సాక్షి, అమరావతి: ఎయిడెడ్ విద్యా సంస్థలను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలను టీడీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చకు అనుమతివ్వాలంటూ టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రోటెం చైర్మన్ విఠపు బాలసుబ్రమణ్యం తిరస్కరించడంతో వారు బాయ్‌కాట్ చేశారు. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ.. ఎయిడెడ్ విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అని విమర్శించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నిషేధం విధించారని.. వీటి అసలు లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజకీయం చేసి లబ్ధిపొందాలని టీడీపీ చూస్తోందని బొత్స మండిపడ్డారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన విజయనగరం మహారాజ ఎయిడెడ్ కళాశాలను కూడా నిర్వహించలేమని గతంలో టీడీపీ నేత పూసపాటి అశోక్‌గజపతిరాజు లేఖ ఇచ్చిన విషయాన్ని సభలో మంత్రి ప్రస్తావించారు. ఇలా అనేకమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వినతుల మేరకే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు కోరుకున్నట్లే చేసేలా వాటికి అవకాశమిచ్చామని, విద్యార్థుల మేలుకోసమే ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు.
విద్యార్థులకు సీఎం అన్యాయం చేయరు
మరో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థుల మేలు కోసం తపనపడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని మూడు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేయబోరని స్పష్టంచేశారు. వీటిని గాడిలో పెట్టి విద్యార్థులకు మరింత మేలు చేసేలా తీసుకుంటున్న చర్యలకు మనమంతా మద్దతుగా నిలవాలన్నారు. ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, ఐ. వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి కూడా మాట్లాడారు. అంతకుముందు.. మాజీ ఎమ్మెల్సీ వల్లభనేని కమలకుమారి మృతికి సంతాపం తెలుపుతూ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.
‘ఎయిడెడ్’ను భ్రష్టుపట్టించిందే చంద్రబాబు
Published Fri, Nov 19 2021 3:17 AM | Last Updated on Fri, Nov 19 2021 3:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment