ఒక అబద్ధం... ఒక అద్భుతం. ఒక ప్రాంత ప్రజాజీవనంలో ఈ రెండూ శత్రుసేనల్లా మోహరించి ఎదురెదురుగా నిలబడితే ఎలా ఉంటుంది? ఫ్రెంచి విప్లవ నేపథ్యకాలంలా ఉండవచ్చు. ఆ సందర్భం మీద చార్లెస్ డికెన్స్ రాసిన అద్భుతమైన నవలను చదువుతున్న అనుభూతి కలగవచ్చు. ‘ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్’ను తెలుగులోకి అనువదించిన తెన్నేటి సూరి విసిరిన ఈటెల్లాంటి మాటల్లో చెబితే... ‘అదొక వైభవోజ్జ్వల మహా యుగం, వల్లకాటి అధ్వాన్న శకం’ (ఇట్ వాస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాస్ ది వరస్ట్ ఆఫ్ టైమ్స్) అనిపించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ–సామాజిక వ్యవస్థలో ఈ రెండు పార్శా్వలను ఇప్పుడు మనం స్పష్టంగా చూడవచ్చు. ఒక రివల్యూషన్ రెక్క విప్పుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఒక రాజకీయ రెనిగేడ్‌కు ఇది చివరి యుద్ధకాలం. వాటర్‌లూ! ఆఖరి యుద్ధపు ఆర్తనాదాన్ని కూడా వినవచ్చు. ఈ వారం రోజుల్లో జరిగిన పరిణామాల్లోనూ ఈ విరోధ ఘటనల కొనసాగింపే కళ్లముందు సాక్షాత్కారమైంది. ఓటమి ఖాయమని తెలిసినా మన సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త వంచనను వదల్లేదు. అబద్ధాలను ఆపలేదు. మోసాన్ని మీసంలా తిప్పడం మానలేదు. కుట్రలు ఆగలేదు.
అబద్ధ రాజకీయ శక్తి విశ్వరూపం దాల్చి రాళ్లవాన కురిపిస్తున్నా పాలక పార్టీ కూడా వెనక్కు తగ్గడం లేదు. అబద్ధ రాజకీయాల అనుబంధ మీడియా కూడా పాలక పార్టీపై విషపు రాతల విచ్చుకత్తుల్ని విసురుతూనే ఉన్నది. రహదారి గుంతల కోసం దుర్భిణీలేసుకొని వెతుకుతూనే ఉన్నది. అసత్య కథనాల అతుకులబొంతల్ని అచ్చేసి పంచుతూనే ఉన్నది. అయినా అద్భుతం ముందడుగే వేసింది. ఈ వారం మరో మహాద్భుతం. ఫ్రెంచి విప్లవ నినాదా లైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను సమష్టిగా సంధించి విసిరిన సాధికారతా బాణం మరో ఘనవిజయాన్ని సాధించింది.
అబద్ధ రాజకీయశక్తి ఈ వారం రోజులుగా ఏం చేస్తున్నది? రోడ్ నంబర్ 65, జూబ్లీహిల్స్‌లో విశ్రాంతి మాత్రం తీసుకోవడం లేదు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అపవిత్ర రాజకీయ రహస్య భేటీల్లో మునిగితేలుతున్నది. గత ఆదివారం నాడు నగరం నిద్రపోయే సమయంలో ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డితో సమావేశమైనట్టు భోగట్టా. ఓటుకు కోట్లు గుమ్మరిస్తూ వీడియో సాక్షిగా ఒకరు, ఆడియో సాక్షిగా ఒకరూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు సహనిందితులు లోకకల్యాణం కోసమే కలుసుకున్నారంటే నమ్మగలమా?
కంటికి ఆపరేషన్ కావాలంటూ కోర్టు వారిని నమ్మించి ఆయన మెడికల్ బెయిల్‌పై బయటికొచ్చారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. అందుకు సాక్ష్యంగా ఓ కన్నుకు బ్యాండేజీతో ఒంటికన్ను చూపుతో ఆయన ఫొటోలను కూడా విడుదల చేశారు. కోర్టు వారి అనుమతి ఈనెల 28 దాకా ఉన్నందున అప్పటిదాకా విశ్రాంతి తీసుకోవాలి. ఇతర వైద్య సమస్యలేమైనా ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. ఈ క్లాజు ప్రకారం ఆయన ఏఐజీ అనే ఓ ప్రసిద్ధ కార్పొరేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. మెజీషియన్ టోపీలోంచి ఓ కుందేలు పిల్ల చెంగున దూకినట్టుగా ఆస్పత్రి నుంచి ఓ రిపోర్టు కూడా వెలువడింది.
చంద్రబాబుకు గుండెజబ్బు, చర్మవ్యాధి ఉన్నాయనీ, ఇవి పెరగకుండా మూడు నెలలపాటు నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉండాలని ఆ రిపోర్టు సూచించింది. ఈ రిపోర్టును రెగ్యులర్ బెయిల్ కోసం కూడా వాడుకున్నారు. మూడు నెలలపాటు జైలుకెళ్లకుండా ఉండటం ఓకే. మరి ఎన్నికలు సమీపి స్తున్న తరుణంలో ప్రచారం చేసుకోకుండా ఇంట్లో పడుకుంటే ఎలా? ఈ రిపోర్టు శాపంగా మారదా? అందుకే ఆస్పత్రివారు అదే రిపోర్టులో శాప విమోచన మార్గాన్ని కూడా ఉపదేశించారు.
ఆయన ప్రజా జీవితంలో నిక్షేపంగా తిరగొచ్చు. కాకపోతే ఆయన కాన్వాయ్‌లో ఒక అంబులెన్స్,అందులో వైద్యులు ఉండాలంట! అదెంత భాగ్యం? ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకుంటారు. కావాలంటే అదే ఆస్పత్రివారు సమకూర్చవచ్చు. బారా ఖూన్ మాఫ్. హాయిగా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. జైలుకు మాత్రమే వెళ్లకూడదు!
ఈ మెడికల్ రిపోర్టు మీద వైద్యరంగంలోని ప్రముఖులు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండ వలసినంత అవసరం ఆ రిపోర్టు ప్రకారమే లేదని వారు చెబుతున్నారు. సీటీ క్యాల్షియమ్ స్కోర్ అన్నది గుండె జబ్బు పెరుగుదల సూచిక కాదని, కేవలం క్యాల్షియమ్ పెరుగుదలకు మాత్రమే సూచిక అని వారి అభిప్రాయం. సీటీ క్యాల్షియం స్కోర్‌లో బాగా పెరుగుదల ఉన్నట్లయితే సీటీ యాంజియో, లేదా స్ట్రెస్ థాలియమ్ వంటి పరీక్షలతో గుండె జబ్బు తీవ్రత ఏ మేరకు ఉందో తెలుసుకుంటారు.
ఫిబ్రవరి 23న చేసిన యాంజియో పరీక్షలో గుండెజబ్బు ఉన్నట్టు గుర్తించినట్టు ఉన్నది. ఒకవేళ అది ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లయితే అప్పుడే స్టెంట్‌ను అమర్చడం గానీ, బైపాస్ సర్జరీ చేయడం గానీ చేసేవారు. అటువంటిదేమీ చేయలేదు. 2019తో పోల్చితే ఇప్పుడు క్యాల్షియమ్ పెరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు.
మరి ఫిబ్రవరి 23 నాడు యాంజియో చేసినప్పుడు క్యాల్షియం స్కోరు ఎంత ఉన్నది? రిపోర్టులో దాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? ఆ రోజున కూడా ఇప్పుడున్న స్కోరే ఉన్నదా? అటువంటప్పుడు నాడు అవసరం లేని నిరంతర వైద్య పర్యవేక్షణ ఇప్పుడెందుకు అవసరమవుతున్నది?... ఇత్యాది ప్రశ్నలపై ఇప్పుడు హైదరాబాద్ మెడికల్ సర్కిల్స్‌లో విస్తృతమైన చర్చ జరుగుతున్నది.
అబద్ధాలను వండి వార్చడం యెల్లో మీడియాకూ, వారి పార్టీ అధి నేతకూ సహజ లక్షణమనే సంగతి కొత్తగా చెప్పనవసరం లేదు. సాక్షాత్తూ న్యాయస్థానాల్లోనే తప్పుడు సమాచారమివ్వడంలో వారు రికార్డులు సృష్టించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కోర్టు మెట్లెక్కినప్పటి నుంచి యెల్లో కూటమి ఎన్ని వంకర్లు తిరిగిందో చూస్తూనే ఉన్నాము.
తాము తప్పు చేయలేదనే అంశాన్ని వాదించకుండా టెక్నికల్ గ్రౌండ్స్‌పై కేసు కొట్టేయమని దబాయించడాన్ని కూడా చూశాము. న్యాయస్థానాల్లో అబద్ధాలను గెలిపించడం కోసం కోట్ల రూపాయలను వెచ్చించి, ఖరీదైన లాయర్లను పెట్టు కోవడం చూశాము. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని మెడికల్ బెయిల్ సంపాదించి 14 గంటలపాటు ఒక ఆర్గనైజ్‌డ్ రోడ్ షోలో పాల్గొన్న వైనాన్ని కూడా ప్రజలంతా గమనించారు.
బెయిల్‌పై ‘విశ్రాంతి’లో ఉన్న బాబు నిశిరాత్రి వేళల్లో కూడా రహస్య రాజకీయాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆయన వేలుపెట్టిన సంగతి కనిపిస్తూనే ఉన్నది. తన శిష్యుడు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నందువల్ల కాంగ్రెస్‌ను గెలిపించాలనే ఉబలాటంలో ఆయన పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ గనక తెలంగాణలో గెలిస్తే అన్ని రకాలుగా తనకు వెసులుబాటుగా ఉంటుందని తనను కలిసిన వారందరితోనూ చెబుతున్నారట!
అదే ఊపుతో ఏపీ పార్టీ వ్యవహారాలను సైతం రహస్య ఎజెండాతో ఆయన నడిపిస్తున్నారు. జనసేనతో పొత్తు కుదిరి ఒక మినీ మేనిఫెస్టోను జాయింటుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ పొత్తు ధర్మానికి విరుద్ధంగా జనసేనకు అంతో ఇంతో కేడర్ వున్న నియోజక వర్గాల్లో గొడవలకు దిగేలా పార్టీ కేడర్‌ను ఆయనే రెచ్చ గొడుతున్నట్టు సమాచారం. జనసేన టిక్కెట్ ఆశిస్తున్న వారి ఆశలపై ఇప్పటి నుంచే నీళ్లు చల్లాలనేది ఆయన వ్యూహం.
తెలంగాణలో జనసేనను బీజేపీ వాళ్లు 8 సీట్లకే పరిమితం చేశారు. ఆంధ్రాలో మహా అయితే ఇంకో నాలుగైదు సీట్లు అదనంగా ఇద్దామని ఆయన భావిస్తున్నట్టు వినికిడి. తెలంగాణలో పోటీ చేస్తున్న ఎనిమిది నియోజక వర్గాల్లో సైతం పవన్ కల్యాణ్ ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. దీన్నిబట్టే ఏపీలో కూడా ఏ డజన్ సీట్లకో పవన్ ఒప్పేసుకోవచ్చునంటూ జనసేన శ్రేణులు కలవరపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, మహిళల సాధికారత కోసం గత నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం శుక్రవారం నాడు మరో గొప్ప ముందడుగు వేసింది. 35 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములపై పేదసాదలకు ప్రభుత్వం ఆ రోజున యాజమాన్య హక్కులను ప్రకటించింది. ఈ దేశంలో సాగుభూముల కోసం జరిగిన పోరాటాలెన్ని? ఆ పోరాటాల్లో అసువులు బాసిన అమర వీరులు ఎన్ని వేలమంది? తెలంగాణా సాయుధ పోరాటం ఫలితంగా పోలీస్ యాక్షన్ జరిగేలోగా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. పోలీస్ యాక్షన్ తర్వాత అందులో సింహభాగం మళ్లీ భూస్వాముల పరమైంది. భూదానోద్యమం పేరుతో ఆచార్య వినోబా భావే కొంత భూమిని తిరిగి రైతులకు ఇప్పించగలిగారు.
1973లో భూ సంస్కరణల చట్టాన్ని అప్పటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు కొంత చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రయత్నించినందువల్ల పేదలకు మేలు జరిగింది. అంతా కలిపి నాటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భూపంపిణీ ఇరవై లక్షల ఎకరాలను దాటలేదు. దేశంలో భూపంపిణీ అత్యంత సమర్థంగా జరిగిన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉన్నది. జ్యోతిబసు ప్రభుత్వం 35 లక్షల ఎకరాలను పంపిణీ చేసింది. దీని ఫలితంగా ఆ రాష్ట్రంలో 35 సంవత్సరాల పాటు సీపీఎం ప్రభుత్వం రాజ్యం చేసింది.
ఈ భూపంపిణీ వెనుక దశాబ్దాల పాటు సాగిన రైతు ఉద్యమాల నేపథ్యం ఉన్నది. బ్రిటీష్ కాలంలో జరిగిన తేభాగా రైతు పోరాటం ఉన్నది. ఇప్పుడు ఏ పోరాటం లేకుండా ఒక రక్తరహిత విప్లవాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవంతం చేసి, 35 లక్షల ఎకరాలపై పేదసాదలకు యాజ మాన్య హక్కులు కట్టబెట్టింది. ఇటువంటి చర్యలు పెత్తందార్లు అస్సలు సహించలేరని నూజివీడు సభలో జగన్ ముందుగానే ఊహించారు. ఆయన ఊహించినట్టే యెల్లో మీడియా నోళ్లు ‘వెవ్వెవ్వే’ అనడం మొదలుపెట్టాయి.
అసైన్డ్ భూములకు హక్కులు కల్పించడం ఏం గొప్ప అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. భూమి దున్నడం వేరు. దున్నేవాడిదే భూమి కావడం వేరు. ఈ భూప్రపంచం మీద జరిగిన రైతాంగ పోరాటాలన్నింటినీ నడిపించిన రణన్నినాదం – దున్నేవాడిదే భూమి! ఆ నినా దాన్ని సార్థకం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా సాధికారత దిశలో సాధించిన ఒక గొప్ప విజయం. పెత్తందారీ కుతంత్ర రాజకీయం ఉడికి పోతున్నది. ఏప్రిల్‌లో జరిగే ఆఖరి యుద్ధానికి కుట్రలు రచిస్తున్నది. తొలి గెలుపులతో ఉత్సాహం నింపుకున్న సాధికార శక్తులు అంతిమ విజయం కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాయి.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
అద్భుత యుగం... అధ్వాన్న శకం!
Published Sun, Nov 19 2023 12:35 AM | Last Updated on Sun, Nov 19 2023 9:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment