సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సేవ చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కడుపు మండిపోతోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పేదలకు మేలు చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటే దేవుడు కూడా క్షమించడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి చంద్రబాబు దించారని ఆరోపించారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరిస్తూనే ప్రతిపక్షాలు చేస్తున్న అర్థంపర్థం లేని ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు. (అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం)
చంద్రబాబు కడుపుమండుతోంది
‘అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 సర్వీసులను రేపు(బుధవారం) సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రమాదం జరిగితే దివంతగ మహానేత వైఎస్సార్ హయాంలో నిమిషాల్లో 108,104 వాహనాలు వచ్చేవి. అయితే చంద్రబాబు హయాంలో ఈ సర్వీసులు మూలనపడ్డాయి. 1088 ఒకేసారి 108,104 వాహనాలను సీఎం ప్రారంభిస్తారు. అధునాతన 108,104 వాహనాల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తే రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైన చంద్రబాబు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టారా? ప్రజలకు సేవ చేస్తే ఆయనకు కడుపు మండిపోతుంది. (చేయూత.. విశ్వసనీయత)
చంద్రబాబు నిజాలు మాట్లాడాలి
కరోనాపై చంద్రబాబు నిజాలు మాట్లాడాలి. నిన్న ఒక్కరోజే 30 వేల పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 9 లక్షల కరోనా పరీక్షలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని కరోనా పరీక్షలు రాష్ట్రంలో చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామిక ప్రోత్సాహకాలను చంద్రబాబు ఎగ్గొట్టారు. పారిశ్రామిక రంగానికే కాదు అన్ని రంగాలకు ప్రోత్సాహకాలను ఇవ్వలేదు. రూ. 2.75 లక్షల కోట్ల అప్పుల కుప్పలోకి రాష్ట్రానికి చంద్రబాబు దించారు. వేల కోట్ల రూపాయల బకాయిలు చంద్రబాబు పెట్టారు. భూములు ఇచ్చిన తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు వెనక్కి తీసుకోకపోతే ఏమి చేస్తారు. కక్ష్య పూరితంగా అమర్‌రాజా భూములు వెనక్కి తీసుకోలేదు. పరిశ్‌రమ పెట్టడానికి భూములు ఇస్తారా ఫామ్ హౌస్ కట్టడానికి భూములు ఇస్తారా?
పోలవరంలో అవినీతి జరిగిందని ప్రధానే అన్నారు
దివంగత నేత వైఎస్సార్ జయంతి రోజున 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాము. పేదలకు మేలు చేస్తున్న మంచి పనులు అడ్డుకుంటే దేవుడు కూడా క్షమించడు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వైజాగ్ లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాము. ప్రజలు ఇస్తేనే వైజాగ్ లో ల్యాండ్ పూలింగ్ కు భూములు తీసుకుంటాము. అవినీతి తావులేకుండా భూములు తీసుకుంటున్నాము. పోలవరంలో అవినీతి జరిగిందని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పోలవరంను టీడీపీ అధినేత ఏటిఎంలా వాడుకుంటున్నారని ప్రధాని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలు అవాస్తవమా? (సొంత జిల్లాకు బాబు తీరని ద్రోహం)
అలా అయితే లోకేష్‌కు అరెస్ట్ తప్పదు
ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడును అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు, కానీ అవినీతి జరగలేదని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. లేఖలు తాను కూడా ఇచ్చానని లోకేష్ అంటున్నారు. తప్పుడు లేఖలు ఇచ్చినట్లు అయితే లోకేష్‌కు అరెస్ట్ తప్పదు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిన వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. బీసీల రిజర్వేషన్లు కు గండి కొట్టింది చంద్రబాబు. బీసీల రిజర్వేషన్లుకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయించింది చంద్రబాబు.
వైఎస్సార్ సీపీ నేత హత్యపై బాబు ఎందుకు మాట్లాడటం లేదు
చంద్రబాబుది నోరా తాటి మట్టనా, నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారు. రాజధాని రైతులను ఇంకా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారు. రాజధానిలో కనెక్టివిటీ రోడ్డు చంద్రబాబు వేయలేకపోయారు. రాజధాని రైతులకు 4న వర్చువల్ సంఘీభావం చంద్రబాబు తెలుపుతాను అని అనడటం విడ్డూరంగా ఉంది. ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఎందుకు చంద్రబాబు, లోకేష్ పరామర్శించలేదు? మచిలీపట్నంలో జరిగిన హత్యపై ఎందుకు చంద్రబాబు మాట్లాడం లేదు? మచిలీపట్నంలో దారుణంగా నడిరోడ్డుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతను చంపారు. ఎందుకు కొన్ని మీడియా సంస్థలు ఈ హత్యను రాయడం లేదు?’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ('వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం')
Comments
Please login to add a commentAdd a comment