చిత్తూరు డెయిరీ
సాక్షి, అమరావతి: దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయా డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపన తర్వాత 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిత్తూరు డెయిరీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం 1945లో చిల్లింగ్ ప్లాంట్‌గా ఏర్పడగా, 1969లో పూర్తి స్థాయి డెయిరీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత రోజుకు 2 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో 1988లో చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌గా ఏర్పడింది. జిల్లాలోని మొత్తం డెయిరీ కార్యకలాపాలను దాని పరిధిలోకి తీసుకొచ్చారు. డెయిరీకి అనుబంధంగా పిచటూర్, శ్రీకాళహస్తి, మదనపల్లి, వి.కోట, పీలేరులో మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
1988–93 మధ్య చిత్తూరు డెయిరీ సగటున రోజుకు 2.5 – 3 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే స్థాయికి చేరుకుంది. తిరుమల శ్రీవారి ఆలయానికి పాల ఉత్పత్తుల సరఫరాలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు చిత్తూరు డెయిరీకి అనుబంధంగా నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) ద్వారా తిరుపతిలో 1992–93లో లక్షన్నర లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంలో బాలాజీ డెయిరీని ఏర్పాటు చేశారు.
హెరిటేజ్ కోసం నిర్వీర్యం
సరిగ్గా అదే సమయంలో హెరిటేజ్ డెయిరీ పురుడు పోసుకుంది. చంద్రబాబునాయుడు తన డెయిరీ హెరిటేజ్ కోసం లాభాల్లో దూసుకుపోతున్న చిత్తూరు డెయిరీని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడం మొదలు పెట్టారు. ఆర్థిక నష్టాలకు గురిచేసి, చివరికి రైతులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితికి తీసుకొచ్చారు. చెప్పాపెట్టకుండా 2002 ఆగష్టు 31న ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మూత వేశారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు రూ.వందల కోట్లు బకాయి పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ ప్రకటించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2008లో మదనపల్లి చిల్లింగ్ యూనిట్‌ను పాక్షికంగా పునఃప్రారంభించగా, ఆ తర్వాత వచ్చిన పాలకుల నిర్వాకంతో మళ్లీ మూత పడింది. ప్రస్తుతం చిత్తూరు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి యూనియన్ లిక్విడేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రోజుకు 1.5 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో లాభాల్లో నడుస్తున్న బాలాజీ డెయిరీకి చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొట్టడంతో ఎన్‌డీడీబీకి అప్పగించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. దీని నిర్వహణా బాధ్యతలను ఎన్‌డీడీబీ శ్రీజ డెయిరీకి అప్పగించగా, ప్రస్తుతం 3 లక్షల లీటర్ల సామర్థ్యానికి విస్తరించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు..
ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్దరణకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుంబిగించారు. రాష్ట్రంలో సహకార డెయిరీలకు పూర్వవైభవం తీసుకు రావాలన్న సంకల్పంతో ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్)తో చేసుకున్న విషయం తెలిసిందే. జగనన్న పాల వెల్లువ పథకం కింద ఇప్పటికే 3.07 లక్షల మందితో 3,551 మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాల సేకరణ ద్వారా రూ.393 కోట్లు చెల్లించారు.
అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాల సేకరణ ధర వల్ల ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.3,754 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. వీరి కోసం గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా 4,796 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు నిర్మిస్తున్నారు. మరో వైపు మూత పడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రీ ప్యాకింగ్, ప్రాసెసింగ్, అల్ట్రా హై ట్రీట్‌మెంట్ (యూహెచ్‌టీ) ప్రీ ప్యాకింగ్, యూహెచ్‌టీ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా మదనపల్లి యూనిట్‌ను పునరుద్ధరించారు. 2021 నుంచి దీన్ని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది.
అమూల్ రూ.385 కోట్ల పెట్టుబడులు
చిత్తూరు డెయిరీని పునరుద్ధరించడం ద్వారా పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు హెరిటేజ్ ఫుడ్స్‌కు బలమైన పోటీదారుగా నిలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే లక్ష్యంతో డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం అమూల్ సంస్థ ద్వారా రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టిస్తోంది.
తొలుత రూ.150 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీరు, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు యూహెచ్‌టీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. డెయిరీ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది.
శంకుస్థాపనకు ఏర్పాట్లు
2002లో మూత పడిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. జూలై 4వ తేదీన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
– అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్
ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్నాం
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నాం. లాభాల్లో నడిచిన ఈ డెయిరీని కావాలనే నాశనం చేశారు. ఈ డెయిరీ మూత పడడంతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోయాల్సి వచ్చేది. నాకు ఐదు ఆవులున్నాయి. రోజుకు 18–20 లీటర్ల పాలు పోస్తుంటా. గతంలో లీటర్‌కు రూ.20కి మించి వచ్చేది కాదు. అమూల్ రాకతో ప్రస్తుతం రూ.43 వస్తోంది. నిజంగా చాలా ఆనందంగా ఉన్నాం. డెయిరీ పునరుద్ధరణతో ఈ ప్రాంత పాడి రైతులందరికీ మేలు జరుగుతుంది.
– ఎం.చిట్టిబాబు, జి.గొల్లపల్లి, తవనంపల్లి మండలం, చిత్తూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment