శాశ్వత భూ హక్కులు కల్పించడమే అసలు లక్ష్యం..
గెజిట్ మాత్రమే జారీ అయింది.. నోటిఫికేషన్ రాలేదు.. కోర్టుల అధికారాలు తగ్గించలేదు
ప్రజల స్థిరాస్తికి పూర్తి భద్రత ఉంటుంది
కబ్జాదారుల ఆగడాలకు ఆస్కారం ఉండదు
వివాదాలు తగ్గిపోతాయి.. కొత్త వివాదాలకు అవకాశం ఉండదు
సాక్షి, అమరావతి: ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో చంద్రబాబు గ్యాంగ్ పిచ్చెత్తిపోయి ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీచమైన ప్రచారం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది. అసలు ఈ చట్టంపై కూటమి నేతల ఆరోపణలు.., వాస్తవాలేమిటో తెలుసుకుందాం..
కూటమి నేతల ఆరోపణలు–వాస్తవాలు
ఆరోపణ: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.
వాస్తవం: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు లక్ష్యమే ప్రజల ఆస్తులు కాపాడటం, వాటికి పూర్తి భద్రత కల్పించడం. ప్రభుత్వమే గ్యారెంటీ సర్టిఫికెట్ ఇవ్వడం. భూ యజమానులకు నష్టం కలిగితే పూర్తి పరిహారం చెల్లించడం. భూములు లాక్కోవడం అనేది ఈ చట్టంతో సాధ్యం కాదు.
ఆరోపణ: భూ పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి.
వాస్తవం : భూ పత్రాలు ప్రభుత్వం చేతిలో ఉండవు. మీ వద్ద ఉన్న పత్రాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. కేవలం రికార్డులు పరిశీలించి, ప్రజలకు గ్యారెంటీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఇదే తుది కాపీ అవుతుంది. భవిష్యత్తులో 30 రకాల పత్రాల అవసరం ఉండదు.
ఆరోపణ: కొత్త చట్టం అమల్లోకి వస్తే యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలి.
వాస్తవం : మీ వద్ద భూములు ఉంటే వాటి హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వం వద్ద ఆ వివరాలు ఉంటాయి. ఆ వివరాల ప్రకారమే గ్యారెంటీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అందులో అభ్యంతరాలు ఉంటే రెండేళ్ల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను పరిశీలించి శాశ్వత రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
ఆరోపణ: కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు.
వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను అప్పిలేట్ అథారటీ పరిష్కరిస్తుంది. అక్కడ న్యాయం జరగకుంటే హైకోర్టులోని ప్రత్యేక బెంచ్‌ని ఆశ్రయించవచ్చు. ఆ బెంచ్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చు. కోర్టు ఇచ్చిన తుది తీర్పునే అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. దీనిని మార్చే అధికారం మళ్లీ కోర్టుకే ఉంటుంది.
ఆరోపణ: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్‌ఓకు సమాచారమివ్వాలి.
వాస్తవం : సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, మీరు కోర్టులో కేసు వేసినట్లు సంబంధింత అధికారులకు తెలపాలి. తద్వారా మీ భూమి ఎక్కడికీ పోకుండా ఉంటుంది.
ఆరోపణ: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు?
వాస్తవం : ఇప్పటికే ఉన్న భూమి వివరాలతో ఒక టైటిల్ రిజిస్టర్ మీ గ్రామానికి లేదా పట్టణానికి వస్తుంది. ఆ రిజిస్టర్‌లోని రికార్డులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. ఒకవేళ మీకు నష్టం కలిగితే ప్రభుత్వమే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తుంది. మీకు అధికారుల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్ చేయొచ్చు.
ఆరోపణ: వారసత్వ హక్కుల వివాదాలు వస్తాయి.
వాస్తవం : వారసత్వంగా సంక్రమించే ఆస్తులను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. వారసత్వం విషయంలో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లాలి. కోర్టు తీర్పు ఆధారంగా రిజిస్టర్లో మీ పేర్లను నమోదు చేస్తారు.
ఆరోపణ: ఈ చట్టం ఎక్కడా అమల్లో లేదు. ఏపీలోనే ఉంది.
వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. ఆయా దేశాల్లో ఈ వ్యవస్థ విజయవంతంగా నడుస్తోంది.
ఆరోపణ: ఇది రాష్ట్ర ప్రభుత్వ చట్టమే. కేంద్రానిది కాదు.
వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం కోసం 1986లో ప్రొఫెసర్ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్ గ్యారెంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. 2024 డిసెంబర్‌లోపు అమలు చేయాలని ఆదేశించింది.
ఆరోపణ: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చింది.
వాస్తవం : ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. గెజిట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రూపొందించలేదు.
ఆరోపణ: ఈ చట్టం వల్ల రైతులకు నష్టం.
వాస్తవం : ఈ చట్టం వల్ల రైతులకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. 30 రకాల పత్రాల అవసరం ఉండదు. భూ వివాదాలు, సర్వే నంబర్లు, సరిహద్దుల సమస్యలు పరిష్కారం అవుతాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండదు. మీ భూమిపై మీకు శాశ్వత హక్కులు వస్తాయి. భూకబ్జాల పీడ వదులుతుంది. మీ భూమిపై ఇతరులు దౌర్జన్యం చేసే అవకాశం ఉండదు. బ్యాంకులు సైతం సులువుగా లోన్లు జారీ చేస్తాయి.
ఆరోపణ : ప్రజల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లకుండా పోతాయి.
వాస్తవం : ఈ చట్టం జాతీయ స్థాయిలో చర్చించి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో కూడా ఆమోదముద్ర పడింది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ రూపొందించిన ప్రదేశాల్లో కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ ఇచ్చాక పాత రికార్డులు చెల్లవు.
ఆరోపణ : వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు?
వాస్తవం : భూ రికార్డులకు సంబంధించి ఏపీలో 124 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్వోఆర్ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారెంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది.
ఆరోపణ : స్టాంపు కాగితాలకు బదులు జిరాక్సులు ఇస్తున్నారు.
వాస్తవం : గత వంద సంవత్సరాలుగా స్టాంపు కాగితాలపైనే లావాదేవీలు నడిచాయి. కానీ, ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ సర్టిఫికెట్ స్టాంపు కాగితాలకంటే విలువైనది. వీటిని జిరాక్స్ కాపీలు అని అనడం నీచమైన చర్య. ఒకవేళ గ్యారెంటీ సర్టిఫికెట్ పోగొట్టుకున్నా, టైట్లింగ్ ఆఫీసర్ వద్ద మీ వివరాలు పదిలంగా ఉంటాయి. మళ్లీ సర్టిఫికెట్ పొందవచ్చు.
ఆరోపణ: న్యాయవాదులకు అన్యాయం జరుగుతుంది.
వాస్తవం : ఈ చట్టం అమల్లోకి వస్తే భూ వివాదాలు తగ్గిపోతాయి. తద్వారా సివిల్ కేసులు కూడా భారీగా తగ్గుతాయి. అందువల్లే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ చట్టం వల్ల పూర్తి పారదర్శకత లభిస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుంది. హైకోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక న్యాయవాదులకు సివిల్ కేసులు కూడా వస్తాయి.
ఆరోపణ : పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మ ఉంది కాబట్టి ఆ భూమి మీది కాదు.
వాస్తవం : ఇది దిక్కుమాలిన వాదన. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని అరాచక శక్తులు చేస్తున్న ఆరోపణ ఇది. కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం గ్యారెంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు వస్తాయి. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఈ పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వేక్సినేషన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు.
Comments
Please login to add a commentAdd a comment