జీవో–94 అమలు విషయంలో ఏరకంగానూ ముందుకెళ్లవద్దన్న హైకోర్టు
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు
కన్వీనర్ కోటా సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వడం చెల్లదంటూ పిటిషన్
ఉన్న సీట్లలోనే 10 శాతం ‘ఈడబ్ల్యూఎస్’ సరికాదని అభిప్రాయపడ్డ హైకోర్టు
మధ్యంతర ఉత్తర్వులు జారీ.. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీలు మినహా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద జనరల్ కేటగిరిలో భర్తీ చేసే మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను ఆర్థిక బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న జారీ చేసిన జీవో 94 అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ జీవో అమలు విషయంలో ఏ రకంగానూ ముందుకెళ్లవద్దంది. ఈ జీవో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది.
ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఉన్న సీట్లలో కాకుండా దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచి, అందులో కేటాయించాల్సి ఉంటుందన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనతో హైకోర్టు ప్రాథమికంగా ఏకీభవించింది. జీవో 94 విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎన్‌ఎంసీ, డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తదితరులను ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అది రాజ్యాంగ విరుద్ధం..
సీట్ల సంఖ్య పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 94ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన పోగిరి చరిష్మా, గుంటూరు జిల్లాకు చెందిన అప్పారి సాయి వెంకట ఆదిత్య, యమవరపు మృదులత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది యరగొర్ల ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ, ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలనుకుంటే ఎన్‌ఎంసీ అనుమతి తీసుకుని దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చునన్నారు.
సీట్ల సంఖ్యను పెంచకుండా, ఉన్న సీట్లలో 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్ కింద భర్తీ చేయడానికి వీల్లేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కన్వీనర్ కోటా కింద ఉన్న మొత్తం సీట్లలోనే 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్‌కు కేటాయిస్తూ జీవో 94 జారీ చేసిందన్నారు. దీనివల్ల జనరల్ కోటా సీట్లలో 10 శాతం సీట్లు తగ్గుతాయన్నారు. దీంతో పిటిషనర్ల వంటి వారు ఎంతో మంది నష్టపోతున్నారని తెలిపారు.
జనహిత్ అభియాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా జీవో 94 ఉందన్నారు. అసలు ఈ జీవో రహస్యంగా ఉందని, ఇప్పటి వరకు ప్రజా బాహుళ్యంలోకి తీసుకురాలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఈ జీవో వల్ల పిటిషనర్లకు నష్టం జరుగుతుందని భావిస్తున్నారా? వారి అవకాశాలను ఈ జీవో దెబ్బతీస్తుందా? అని ప్రశ్నించింది. అవునని, పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఠాగూర్ యాదవ్ తెలిపారు.
ఎన్‌ఎంసీ ఉత్తర్వుల ప్రకారమే జీవో..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెంచేది లేదని ఎన్‌ఎంసీ తెలిపిందని, ఎన్‌ఎంసీ ఉత్తర్వుల ప్రకారమే తాము జీవో ఇచ్చామన్నారు. పిటిషనర్లు కావాలంటే ఎన్‌ఎంసీ ఉత్తర్వులను సవాలు చేసుకోవాలన్నారు.
ఈ సమయంలో ఠాగూర్ యాదవ్ జోక్యం చేసుకుంటూ, నిర్దేశించిన విధంగా మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేటు కాలేజీల అదనపు సీట్ల అభ్యర్థనను ఎన్‌ఎంసీ అధికారులు తోసిపుచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవో వల్ల ఓపెన్ కేటగిరిలో సీట్లు తగ్గిపోయాయన్నారు.
సౌకర్యాలుంటేనే అదనపు సీట్లు..
ఎన్‌ఎంసీ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ స్పందిస్తూ, ఈడబ్ల్యూఎస్‌ను తాము తిరస్కరించడం లేదన్నారు. మౌలిక సౌకర్యాలున్న కాలేజీలకు అదనపు సీట్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ కాలేజీలకు పలుమార్లు చెప్పామన్నారు. సౌకర్యాలు లేకుండా అదనపు సీట్లు ఇవ్వలేమన్నారు. దామాషా ప్రకారం 50 అదనపు సీట్లు ఇచ్చే అధికారం తమకు ఉందన్నారు. కేవలం 10 శాతం సీట్లే పెంచితే మిగిలిన వర్గాలు నష్టపోతాయని, అందువల్ల అదనంగా 50 సీట్లు ఇస్తామన్నారు.
అందరి వాదనలు విన్న ధర్మాసనం జీవో 94పై స్టే విధిస్తున్నామని చెప్పింది. కొంత గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామన్న ప్రణతి అభ్యర్థనను తోసిపుచ్చింది. కన్వీనర్ కోటాలోనే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు సరికాదంది. ఈ దశలో జీవో 94 అమలుకు అనుమతినిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అదనపు సీట్లు కావాలంటే సౌకర్యాలన్నీ మెరుగుపరచుకోవాలని ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంది.
ఈడబ్ల్యూఎస్ కోటా జీవో నిలుపుదలపై హర్షం
ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్
గుంటూరు రూరల్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంపై ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు.
మంగళవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. గతంలో జీవో 94ని వ్యతిరేకించామని, హైకోర్టు జీవోను నిలుపుదల చేయటాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దీని వల్ల ఎంతో మంది ఈబీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. హైకోర్టులో కేసు దాఖలు చేసిన విద్యార్థులను అభినందించారు. హైకోర్టు న్యాయవాది ఠాగూర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ వ్యతిరేకం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment