సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి చేస్తున్న మార్పుల్లో భాగంగా మైనారిటీ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మినహా ఇతర వర్గాలకు చెందిన వారు చేరితే ఫీజు చెల్లించకూడదన్న ప్రతిపాదనలను ఫీజు రీయింబర్స్‌మెంట్ కమిటీ పరిశీలిస్తోంది. అసోసియేషన్ ఆఫ్ కన్సార్షియం (ఏసీ) కింద ఏర్పడి సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు చేపట్టే ప్రైవేటు కాలేజీలకూ రీయిం బర్స్‌మెంట్ వర్తింపజేయకూడదన్న అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ప్రభుత్వమే ప్రవేశ పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు చేపడుతున్న తరుణంలో ప్రైవేటు కాలేజీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా ఆయా కాలేజీల్లో విద్యార్థులు చేరితే ప్రభుత్వమెందుకు ఫీజు చెల్లించాలన్న అంశాన్ని కమిటీ తీవ్రంగా పరి శీలిస్తోంది. వీటితోపాటు 5 వేల లోపు ర్యాంకు ఉన్నవారికే పూర్తి ఫీజు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో జరగబోయే సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పూర్తికావచ్చిన కసరత్తు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు వీలుగా బోగస్ కాలేజీలు, బోగస్ విద్యార్థులను నియంత్రించేం దుకు చర్యలు తీసుకుంటోంది. ఫీజు రీయిం బర్స్‌మెంట్ మార్గదర్శకాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఆయా అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.
ప్రతినెలా విద్యార్థుల అటెండెన్స్
కళాశాలల విద్యార్థుల అటెండెన్స్‌ను ప్రతి నెలా తప్పనిసరిగా పంపితేనే స్కాలర్‌షిప్‌లు చెల్లిం చాలని భావిస్తోంది. విద్యార్థుల అటెండెన్స్ 75 శాతానికి తగ్గకుండా ఉంటే ప్రైవేట్ కాలేజీల విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకు నేరుగా ఆ డబ్బును జమ చేయాలని, ఇతర విద్యార్థులకు ఆయా కాలేజీల అకౌంట్లకు డబ్బు పంపించేలా చూడాలని యోచిస్తోంది.
5 వేల ర్యాంకు దాటితే ఫీజు లేదు...!
ఎంసెట్‌లో 5 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలనే యోచనతో ప్రభుత్వం ఉంది (ఉమ్మడి రాష్ట్రంలో 10 వేల ర్యాంకు వరకు ఉండేది). 5 వేల ర్యాంకు కంటే ఎక్కువ ర్యాంకు వచ్చే వారికి ఫీజు చెల్లించే విషయంలో కోర్సు వారీగా నిర్ణీత కనీస మొత్తాన్ని చెల్లించడమా? ఆ కాలేజీలోని ఫీజులో నిర్ణీత పర్సం టేజీ ఫీజును చెల్లించడమా? అన్న కోణంలో ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం ఒక్కో కోర్సుకు ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉంది. ఈ నేపథ్యంలో కోర్సులో కనీస ఫీజు (మినిమమ్) చెల్లించడం కుదరదు. దీంతో ఆయా కాలేజీల్లోని ఫీజులో నిర్ణీత పర్సంటేజీ ఫీజునే చెల్లించాలన్న ఆలోచనలు చేస్తోంది.
ఆధార్‌తో అటెండెన్స్ అనుసంధానం
కోర్సుల వారీగా రీయింబర్స్‌మెంట్‌గా చెల్లించే ఫీజులపై సీలింగ్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైతరగతికి ప్రమోట్ అయిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. కాలేజీల్లో ప్రవేశాలప్పుడే విద్యార్థులు, తల్లితండ్రుల ఆధార్ నంబర్లను అనుసంధానించాలనుకుంటోంది. తద్వారా విద్యార్థుల అటెండెన్స్‌ను పరిశీలించాలనే ఆలోచనతో ఉంది. ఎమ్మెస్సీ, ఎంటెక్ వంటి పీజీ కోర్సుల రీయింబర్స్‌మెంట్‌పై సీలింగ్ విధించాలని ప్రతి పాదిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఇది వర్తించదు.
వచ్చే నెలలోనే బకాయిలకు మోక్షం
2014-15 ఫీజుల బకాయిలు, ఇతర చెల్లింపులు మార్చిలో చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 371-డీ నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.