ఆ విద్యార్థులే ‘మైనారిటీ’..! | minority colleges | Sakshi
Sakshi News home page

ఆ విద్యార్థులే ‘మైనారిటీ’..!

Published Mon, Mar 9 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

ఆ విద్యార్థులే ‘మైనారిటీ’..!

ఆ విద్యార్థులే ‘మైనారిటీ’..!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీల్లో జరుగుతున్న అవకతవకలపై విద్యాశాఖ దృష్టి సారించింది. నిబంధనలను తుంగలో తొక్కి మైనారిటీయేతర విద్యార్థులకు సీట్లు అమ్ముకోవడం, మైనారిటీయేతర కోటాలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వంటి అక్రమాలను వెలికి తీయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులైన డీఎడ్, బీఎడ్, పండిత శిక్షణ కోర్సులను నిర్వహించే దాదాపు 100 మైనారిటీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు, విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
 
 పేరుకే మైనారిటీ..
 
 నిబంధనల ప్రకారం మైనారిటీ కాలేజీల్లో 70 శాతం సీట్లను మైనారిటీ వర్గాల విద్యార్థులకే ఇవ్వాలి. అది కూడా విద్యాశాఖ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల మెరిట్ ఆధారంగానే కేటాయించాలి. కానీ చాలా కాలేజీలు మైనారిటీ విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా, ఇతర విద్యార్థులకు సీట్లను అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇందుకోసం మెరిట్‌ను కూడా తుంగలో తొక్కుతున్నాయనే అభిప్రాయాలున్నాయి. అంతేగాకుండా 30 శాతం నాన్ మైనారిటీ కోటా సీట్ల భర్తీలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ఐదారేళ్లుగా తతంగం కొనసాగిస్తున్నా... విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, ముడుపులు పుచ్చుకొని మిన్నకుండిపోవడంతో అర్హులైన మైనారిటీ వర్గాల విద్యార్థులకు సీట్లు లభించడం లేదు.
 
 ‘హోదా’ పొందడంలోనే పక్కదారి!
 
 మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యావకాశాలు అందించేందుకు రాజ్యాంగం ‘మైనారిటీ కాలేజీ’లకు అవకాశం కల్పించింది. వాటికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మైనారిటీ హోదా ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించకపోయినా, నిరాకరించినా జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించి మైనారిటీ హోదా పొందే వీలుంది. అయితే చాలా కాలేజీలు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖను సంప్రదించకుండానే... శాఖ అధికారులు నిరాకరించారని పేర్కొంటూ అఫిడవిట్లు దాఖలు చేసి, జాతీయ కమిషన్ నుంచి సర్టిఫికెట్లు పొందుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు పదిహేనేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. అయితే ఇటీవల డీఎడ్ కాలేజీల విషయంలో జాతీయ మైనారిటీ కమిషన్ సర్టిఫికెట్లను తీసుకోవడానికి విద్యాశాఖ నిరాకరించింది. కానీ వాటి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించి అనుమతి పొందాయి. దీంతో అసలు ఆ కాలేజీలకు మైనారిటీ హోదాను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఎప్పుడు తిరస్కరించింది? జాతీయ కమిషన్‌లో ఎప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు? అందులో ఏం చెప్పారన్న అంశాలను సేకరించేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. అంతేగాకుండా ఆ కాలేజీలు మైనారిటీయేతర విద్యార్థులకు కేటాయించిన సీట్ల వివరాలను కూడా తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement