minority colleges
-
మెడికల్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా జీవో నిలిపివేత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీలు మినహా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద జనరల్ కేటగిరిలో భర్తీ చేసే మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను ఆర్థిక బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న జారీ చేసిన జీవో 94 అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ జీవో అమలు విషయంలో ఏ రకంగానూ ముందుకెళ్లవద్దంది. ఈ జీవో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది.ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఉన్న సీట్లలో కాకుండా దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచి, అందులో కేటాయించాల్సి ఉంటుందన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనతో హైకోర్టు ప్రాథమికంగా ఏకీభవించింది. జీవో 94 విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎన్ఎంసీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తదితరులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది రాజ్యాంగ విరుద్ధం..సీట్ల సంఖ్య పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 94ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన పోగిరి చరిష్మా, గుంటూరు జిల్లాకు చెందిన అప్పారి సాయి వెంకట ఆదిత్య, యమవరపు మృదులత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది యరగొర్ల ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ, ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలనుకుంటే ఎన్ఎంసీ అనుమతి తీసుకుని దామాషా ప్రకారం సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చునన్నారు. సీట్ల సంఖ్యను పెంచకుండా, ఉన్న సీట్లలో 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్ కింద భర్తీ చేయడానికి వీల్లేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కన్వీనర్ కోటా కింద ఉన్న మొత్తం సీట్లలోనే 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్‌కు కేటాయిస్తూ జీవో 94 జారీ చేసిందన్నారు. దీనివల్ల జనరల్ కోటా సీట్లలో 10 శాతం సీట్లు తగ్గుతాయన్నారు. దీంతో పిటిషనర్ల వంటి వారు ఎంతో మంది నష్టపోతున్నారని తెలిపారు.జనహిత్ అభియాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా జీవో 94 ఉందన్నారు. అసలు ఈ జీవో రహస్యంగా ఉందని, ఇప్పటి వరకు ప్రజా బాహుళ్యంలోకి తీసుకురాలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఈ జీవో వల్ల పిటిషనర్లకు నష్టం జరుగుతుందని భావిస్తున్నారా? వారి అవకాశాలను ఈ జీవో దెబ్బతీస్తుందా? అని ప్రశ్నించింది. అవునని, పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఠాగూర్ యాదవ్ తెలిపారు.ఎన్ఎంసీ ఉత్తర్వుల ప్రకారమే జీవో..రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెంచేది లేదని ఎన్ఎంసీ తెలిపిందని, ఎన్ఎంసీ ఉత్తర్వుల ప్రకారమే తాము జీవో ఇచ్చామన్నారు. పిటిషనర్లు కావాలంటే ఎన్ఎంసీ ఉత్తర్వులను సవాలు చేసుకోవాలన్నారు. ఈ సమయంలో ఠాగూర్ యాదవ్ జోక్యం చేసుకుంటూ, నిర్దేశించిన విధంగా మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేటు కాలేజీల అదనపు సీట్ల అభ్యర్థనను ఎన్ఎంసీ అధికారులు తోసిపుచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవో వల్ల ఓపెన్ కేటగిరిలో సీట్లు తగ్గిపోయాయన్నారు.సౌకర్యాలుంటేనే అదనపు సీట్లు..ఎన్ఎంసీ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ స్పందిస్తూ, ఈడబ్ల్యూఎస్‌ను తాము తిరస్కరించడం లేదన్నారు. మౌలిక సౌకర్యాలున్న కాలేజీలకు అదనపు సీట్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ కాలేజీలకు పలుమార్లు చెప్పామన్నారు. సౌకర్యాలు లేకుండా అదనపు సీట్లు ఇవ్వలేమన్నారు. దామాషా ప్రకారం 50 అదనపు సీట్లు ఇచ్చే అధికారం తమకు ఉందన్నారు. కేవలం 10 శాతం సీట్లే పెంచితే మిగిలిన వర్గాలు నష్టపోతాయని, అందువల్ల అదనంగా 50 సీట్లు ఇస్తామన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం జీవో 94పై స్టే విధిస్తున్నామని చెప్పింది. కొంత గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామన్న ప్రణతి అభ్యర్థనను తోసిపుచ్చింది. కన్వీనర్ కోటాలోనే 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు సరికాదంది. ఈ దశలో జీవో 94 అమలుకు అనుమతినిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అదనపు సీట్లు కావాలంటే సౌకర్యాలన్నీ మెరుగుపరచుకోవాలని ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంది.ఈడబ్ల్యూఎస్ కోటా జీవో నిలుపుదలపై హర్షంఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్గుంటూరు రూరల్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంపై ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. గతంలో జీవో 94ని వ్యతిరేకించామని, హైకోర్టు జీవోను నిలుపుదల చేయటాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దీని వల్ల ఎంతో మంది ఈబీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. హైకోర్టులో కేసు దాఖలు చేసిన విద్యార్థులను అభినందించారు. హైకోర్టు న్యాయవాది ఠాగూర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ వ్యతిరేకం కాదన్నారు. -
ఏపీ: ప్రభుత్వ పరిధిలోకి ఎయిడెడ్, మైనార్టీ డిగ్రీ కాలేజీలు
సాక్షి, అమరావతి: విద్యార్థుల చేరికల్లేక.. మరోవైపు ప్రమాణాలు పడిపోతున్న ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, మైనార్టీ డిగ్రీ కాలేజీలకు ఇక మహర్దశ పట్టనుంది. వీటిని తన పరిధిలోకి తీసుకుని అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు ఫీజులను పూర్తిగా రీయింబర్స్ చేయడంతోపాటు వారి వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకూ వీటిని వర్తింపచేస్తోంది. ఎయిడెడ్ కాలేజీల్లోని రెగ్యులర్ సిబ్బందికి జీతభత్యాలు, ఇతర సదుపాయాల కోసం నిధులు విడుదల చేస్తోంది. అయినా చేరికలు, ప్రమాణాలూ పడిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎటువంటి రుణభారం లేకుండా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను స్వాధీనం చేయడానికి సుముఖంగా ఉండే యాజమాన్యాలు, సిబ్బంది నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కాలేజీ విద్య కమిషనర్‌ను ఆదేశించింది. -
మైనారిటీ కాలేజీల ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల సొసైటీ(టెమ్రీస్) జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ కార్యదర్శి బి.షఫియుల్లా, అకాడమీ అధిపతి ఎంఏ లతీఫ్ అత్హర్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పన్నెండు జూనియర్ కళాశాలల్లో 2018–19 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్సెస్సీలో వచ్చిన మార్కుల గ్రేడ్ల ఆధారంగా ఈ నెల 16 నుంచి 20 వరకు విద్యార్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను 21న విడుదల చేస్తామని, 22 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. గురుకుల కళాశాలలు జూన్ ఒకటి నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. మైనారిటీలకు 75 శాతం సీట్లు మైనారిటీ గురుకుల కళాశాలల్లో 75 శాతం సీట్లు మైనారిటీ వర్గాలు, 25 శాతం సీట్లను మైనారిటీయేతరులతో భర్తీ చేస్తున్నట్లు షఫియుల్లా, లతీఫ్ అత్హర్లు వెల్లడించారు. కుటుంబ వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల వరకు గల విద్యార్థులు గురుకుల ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. 12 గురుకుల కళాశాలల్లో 960 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పదకొండు గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, నిజామాబాద్‌లో మాత్రం సీఈసీ, ఎంఈసీ విభాగాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎంపీసీలో 440, బైపీసీలో 440, సీఈసీలో 40, ఎంఈసీలో 40 సీట్లు ఉన్నాయని చెప్పారు. కళాశాలల్లో అదనంగా ఫౌండేషన్ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాల్లో రోబోటిక్ ల్యాబ్‌ను ప్రారంభించామని, శిక్షణ కోసం ఇప్పటికే సింగపూర్‌లోని ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. త్వరలో ప్రత్యేక క్రీడాపాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. -
డీ.ఎడ్ కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణ ఏది!
మన పాలక వర్గాలు విద్యను ప్రైవేటీకరించడా నికి ఎప్పటి నుండో కంక ణం కట్టుకున్నాయి. విశా ల ఉద్యమాలు నిర్వహిం చి, పోరాటాలు చేసి, సాధించిన చర్రిత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలది. 1975లో ప్రభుత్వ పాఠశా లలో ఉపాధ్యాయ నియామకాల కోసం, ప్రభుత్వం ఉపాధ్యాయ శిక్షణ కాలేజీలను ప్రారంభించింది. 1990 వరకు ప్రభుత్వ కాలేజీల్లోనే శిక్షణ కొనసాగిం ది. 1991లో మన దేశంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ప్రైవేటీకరణ రంగా న్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. ప్రభు త్వమే విద్యను నిరూపయోగంగా చేస్తోంది. 35 ఏళ్ల క్రితం ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యో గాల భర్తీ ఉండేది. నేడు ప్రభుత్వ రంగసంస్థలు పో యి తాత్కాలిక ఉద్యోగాలు వచ్చాయి. కొత్తగా ప్రభు త్వ ఉద్యోగ నియామకాలు లేవు. ఇప్పుడు రెండు రకాల ఉద్యోగాలే ఉన్నాయి. ఒకటి రక్షణ రంగం అంటే పోలీస్, సైన్యం, రెండోది ఉపాధ్యాయ ఉద్యో గాలు. ఇవే ప్రస్తుతం నిరుద్యోగులకున్న అవకా శాలు. మార్కెట్ సరుకుల వాడకానికి విజ్ఞానం అవ సరం. దాని కోసమే పాలకవర్గాలు విద్యాభివృద్ధికి నిధులను అందిస్తున్నారు. అందులోనూ ప్రాథమిక విద్యారంగాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు డీ.ఎడ్ కాలేజీలు 732 ఉన్నాయి. వీటిలో 102 మైనారిటీ కాలేజీలు, 24 ప్రభుత్వ కాలేజీలు, 18 ఉర్దూ మీడియం కాలేజీలు, 1 తమిళ మీడియం కాలేజీ ఉన్నాయి. వీటి అన్నింటిలో కలిపి సుమారు గా 38,500 సీట్లు ఉన్నాయి. ఇవి ప్రభుత్వం చెప్పే లెక్కలు. అనధికారంగా 952 కాలేజీలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో దాదాపు 35 మాత్రమే ప్రభు త్వ కాలేజీలు. మిగతావి ప్రైవేటు కాలేజీలు. వీటిలో ఒక్కో కాలేజీలో 50 సీట్లు ఉంటాయి. 40 సీట్లు ప్రభుత్వమే కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుంది. మిగ తా 10 సీట్లను ఆ ప్రైవేటు యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో అమ్ముకుంటున్నాయి. నేడు ఒక డీ.ఎడ్ సీటును రెండు లక్షల నుండి రెండు లక్షల 50 వేలకు అమ్ముతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డీ.ఎడ్ విద్యావ్యాపారం జరుగుతున్నా, ప్రభుత్వ అధికా రుల నియంత్రణ ఉండదు. ఇక మైనారిటీ కాలేజీల గురించి ఎంత తక్కు వగా చెబితే అంతమంచిది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 102 మైనారిటీ కాలేజీలు ఉన్నాయి. ఒక్కో కాలేజీలో సుమారు 50 సీట్లు ఉంటాయి. వీటిలో మైనారిటీ వర్గాలకే 95% సీట్లు ఇవ్వాలి. మిగిలిన 5% సీట్లు ఇతరులకు కేటాయించాలి. కానీ, ఈ 45 సీట్లను ఇతర వర్గాలకు ఇస్తున్నారు. వీటికి 1 లక్ష నుండి 2 లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మైనారిటీ విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలుచేసి మైనారిటీ సొసైటీల పేరుతో కోట్లకు కోట్లు లాభాలు గడిస్తున్నారు. మైనారిటీ విద్యార్థులు డీ.ఎడ్ విద్యను కొనే ఆర్థిక స్థితి ఉండదు అనేది బహిరంగ రహస్యం. మైనారి టీ విద్యాసంస్థలో మైనారిటీ విద్యాభివృద్ధి శూన్యం. మైనారిటీ కాలేజీలకు అటు ప్రైవేటు డీ.ఎడ్ కాలేజీ లకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండరు. ఎందుకంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వ విద్యాలయాల నుండి కేవలం 300 మంది ఎంఈడీ విద్యార్థులు బయటికి వస్తున్నారు. ప్రైవేట్ మైనా రిటీ డీ.ఎడ్ కాలేజీలో విద్యార్థులకు ఎంఈడీ పూర్తి చేసిన విద్యార్థులు అవసరం. రెండు తెలుగు రాష్ట్రా ల్లో 732 డీ.ఎడ్ కాలేజీలకు దాదాపు 5 వేల మంది ఎంఈడీ ఉపాధ్యాయులు అవసరం. మరి అంత మంది ఎంఈడీ విద్యార్థులు లేనప్పుడు ప్రైవేట్ డీ.ఎడ్ కాలేజీ యాజమాన్యాలు ఏ ఉపాధ్యాయు లను నియమిస్తున్నారు? ఎవరి ద్వారా విద్యాబోధన చేయిస్తున్నారు? కొన్ని కాలేజీలు అధ్యాపకులు లేకుండానే కోర్సు పూర్తి చేస్తున్నాయి. అసలు ఈ బోగస్ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని విశ్వ విద్యాలయా లలోని విద్యాశాఖ వారు పరిశీలిస్తే ప్రైవేట్ మైనా రిటీ కాలేజీల బాగోతం బయటపడుతుంది. ప్రైవేట్ మైనారిటీ కాలేజీల మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రైవేటు డీ.ఎడ్ కాలేజీల ఆగడాలను అరికట్టి నియంత్రించాలని ప్రగతిశీల వాదులు కోరుకుంటున్నారు. లేదంటే విద్యార్థులకు పోరాటాలు తప్పవు. (వ్యాసకర్త ప్రగతిశీల యువజన సంఘం నాయకులు, మొబైల్ :94401 95160 తోట రాజేష్ -
ఆ విద్యార్థులే ‘మైనారిటీ’..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీల్లో జరుగుతున్న అవకతవకలపై విద్యాశాఖ దృష్టి సారించింది. నిబంధనలను తుంగలో తొక్కి మైనారిటీయేతర విద్యార్థులకు సీట్లు అమ్ముకోవడం, మైనారిటీయేతర కోటాలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వంటి అక్రమాలను వెలికి తీయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులైన డీఎడ్, బీఎడ్, పండిత శిక్షణ కోర్సులను నిర్వహించే దాదాపు 100 మైనారిటీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు, విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. పేరుకే మైనారిటీ.. నిబంధనల ప్రకారం మైనారిటీ కాలేజీల్లో 70 శాతం సీట్లను మైనారిటీ వర్గాల విద్యార్థులకే ఇవ్వాలి. అది కూడా విద్యాశాఖ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల మెరిట్ ఆధారంగానే కేటాయించాలి. కానీ చాలా కాలేజీలు మైనారిటీ విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా, ఇతర విద్యార్థులకు సీట్లను అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇందుకోసం మెరిట్‌ను కూడా తుంగలో తొక్కుతున్నాయనే అభిప్రాయాలున్నాయి. అంతేగాకుండా 30 శాతం నాన్ మైనారిటీ కోటా సీట్ల భర్తీలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ఐదారేళ్లుగా తతంగం కొనసాగిస్తున్నా... విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, ముడుపులు పుచ్చుకొని మిన్నకుండిపోవడంతో అర్హులైన మైనారిటీ వర్గాల విద్యార్థులకు సీట్లు లభించడం లేదు. ‘హోదా’ పొందడంలోనే పక్కదారి! మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యావకాశాలు అందించేందుకు రాజ్యాంగం ‘మైనారిటీ కాలేజీ’లకు అవకాశం కల్పించింది. వాటికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మైనారిటీ హోదా ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించకపోయినా, నిరాకరించినా జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించి మైనారిటీ హోదా పొందే వీలుంది. అయితే చాలా కాలేజీలు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖను సంప్రదించకుండానే... శాఖ అధికారులు నిరాకరించారని పేర్కొంటూ అఫిడవిట్లు దాఖలు చేసి, జాతీయ కమిషన్ నుంచి సర్టిఫికెట్లు పొందుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు పదిహేనేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. అయితే ఇటీవల డీఎడ్ కాలేజీల విషయంలో జాతీయ మైనారిటీ కమిషన్ సర్టిఫికెట్లను తీసుకోవడానికి విద్యాశాఖ నిరాకరించింది. కానీ వాటి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించి అనుమతి పొందాయి. దీంతో అసలు ఆ కాలేజీలకు మైనారిటీ హోదాను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఎప్పుడు తిరస్కరించింది? జాతీయ కమిషన్‌లో ఎప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు? అందులో ఏం చెప్పారన్న అంశాలను సేకరించేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. అంతేగాకుండా ఆ కాలేజీలు మైనారిటీయేతర విద్యార్థులకు కేటాయించిన సీట్ల వివరాలను కూడా తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
మైనారిటీ కాలేజీల్లో ‘ఇతరులకు’ నో రీయింబర్స్మెంట్!
-
మైనారిటీ కాలేజీల్లో ‘ఇతరులకు’ నో రీయింబర్స్మెంట్!
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి చేస్తున్న మార్పుల్లో భాగంగా మైనారిటీ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మినహా ఇతర వర్గాలకు చెందిన వారు చేరితే ఫీజు చెల్లించకూడదన్న ప్రతిపాదనలను ఫీజు రీయింబర్స్మెంట్ కమిటీ పరిశీలిస్తోంది. అసోసియేషన్ ఆఫ్ కన్సార్షియం (ఏసీ) కింద ఏర్పడి సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు చేపట్టే ప్రైవేటు కాలేజీలకూ రీయిం బర్స్మెంట్ వర్తింపజేయకూడదన్న అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ప్రభుత్వమే ప్రవేశ పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు చేపడుతున్న తరుణంలో ప్రైవేటు కాలేజీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా ఆయా కాలేజీల్లో విద్యార్థులు చేరితే ప్రభుత్వమెందుకు ఫీజు చెల్లించాలన్న అంశాన్ని కమిటీ తీవ్రంగా పరి శీలిస్తోంది. వీటితోపాటు 5 వేల లోపు ర్యాంకు ఉన్నవారికే పూర్తి ఫీజు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో జరగబోయే సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తికావచ్చిన కసరత్తు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు వీలుగా బోగస్ కాలేజీలు, బోగస్ విద్యార్థులను నియంత్రించేం దుకు చర్యలు తీసుకుంటోంది. ఫీజు రీయిం బర్స్మెంట్ మార్గదర్శకాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఆయా అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రతినెలా విద్యార్థుల అటెండెన్స్ కళాశాలల విద్యార్థుల అటెండెన్స్‌ను ప్రతి నెలా తప్పనిసరిగా పంపితేనే స్కాలర్షిప్లు చెల్లిం చాలని భావిస్తోంది. విద్యార్థుల అటెండెన్స్ 75 శాతానికి తగ్గకుండా ఉంటే ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకు నేరుగా ఆ డబ్బును జమ చేయాలని, ఇతర విద్యార్థులకు ఆయా కాలేజీల అకౌంట్లకు డబ్బు పంపించేలా చూడాలని యోచిస్తోంది. 5 వేల ర్యాంకు దాటితే ఫీజు లేదు...! ఎంసెట్‌లో 5 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలనే యోచనతో ప్రభుత్వం ఉంది (ఉమ్మడి రాష్ట్రంలో 10 వేల ర్యాంకు వరకు ఉండేది). 5 వేల ర్యాంకు కంటే ఎక్కువ ర్యాంకు వచ్చే వారికి ఫీజు చెల్లించే విషయంలో కోర్సు వారీగా నిర్ణీత కనీస మొత్తాన్ని చెల్లించడమా? ఆ కాలేజీలోని ఫీజులో నిర్ణీత పర్సం టేజీ ఫీజును చెల్లించడమా? అన్న కోణంలో ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం ఒక్కో కోర్సుకు ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉంది. ఈ నేపథ్యంలో కోర్సులో కనీస ఫీజు (మినిమమ్) చెల్లించడం కుదరదు. దీంతో ఆయా కాలేజీల్లోని ఫీజులో నిర్ణీత పర్సంటేజీ ఫీజునే చెల్లించాలన్న ఆలోచనలు చేస్తోంది. ఆధార్‌తో అటెండెన్స్ అనుసంధానం కోర్సుల వారీగా రీయింబర్స్‌మెంట్‌గా చెల్లించే ఫీజులపై సీలింగ్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైతరగతికి ప్రమోట్ అయిన వారికే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. కాలేజీల్లో ప్రవేశాలప్పుడే విద్యార్థులు, తల్లితండ్రుల ఆధార్ నంబర్లను అనుసంధానించాలనుకుంటోంది. తద్వారా విద్యార్థుల అటెండెన్స్‌ను పరిశీలించాలనే ఆలోచనతో ఉంది. ఎమ్మెస్సీ, ఎంటెక్ వంటి పీజీ కోర్సుల రీయింబర్స్‌మెంట్‌పై సీలింగ్ విధించాలని ప్రతి పాదిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఇది వర్తించదు. వచ్చే నెలలోనే బకాయిలకు మోక్షం 2014-15 ఫీజుల బకాయిలు, ఇతర చెల్లింపులు మార్చిలో చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 371-డీ నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.