సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ మీడియా ప్రశంసిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం లేనిపోని విమర్శలు చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రతిరోజు సుమారు 2 వేల కరోనా టెస్టులు చేస్తుంటే.. చంద్రబాబు ఇంకా కరోనా టెస్టుల గురించి మాట్లాడటాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశంలో ప్రతిరోజూ ఎక్కువ మందికి టెస్ట్‌లు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే..
► అఖిలపక్షం వేయాలంటున్న చంద్రబాబు ఏనాడైనా ఒక మంచి సలహా ఇచ్చారా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబు ప్రధానికి ఎందుకు వివరించలేదు.
► దేశంలో కరోనా పోవాలని అందరూ కోరుకుంటుంటే.. చంద్రబాబు, ఆయన బృందం మాత్రం రాష్ట్రానికి కరోనా రావాలని కోరుకుంటున్నారు.
► కరోనాపై ప్రతిరోజు సమీక్షలు నిర్వహించే ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నారు.
► రాష్ట్రంలో ఏ ఒక్కరూ తినడానికి తిండి లేక పస్తులు ఉండకూడదని.. ఏ ఒక్కరూ అన్నం కోసం ఇబ్బందులు పడకూడదనేది ముఖ్యమంత్రి ఆలోచన. అందుకే.. అందరికీ రేషన్ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వమిచ్చే రూ.1,000 చొప్పున అందరికీ అందించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
► దరఖాస్తు చేసుకున్న వారికి ఐదు రోజుల్లో రేషన్ కార్డు జారీ చేసి రేషన్ అందించాలని కూడా చెప్పారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరోపక్క రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు.
► ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా రైతుల వద్దకే వెళ్లి ధాన్యం సమీకరించాలని ఆదేశించారు. అరటి, టమాట, బత్తాయి, మామిడి వంటి పండ్లను మెప్మా గ్రూపుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.
► క్వారంటైన్‌లో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులుంటే నిత్యావసర సరుకులతోపాటు రూ.2 వేల ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు
Published Wed, Apr 15 2020 5:03 AM | Last Updated on Wed, Apr 15 2020 5:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment