులోకి తెస్తోంది.
సాక్షి,పాడేరు: గిరిజనులకు ఉన్నత వైద్యసేవలు కల్పించడం లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన పాడేరులో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని హమీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రూ.500కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ప్రస్తుతం 35ఎకరాల విస్తీర్ణంలో తలారిసింగి పాలి టెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెడికల్ కళాశాల,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఈఏడాదిలో మొత్తం అన్ని భవనాలను పూర్తి చేసే లక్ష్యంతో ఎన్‌సీసీ నిర్మాణ సంస్థ చురుగ్గా పనులు నిర్వహిస్తోంది.
జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరుమార్పు
వైద్య విధాన పరిషత్‌లో ఇంతవరకు పనిచేసిన పాడేరు జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఇటీవల విలీనం చేసి జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరు మార్చారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు ఇంకా గడువు ఉండడంతో ముందస్తుగానే పాడేరు జిల్లా జనరల్ ఆస్ప త్రిలో 420 బెడ్‌లలో రోగులకు 24గంటల పాటు ఉన్నత వైద్యసేవలకుచర్యలు చేపట్టింది.
పాడేరు జిల్లా ఆస్పత్రిలో అదనపు అంతస్తును యుద్ధప్రాతిపదికన ఇటీవల పూర్తి చేసి, అన్ని సదుపాయాలతో పడకలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 50 ప్రత్యేకంగా గర్భిణులకు, మరో 50 మాతా శిశువుల ఆరోగ్యసేవలకు, 50 పడకలు రక్తహీనత సమస్య ఉన్న మహిళా రోగులకు కేటాయించనున్నారు.
జాతీయ వైద్యమండలి పరిశీలనకు ఏర్పాట్లు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన 420 బెడ్‌లు,ఇతర సౌకర్యాలు,వైద్య నిపుణులు,అందించే సేవలను సమగ్రంగా పరిశీలించేందుకు జాతీయ వైద్య మండలి పర్యటించనుంది. ఈ మండలి పరిశీలన తరువాత మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా జనరల్ ఆస్పత్రి సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి.
256 పోస్టుల భర్తీకి చర్యలు
మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రులకు సంబంధించి వివిధ విభాగాల్లో 706 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముందుగా 256 పోస్టుల భర్తీని కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేగవంతం చేసింది. మిగిలిన వైద్యులు,నర్సింగ్,ఇతర విభాగాల పోస్టులకు వైద్య ఆరోగ్యశాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
విధుల్లో వైద్య నిపుణులు
పాడేరు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా జిల్లా ప్రజలకు నిరంతర ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో ముందస్తుగానే ప్రభుత్వం వైద్యులను నియమించింది. పాడేరు మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫె సర్లు, 17మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.
రోగులకు ఉన్నత వైద్యసేవలు
రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. భవనాల నిర్మాణాలతో సంబంధం లేకుండా 420 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చాం. అన్ని విభాగాల వైద్యపోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. – డాక్టర్ డి.హేమలతాదేవి, ప్రిన్సిపాల్,పాడేరు మెడికల్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment