vijaya diary
-
విజయ డెయిరీ ఎన్నికల్లో కూటమి నేతల కుట్రలు
-
చంద్రబాబు చంపేసిన చిత్తూరు డెయిరీకి పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయా డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపన తర్వాత 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిత్తూరు డెయిరీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం 1945లో చిల్లింగ్ ప్లాంట్‌గా ఏర్పడగా, 1969లో పూర్తి స్థాయి డెయిరీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రోజుకు 2 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో 1988లో చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌గా ఏర్పడింది. జిల్లాలోని మొత్తం డెయిరీ కార్యకలాపాలను దాని పరిధిలోకి తీసుకొచ్చారు. డెయిరీకి అనుబంధంగా పిచటూర్, శ్రీకాళహస్తి, మదనపల్లి, వి.కోట, పీలేరులో మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 1988–93 మధ్య చిత్తూరు డెయిరీ సగటున రోజుకు 2.5 – 3 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే స్థాయికి చేరుకుంది. తిరుమల శ్రీవారి ఆలయానికి పాల ఉత్పత్తుల సరఫరాలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు చిత్తూరు డెయిరీకి అనుబంధంగా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ద్వారా తిరుపతిలో 1992–93లో లక్షన్నర లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంలో బాలాజీ డెయిరీని ఏర్పాటు చేశారు. హెరిటేజ్ కోసం నిర్వీర్యం సరిగ్గా అదే సమయంలో హెరిటేజ్ డెయిరీ పురుడు పోసుకుంది. చంద్రబాబునాయుడు తన డెయిరీ హెరిటేజ్ కోసం లాభాల్లో దూసుకుపోతున్న చిత్తూరు డెయిరీని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడం మొదలు పెట్టారు. ఆర్థిక నష్టాలకు గురిచేసి, చివరికి రైతులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితికి తీసుకొచ్చారు. చెప్పాపెట్టకుండా 2002 ఆగష్టు 31న ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మూత వేశారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు రూ.వందల కోట్లు బకాయి పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2008లో మదనపల్లి చిల్లింగ్ యూనిట్‌ను పాక్షికంగా పునఃప్రారంభించగా, ఆ తర్వాత వచ్చిన పాలకుల నిర్వాకంతో మళ్లీ మూత పడింది. ప్రస్తుతం చిత్తూరు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి యూనియన్ లిక్విడేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రోజుకు 1.5 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో లాభాల్లో నడుస్తున్న బాలాజీ డెయిరీకి చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొట్టడంతో ఎన్డీడీబీకి అప్పగించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. దీని నిర్వహణా బాధ్యతలను ఎన్డీడీబీ శ్రీజ డెయిరీకి అప్పగించగా, ప్రస్తుతం 3 లక్షల లీటర్ల సామర్థ్యానికి విస్తరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్దరణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుంబిగించారు. రాష్ట్రంలో సహకార డెయిరీలకు పూర్వవైభవం తీసుకు రావాలన్న సంకల్పంతో ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్)తో చేసుకున్న విషయం తెలిసిందే. జగనన్న పాల వెల్లువ పథకం కింద ఇప్పటికే 3.07 లక్షల మందితో 3,551 మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాల సేకరణ ద్వారా రూ.393 కోట్లు చెల్లించారు. అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాల సేకరణ ధర వల్ల ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.3,754 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. వీరి కోసం గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా 4,796 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు నిర్మిస్తున్నారు. మరో వైపు మూత పడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రీ ప్యాకింగ్, ప్రాసెసింగ్, అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్రీ ప్యాకింగ్, యూహెచ్‌టీ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా మదనపల్లి యూనిట్‌ను పునరుద్ధరించారు. 2021 నుంచి దీన్ని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. అమూల్ రూ.385 కోట్ల పెట్టుబడులు చిత్తూరు డెయిరీని పునరుద్ధరించడం ద్వారా పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు హెరిటేజ్ ఫుడ్స్‌కు బలమైన పోటీదారుగా నిలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే లక్ష్యంతో డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం అమూల్ సంస్థ ద్వారా రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టిస్తోంది. తొలుత రూ.150 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీరు, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు యూహెచ్‌టీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. డెయిరీ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. శంకుస్థాపనకు ఏర్పాట్లు 2002లో మూత పడిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. జూలై 4వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్నాం చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నాం. లాభాల్లో నడిచిన ఈ డెయిరీని కావాలనే నాశనం చేశారు. ఈ డెయిరీ మూత పడడంతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోయాల్సి వచ్చేది. నాకు ఐదు ఆవులున్నాయి. రోజుకు 18–20 లీటర్ల పాలు పోస్తుంటా. గతంలో లీటర్‌కు రూ.20కి మించి వచ్చేది కాదు. అమూల్ రాకతో ప్రస్తుతం రూ.43 వస్తోంది. నిజంగా చాలా ఆనందంగా ఉన్నాం. డెయిరీ పునరుద్ధరణతో ఈ ప్రాంత పాడి రైతులందరికీ మేలు జరుగుతుంది. – ఎం.చిట్టిబాబు, జి.గొల్లపల్లి, తవనంపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
విజయ పాల ధరలు పెంపు
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. గేదె, ఆవు పాల ధరలను లీటర్‌కు రూ.4 చొప్పున పెంచుతున్నామని, ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నిజానికి పాడి రైతుల సమక్షంలో డెయిరీ బోర్డు సమావేశం నిర్వహించి.. ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ అధికారికంగా అలాంటి సమావేశమేమీ నిర్వహించకుండానే.. గుట్టుచప్పుడు కాకుండా మూడు రోజుల క్రితమే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. అయితే నెలవారీ కార్డులు తీసుకున్న వారికి ఆ పరిమితి ముగిసేంతవరకు.. అంటే సెప్టెంబర్ 10, 13 తేదీల వరకు పాత రేట్లే వర్తిస్తాయని డెయిరీ యాజమాన్యం ప్రకటించింది. -
అనుభవం లేదు.. సమర్థతా లేదు
సాక్షి, అమరావతి: ఏ రంగంలో అయినా, ఏ సంస్థలో అయినా ఉన్నత స్థానానికి వెళ్లాలంటే దానికి సంబంధించి ఎంతోకొంత అనుభవం ఉండాలి. దాన్ని నిర్వహించే సమర్థత ఉండాలి. అలాంటివేమీ లేకుండా.. అప్పటివరకు దాంతో సంబంధంలేని చలసాని ఆంజనేయులు ఒక్కసారిగా విజయ డెయిరీ చైర్మన్‌గా అందలం ఎక్కేశారు. దీనికి టీడీపీకి చెందిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ వ్యూహమే కారణమని చెబుతున్నారు. దాసరి బాలవర్థనరావు చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు ఆంజనేయుల్ని రంగంలోకి దించారు. అప్పటివరకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలతో ఎలాంటి సంబంధంలేని ఆయన్ని 2017లో ఆయన సొంత గ్రామం బాపులపాడు మండలం కాకులపాడు పాల సొసైటీకి చైర్మన్‌గా చేశారు. వెంటనే విజయ డెయిరీ డైరెక్టర్‌గా రంగంలోకి దింపి పాలకవర్గంలోకి వెళ్లేలా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బాలవర్థనరావును పక్కకునెట్టి మండవ జానకిరామయ్య స్థానంలో ఆంజనేయుల్ని చైర్మన్‌గా ఎన్నుకునేలా చేశారు. దీంతో వేలాది మంది పాడి రైతుల భవితవ్యంపై ఏమాత్రం అవగాహనలేని వ్యక్తికి పగ్గాలిచ్చారు. ఇప్పుడు ఆయన తప్పుడు నిర్ణయాలు సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తనకు రాజకీయంగా లబ్ధి కలుగుతుందనే కారణంతో దేవినేని ఉమా ప్రతిష్టాత్మకమైన సంస్థకి చలసాని ఆంజనేయుల్ని చైర్మన్‌గా చేసేలా చక్రం తిప్పి రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని పలు సొసైటీల చైర్మన్లు ఆరోపిస్తున్నారు. ఎన్నో అవకతవకలు.. ఏ సంస్థలో అయినా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు ఒక విధానం ఉంటుంది. కానీ, విజయ డెయిరీలో మాత్రం చైర్మన్ తనకు కావాల్సిన వాళ్లకి ఒకలా, మిగిలిన ఉద్యోగులకు మరోలా ఇవ్వడంపై సంస్థలో దుమారం రేగుతోంది. తాను చెప్పినట్లు నడుచుకునే వారికి 15–20 శాతం ఇంక్రిమెంట్ ఇస్తూ మిగిలిన వారికి తూతూమంత్రంగా ఇస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. అంతేకాక.. ► 25 ఏళ్లుగా డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తికి సంస్థలో జరిగే వివిధ పనుల కాంట్రాక్టుల్ని ఎలాంటి టెండర్లు లేకుండా చైర్మన్ కట్టబెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ► ఇలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు చిల్లింగ్ సెంటర్, కళ్యాణ మండపం మరమ్మతుల పనుల్ని అతనికి అప్పగించారు. ► తాను చైర్మన్ అయ్యాక తనకు అనుకూలమైన అధికారుల్ని నియమించుకునే విషయంలో నిబంధనలకు పాతరేశారు. ► ఉదా.. హెరిటేజ్ సంస్థ తొలగించిన ఇద్దరిని డీజీఎం స్థాయిలో లక్షల జీతాలకు నియమించడంపై పలు సొసైటీల చైర్మన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ► ఇలా స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను భ్రష్టుపట్టిస్తున్నారని అన్ని వైపుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చైర్మన్ మాత్రం తాను డెయిరీని అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై పూర్తిస్థాయి విచారణ జరిగితే అక్రమాలు బట్టబయలవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. ‘సాక్షి’ కథనంతో ఉలికిపాటు.. సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ‘సాక్షి’ మంగళవారం సంచికలో ప్రచురితమైన ‘‘పా‘పాల’ పుట్ట’’ కథనంతో చైర్మన్.. ఆయనకు మద్దతుదారులు ఉలిక్కిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని చైర్మన్ ఒక పత్రికా ప్రకటన తయారుచేసి జిల్లాలోని వివిధ పాల సొసైటీలకు పంపి మీడియా సమావేశాలు పెట్టించారు. ఇవేమీ తమకు తెలీదని కొందరు తప్పించుకున్నారు. సంస్థలోని పలువురు డైరెక్టర్లతో విజయవాడలో మీడియా సమావేశం పెట్టి తనకు అనుకూలంగా మాట్లాడించారు. ‘సాక్షి’ కథనంలో పేర్కొన్న అంశాలకు వారు సమాధానం చెప్పకుండా చైర్మన్‌ను పొగడడానికి తాపత్రయపడ్డారు. భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వివరణ ఇవ్వకుండా గత పాలకవర్గం నుంచి భూములు కొంటున్నారంటూ కొత్త వాదన లేవనెత్తారు. అలాగే, విజయ పార్లర్లలో బయట ఉత్పత్తుల అమ్మకాలు సంస్థ వ్యాపార సూత్రమని సమర్ధించుకున్నారు. రైతులకివ్వాల్సిన బోనస్ చెల్లించకపోవడం, కమీషన్ల కోసం జరిపిన కొనుగోళ్లు వంటి అంశాలపై డొంకతిరుగుడు వివరణలు ఇచ్చారు. మొత్తం మీద అవాస్తవాలు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పాలు పోసినా దక్కని ‘పాడి పశువు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ ‘పాడి పశువు’కొంతమంది విజయ డెయిరీ రైతులకు దక్కడంలేదు. దశాబ్దాల తరబడి విజయ డైరీకి పాలు పోస్తున్న రైతుల్లో వేలాది మందికి ఈ పథకం వర్తించడంలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 35 వేల మంది రైతులు సబ్సిడీ పాడి పశువులు పొందే అవకాశం కోల్పోయారు. మొత్తం లక్ష మంది రైతులు విజయ డెయిరీకి నిరంతరం పాల సేకరణలో చేదోడు వాదోడుగా ఉండగా వారిలో 65 వేల మందికి మాత్రమే సబ్సిడీ గేదెలు దక్కుతాయని అధికారులు తేల్చి చెప్పారు. 35 వేల మంది పాడి రైతుల్లో చాలామంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. నాలుగు డెయిరీల్లోని 2.13 లక్షల రైతులకు లబ్ధి తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. నాలుగైదు రోజుల్లో పలుచోట్ల గేదెలను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఒక్కో పాడి పశువుకు రూ.80 వేలు యూనిట్ ధరగా నిర్ధారించారు. దానికి అదనంగా రూ. 5 వేలు రవాణా, ఇతర ఖర్చుల కోసం సర్కారు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీ (రూ. 60 వేలు) ఇస్తారు. అందులో మిగిలిన 25 శాతం (రూ.20 వేలు) లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఇతరలబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ (రూ.40 వేలు) ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు సబ్సిడీపాడి పశువుల కోసం ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే పలుచోట్ల పాడి రైతులు తమ వాటాధనాన్ని చెల్లించారు. అయితే, విజయ డెయిరీలోని రైతుల్లో దాదాపు 35 వేల మంది వరకు సబ్సిడీ పాడిపశువులను పొందే అవకాశాన్ని కోల్పోయారు. ‘ఈ–లాభ్’లో నమోదు కాకపోవడం వల్లే... నాలుగు డెయిరీలకు చెందిన మొత్తం 2.13 లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. అందులో విజయ డెయిరీకి చెందిన పాడి రైతులు 65 వేలు అర్హులుగా నిర్ధారించింది. పశు సంవర్థక శాఖ ఏర్పాటు చేసిన ‘ఈ–లాభ్’పోర్టల్‌లో నమోదైన రైతులకే సబ్సిడీ పాడి పశువులు పొందేందుకు అర్హులని పేర్కొంది. ఇది విజయ డెయిరీలోని 35 వేల మంది రైతులకు శాపంగా మారింది. వాస్తవంగా విజయ డెయిరీకి గ్రామాల్లో పాల సొసైటీల ద్వారా పాలు వస్తాయి. ఆయా సొసైటీలకు రైతులు పాలు పోస్తుంటారు. అయితే, గత నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని విజయ డెయిరీ యాజమాన్యం ఇవ్వలేదు. దీంతో అనేకమంది రైతులు తాము పాలు పోయమంటూ తేల్చిచెప్పారు. దీంతో జిల్లాల్లో ఉన్న పాల సొసైటీ యాజమాన్యాలు సొంతంగానే రైతులకు లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం ఇచ్చాయి. ఆ సమయంలోనే ఈ–లాభ్ పోర్టల్‌లో పాడి రైతుల సమాచారం నింపాలని, ఆ సమాచారం ఉంటేనే ప్రోత్సాహకం ఇస్తామని విజయ డెయిరీ యాజమాన్యం స్పష్టంచేసింది. అయితే అప్పటికే రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చిన స్థానిక పాల సొసైటీలు, తమ సొమ్ము వస్తుందో రాదోనని గమనించి కేవలం కొద్దిమంది రైతులే పాలు పోస్తున్నారనే సమాచారాన్ని నమోదు చేశారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో 4 వేల మంది రైతులు పాలు పోస్తుంటే, ఈ–లాభ్‌లో మాత్రం 1,200 మంది పాడి రైతులే పాలు పోస్తున్నట్లు నమోదు చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది పాలు పోస్తుంటే, కేవలం 65 వేల మంది పేర్లనే నమోదు చేశారు. ఇదే కొంపముంచింది. ఈ–లాభ్‌లో ఉన్న రైతులనే సబ్సిడీ పాడి పశువుల పథకానికి ప్రమాణికం తీసుకోవడంతో విజయ డెయిరీకి పాలు పోసే రైతుల్లో 35 వేల మంది అర్హత కోల్పోయారు. కొన్నిచోట్ల వేలాది మంది రైతులు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహక సొమ్ము కూడా కోల్పోతుండటం పరాకాష్ట. పాడి రైతులకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇప్పుడు సబ్సిడీ బర్రెల పథకానికి నోచుకోవడం లేదు. దీన్ని పరిష్కరించడంలో పశు సంవర్థక శాఖ శ్రద్ధ చూపడంలేదు. వారందరూ అనర్హులంటూ భీష్మించుకు కూర్చుంది. ప్రైవేటు డెయిరీలు మాత్రం పాల పరిమాణానికి మించి రైతులను చేర్చుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. -
విజయ డెయిరీ గాలికి.. హెరిటేజ్ డెయిరీకి అందలం..
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి కోరల్లో కూరుకుపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ నేతలు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తూ హ్యాపీగా ఉంటున్నారని మండిపడ్డారు. నయవంచన దీక్షలను ఆపి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. చిత్తూరు డెయిరీని గాలికి వదిలేసిన చంద్రబాబు సొంత హెరిటేజ్ డెయిరీని అందలం ఎక్కించారని ఆరోపించారు. చిత్తూరులోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
విజయా డెయిరీ సమావేశం రసాభాస
ప్రైవేటు డెయిరీలకు అనుకూలంగా యాజమాన్యం సేకరణ ధరను పెంచకపోవడంతో తగ్గుతున్న పాలు యాజమాన్యం తీరుపై విరుచుకుపడిన సొసైటీల అధ్యక్షులు నెల్లూరు రూరల్ : విజయ డెయిరీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సొసైటీలు నిర్వీర్యమవుతున్నాయని పలువురు సొసైటీల అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరపురంలోని విజయ డెయిరీ ఆవరణంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. పలువురు సొసైటీల అధ్యక్షులు డెయిరీ ఎండీ కృష్ణమోహన్ తీరును తప్పుబట్టారు. ప్రైవేటు డెయిరీలతో ఒప్పందం చేసుకుని పాల సేకరణ ధరలను పెంచకపోవడంతో రైతులు పాలను ఇతర డెయిరీలకు పోస్తున్నారన్నారు. ఫలితంగా సొసైటీలు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుకు డిమాండ్ లేకపోయినా రూ.10 లక్షలు వెచ్చించి యంత్రాలను ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్పలేక ఎండీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగులు రైతులు పాలు పోయడంతోనే జీతాలు తీసుకుంటున్నామన్న విషయాన్ని మరిచిపోయి వారిని చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు, అధికారుల మధ్య వాగ్వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ చైర్మన్ గోపాలకృష్ణయ్య చౌదరి జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి: చిల్లకూరు సుధీర్‌రెడ్డి పాలకవర్గం చేస్తున్న అనవసర ఖర్చులతో డెయిరీకి లాభాలు తగ్గుతున్నాయని విజయ డెయిరీ మాజీ చైర్మన్ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర జిల్లాలో పాల సేకరణ ఖర్చు రూ.2 ఉంటే, జిల్లాలో రూ.7.12గా ఉందన్నారు. 180 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉండగా, వారితో పని చేయించకుండా కాంట్రాక్టు కార్మికులను తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాల్లో గుంటూరుకు చెందిన సంగం డెయిరీ లీటరు పాలకు రూ.55.50 ఇస్తుండడంతో రైతులు అటు వైపు మెగ్గు చూపుతున్నారన్నారు. అధికారుల అలసత్వంతో డెయిరీలో దొంగలు పడి రూ.11.5 లక్షలను తీసుకెళ్లినా పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సుబేదారుపేటలోని ఆస్తులను వాస్తు పేరుతో ధారాదత్తం చేయడం ఏమిటని మండిపడ్డారు. కావలి సొసైటీ ఖాతాలో జమ చేయాల్సిన మొత్తాన్ని మేనేజర్ ఖాతాలో ఏలా వేస్తారని ప్రశ్నించారు. పాలకవర్గ సభ్యుల సిట్టింగ్ అలవెన్సులు, చైర్మన్ కారు, గౌరవవేతనం, ఇంటి అలవెన్సుల వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లాభాల బాటలో డెయిరీ:కొండ్రెడ్డి రంగారెడ్డి, చైర్మన్ ప్రస్తుతం విజయ డెయిరీ లాభాల బాటలో నడుస్తోందని చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. పాలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని తెలిపారు. పశుపోషణను ప్రోత్సహించేందుకు పశువులకు దాణా, వ్యాధి నిరోధక టీకాలు, మందులు, సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందజేస్తున్నట్లు వివరించారు. మేలు జాతి పశుసంపద కోసం విత్తన దున్నలను సైతం అందిస్తున్నామని తెలిపారు. -
‘మండవ’కే విజయ డెయిరీ పగ్గాలు
నిర్ణయించిన సీఎం నేడు ఎన్నిక లాంఛనం విజయవాడ : కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) చైర్మన్ పదవిని మళ్లీ మండవ జానకిరామయ్యకే అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నగరంలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి సమక్షంలో విజయ డెయిరీ చైర్మన్ నియామకంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత చైర్మన్ మండవ జానకిరామయ్యతోపాటు 14 మంది పాలకవర్గ డైరెక్టర్లు, పలువురు మంత్రులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గంటన్నర చర్చల అనంతరం మళ్లీ మండవ జానకిరామయ్యకే విజయ డెయిరీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. బుధవారం జరిగే ఎన్నికల్లో మండవను చైర్మన్‌గా ఎన్నుకోవాలని డైరెక్లర్లను సీఎం ఆదేశించారు. వేర్వేరుగా భేటీలు.. ముందుగా పాలకవర్గ డైరెక్టర్లతో సీఎం భేటీ అయ్యారు. ఆ తర్వాత జానకిరామయ్యతో సుమారు అర్ధగంట ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం జిల్లా మంత్రులు, నాయకులతోనూ చర్చించారు. మండవ ప్రత్యర్థులు ఆయన్ను వ్యతిరేకించారు. అయితే 24 ఏళ్లు ఆ పదవిలో ఉన్న మండవకు మరో ఏడాది చైర్మన్ పదవి అప్పగించాలని మెజార్టీ పాలకవర్గ సభ్యులు సూచించారు. ఈ క్రమంలో సీఎం కూడా మండవకు మద్దతు తెలిపారు. ఏడాది మాత్రమే మండవకు పదవి ! మండవ జానకిరామయ్యకు ఏడాది మాత్రమే చైర్మన్ పదవి ఇవ్వాలని లోపాయికారి ఒప్పందం కుదరిందని సమాచారం. ఏడాది తర్వాత చైర్మన్ నియామకంపై చర్చిద్దామని మంత్రులకు సీఎం చెప్పినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, చైర్మన్ పదవి కోసం ప్రయత్నించిన చలసాని ఆంజనేయులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.