పూటకో మాట. గడియకో పార్టీతో పొత్తు. రోజుకొక సిద్ధాంతం. అనుక్షణం కావల్సినంత రాద్ధాంతం. ఇవీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డైరీ ఓపెన్ చేస్తే కనిపించేది. తమ అభిమాన నాయకుడు.. పొత్తుల భాగస్వామి చంద్రబాబు నాయుడు జైలుకు పంపడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ షాక్ నుంచి కోలుకోలేక.. తేరుకోలేక పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని.. ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి కేసును వెలుగులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జీఎస్‌టీ విభాగం అధికారులు. చంద్రబాబు అండ్ కో, షెల్ కంపెనీలతో ఎలా దోచుకున్నారో సాక్ష్యాలతో బయట పెట్టారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐటీ శాఖ అధికారులు. ఈ అవినీతి బాగోతంలో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ). చిరవకు అవినీతి దందా అంతటికీ అసలు సూత్రధారి పాత్రధారి దర్శకత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడే అని సాక్ష్యాలతో సహా తేలిపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసింది ఏపీ సిఐడీ.
నిబంధనల ప్రకారం చట్టాల ప్రకారం రిమాడ్ రిపోర్ట్ తయారు చేసి ఏసీబీ కోర్టుకు సమర్పించారు అధికారులు. చంద్రబాబు నాయుడు ఒట్టి అమాయకుడని, ఈ కుంభకోణానికి ఆయనకూ సంబంధం లేదని వాదించిన బాబు తరపు న్యాయవాదులు.. అవినీతి జరగలేదని మాత్రం అనలేదు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. సీఐడీ వాదనలతో ఏకీభవించారు. అందుకే చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు.
► చంద్రబాబుకు అసలు రిమాండే ఉండదని అనుకుంటూ వచ్చిన టీడీపీ నేతలు, పవన్ కల్యాణ్.. రెండు రోజుల పాటు మౌనంగా ఉన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించడంతో.. షాక్ తిన్న పవన్ కల్యాణ్ బాబుకు చివరి వరకు తన మద్దతు ఉంటుందని అన్నారు.
► చిత్రం ఏంటంటే.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేనలు వ్యూహాత్మకంగా ఒక అవగాహన కుదుర్చుకుని విడివిడిగా పోటీ చేశాయి. అపుడు చంద్రబాబు నాయుడి అవినీతిపై నిప్పులు చెరిగారు పవన్.
► ఇపుడు 2024 ఎన్నికలకోసం చంద్రబాబుతో జట్టుకడుతోన్న పవన్.. రూ. 371 కోట్లు లూటీ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన చంద్రబాబుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు.
► చంద్రబాబు లాంటి సీనియరనే అరెస్ట్ చేస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పవన్ కల్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
► చంద్రబాబును అవినీతి కేసులో న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్ కు పంపారు. పవన్ కల్యాణ్ మాత్రం ఏ పాపం ఎరుగని కణ్వమహర్షిని అరెస్ట్ చేసినట్లు బాధ పడిపోతున్నారని పాలక పక్ష నేతలు అంటున్నారు. ప్యాకేజీ తీసుకోవడం వల్లనే పవన్ చంద్రబాబు అవినీతికి వత్తాసు పలుకుతున్నారని మంత్రి అంబటి రాంబాబు లాంటి వాళ్లు దుయ్యబడుతున్నారు.
► తమ అభిమాన నాయకుడు పొత్తుల భాగస్వామి చంద్రబాబు నాయుణ్ని జైలుకు పంపడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ మోహన్ రెడ్డే ఇదంతా చేస్తున్నారని మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే తలా తోకా లేనట్లు తెలంగాణా యువత జగన్ ను రాళ్లతో కొట్టారని.. భవిష్యత్తులో ఏపీలోనూ రాళ్లతో కొడతారని పవన్ శాపనార్ధాలు పెట్టారు.
► గతంలో తెలంగాణా గడ్డపైనే హైదరాబాద్‌లో.. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పవన్ కల్యాణ్‌కు అరగుండు కొట్టించారని వార్తలొచ్చాయి. ఈ వార్తలు ప్రచారం చేసింది నాటి కాంగ్రెస్ నేతలు కాదు. పవన్ అంటకాగుతోన్న టీడీపీ నేతలే!. ఈ వాస్తవాన్ని బయట పెట్టింది కూడా పవన్ కల్యాణే. భవిష్యత్తులో.. ఏపీలోనూ మరో టీడీపీ నేత పవన్ కల్యాణ్ కు పూర్తి గుండు కొట్టించే అవకాశాలున్నాయని పాలక పక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.
► ‘‘జగన్ మోహన్ రెడ్డి ఒక క్రిమినల్.. నే చెబుతున్నా రాసుకోండి’’ అని పవన్ అన్నారు. ‘‘ముగ్గురు మహిళల జీవితాలు నాశనం చేసి విడాకులతో పాటు కొంత డబ్బు ఇచ్చేస్తే పాపం పరిహారం అయిపోతుందని దురహంకారానికి పోయే పవన్ ఒక కీచకుడు.. రాసి పెట్టుకోండి’’ అని వైఎస్సార్ సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడి దగ్గర ఎప్పటికప్పుడు ప్యాకేజీలు తీసుకోవడం వల్లనే ఆ విశ్వాసాన్ని విధేయత రూపంలో ప్రదర్శించుకునేందుకు పవన్ నోటికెంతొస్తే అంతా వాగుతున్నారని పాలక పక్ష నేతలు అంటున్నారు. జనసేనను బాగు చేసుకునే పనిపై దృష్టి సారిస్తే మంచిదని వారు పవన్‌కు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment