
సాక్షి, అమరావతి: విద్యార్థుల చేరికల్లేక.. మరోవైపు ప్రమాణాలు పడిపోతున్న ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, మైనార్టీ డిగ్రీ కాలేజీలకు ఇక మహర్దశ పట్టనుంది. వీటిని తన పరిధిలోకి తీసుకుని అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు ఫీజులను పూర్తిగా రీయింబర్స్ చేయడంతోపాటు వారి వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకూ వీటిని వర్తింపచేస్తోంది.
ఎయిడెడ్ కాలేజీల్లోని రెగ్యులర్ సిబ్బందికి జీతభత్యాలు, ఇతర సదుపాయాల కోసం నిధులు విడుదల చేస్తోంది. అయినా చేరికలు, ప్రమాణాలూ పడిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎటువంటి రుణభారం లేకుండా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను స్వాధీనం చేయడానికి సుముఖంగా ఉండే యాజమాన్యాలు, సిబ్బంది నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కాలేజీ విద్య కమిషనర్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment