సాక్షి,విశాఖపట్నం: అవినీతికి తావు లేకుండా ఆస్తి పన్నుపై నూతన విధానాన్ని ప్రవేశపెడితే.. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికలు పూర్తయ్యాక పన్నులు పెంచేస్తున్నారని అవాస్తవాలు, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నూతన విధానం కారణంగా ప్రభుత్వానికి అదనంగా వచ్చే ఆదాయం కేవలం రూ.186 కోట్లేనని, తద్వారా లోపభూయిష్టంగా ఉన్న పన్నుల వ్యవస్థను ముఖ్యమంత్రి గాడిలో పెట్టారని చెప్పారు. నూతన ఆస్తి పన్ను విధానం వల్ల ఒక్క విజయవాడ నగరానికే రూ.500 కోట్లు ఆదాయం వస్తుందంటూ ప్రతిపక్షాలు అర్థం పర్థంలేకుండా మాట్లాడటం దారుణం అని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా, ఆస్తి విలువ ఆధారితంగా పన్నులు నిర్ణయించాలని ప్రభుత్వం ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకుని, చట్టం చేసిందని గుర్తు చేశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
లోపాలను సరిచేస్తూ నూతన విధానం
► వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ రూ.1,242 కోట్లు ఉంటే.. అది ఇప్పుడు రూ.1,428 కోట్లకు పెరిగింది. అంటే వ్యత్యాసం రూ.186 కోట్లే. గతంలో మూడు నెలల అద్దె ప్రామాణికంగా పన్ను వేసేవారు. ఇది లోపభూయిష్టంగా ఉండటంతో నూతన పన్ను విధానం తీసుకువచ్చాం.
► నివాస భవనాలకు ఆస్తి విలువలో 0.10 నుంచి 0.50 శాతం, నివాసేతర వాణిజ్య భవనాలకు 0.20 నుంచి 2 శాతం పన్ను ఉండాలని నిర్ణయించాం. ఈ విధానం ద్వారా ఎక్కడైనా సరే గరిష్టంగా 15 శాతానికి మించి ఒక్కపైసా కూడా పన్ను పెరిగే పరిస్థితి లేదు. అదే 375 చదరపు అడుగుల లోపల నివాస గృహాల్లో ఉండే పేదలకు ఏడాదికి పన్ను కేవలం రూ.50 మాత్రమే.
► శాసనసభలో మూడు రాజధానులకు సంబంధించిన చట్టం చేసినప్పటి నుంచే పరిపాలన వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఏ క్షణంలో అయినా విశాఖ నుంచి పరిపాలన సాగే అవకాశం ఉంది. అడ్డంకులను తొలగించుకుంటూ విశాఖ పరిపాలన రాజధానిగా, కర్నూలు జ్యుడిషియల్, అమరావతిని లెజిస్లేటివ్ రాజధానులుగా చేయాలన్నదే ప్రభుత్వ విధానం.
► కోవిడ్ నేపథ్యంలో ఈ ప్రభుత్వం నగదు బదిలీ ద్వారా ఈ రెండేళ్లలో రూ.1.35 లక్షల కోట్లను వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా బదిలీ చేసింది. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెంచుతున్నాం.
► సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ అండ్ కో రకరకాల ప్రచారాలు చేస్తుండటం దారుణం. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు, జూమ్ ఉపన్యాసాలతో పబ్బం గడుపుకుంటున్నారు.
ఆస్తి పన్నుపై అనవసర రాద్ధాంతం
Published Fri, Jun 11 2021 5:24 AM | Last Updated on Fri, Jun 11 2021 5:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment