‘కొందరు వాలంటీర్లు అసాంఘీక శక్తులు’.. అంటూ ఈనాడు పేపర్లో బ్యానర్ హెడింగ్.. ఆ కిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానికి వంత పాడుతున్నట్లుగా వాలంటీర్లకు భార్యభర్తల తగాదాలతో ఏమి పని? అని ప్రశ్న. పవన్ కల్యాణ్ వాలంటీర్లను అన్నదాని గురించి తప్పేముంది అని వత్తాసు.. అదే పేజీలో వాలంటీర్ల గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. ఇదంతా ఏమిటి? ఎందుకు? ఎవరిమీద వీరి ప్రతాపం?.. ఈనాడు రామోజీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్థాయి ఏమిటి? వాలంటీర్ల స్థాయి ఏమిటి? వారంతా సూపర్ రిచ్.. వలంటీర్లు ఏమో అత్యధికులు పేద, దిగువ మధ్య తరగతి వారు..
వాలంటీర్ వ్యవస్థకే వీళ్లు ఇంత గడగడలాడుతూ.. విష ప్రచారం చేస్తున్నారంటే వీళ్లను ఏమని అనుకోవాలి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సూటిగా ఎదుర్కోలేక ఇంత చిన్నవారిపై ఇంత అల్లరా? ఇంత అరాచకమా? ఇన్ని అబద్దాలా?...
✍️ అదే రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన కొన్ని వార్తలు కూడా చూద్దాం.. రామోజీరావుకు చెందిన మార్గదర్శి కేసులో అక్రమ డిపాజిట్లు చేసిన 800 మందికి సీఐడీ నోటీసులు.. కోటి రూపాయల పైబడి డిపాజిట్ చేసినవారు వేలల్లో ఉన్నారు.. అని ఒక కధనం. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత మిత్రుడైన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను అవినీతి ఆరోపణలపై పదవి నుంచి తప్పించి దర్యాప్తు సంస్థ ద్వారా విచారణకు ఆదేశించిన ఆ దేశ ప్రధానమంత్రి.. ఇక పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో గళమెత్తిన వలంటీర్లు.. ఇలా కొన్ని వార్తలు ఉన్నాయి.
✍️ ఇందులో ఏది ముఖ్యమైన వార్త అనుకోవాలి? ఈనాడు వారంటే మార్గదర్శి వారిదే కనుక, అందులో అక్రమాలు బయటకు వస్తుంటే వారి పరువు పోతోందన్న బాధతో ఆ వార్త ఇవ్వలేదనుకుందాం. ఈనాడుతో సహా ఇతర ఎల్లో మీడియా కూడా ఈ వార్తలు ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. అవే కాదు.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గురించిన వార్త ఎందుకు ఇవ్వలేదు? పోనీ.. పవన్ కల్యాణ్ పై వ్యక్తం అవుతున్న నిరసనల గురించి ఎందుకు కథనాలు ఇవ్వడం లేదు. అందుకే ఈనాడు, ఆంద్రజ్యోతి,టివి 5 వంటి మీడియా సంస్థలు తెలుగుదేశం కోసమే బతుకుతున్నాయి. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే తాము బట్టకట్టకలుగుతామని.. లేకుంటే శంకరగిరి మాన్యాలేనని భయపడుతున్నాయి. అందువల్లే ఉన్నవి,లేనివి కలిపి పచ్చి అసత్యాలతో తమ పత్రికలలో అచ్చేస్తున్నాయి. టీవీలలో ప్రసారం చేస్తున్నాయి.
✍️ అవి జర్నలిజం విలువలతో సంబంధం లేకుండా దిగజారిపోయి వ్యవహరిస్తున్నాయి. ఈ మీడియా రెండు వైపుల వార్తలను ఇస్తే తప్పు లేదు. అసలు వలంటీర్లపై అంత ఘోరంగా అబద్దాలు రాసిందంటే ఈనాడు ఎంతకైనా తెగిస్తోందని తెలియడం లేదా?. వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవ చేస్తున్నందున వారికి వచ్చే గుర్తింపు ముఖ్యమంత్రి జగన్ కు వచ్చేస్తుందన్నదే వారి బాధ. వాలంటీర్ల ఏవో ఆర్దిక మోసాలకు కూడా పాల్పడుతున్నారని ఈనాడు ఆరోపించింది. అది రాయడానికి కాస్త అయినా సిగ్గపడాలి కదా!. ఒకపక్క మార్గదర్శి లో అక్రమంగా ఒక్కొక్కరు కోటికి పైగా డిపాజిట్ చేసిన వారి సంఖ్య వేలల్లో ఉందని, అందులో 800 మందికి సీఐడీకి నోటీసులు ఇచ్చిందంటే ఏమిటి దాని అర్ధం. ఆర్దిక నేరానికి పాల్పడింది మార్గదర్శి అనే కదా దాని యజమానులు రామోజీరావు, ఆయన కోడలు శైలజ అనే కదా తేలుతోంది. ఒకవేళ ఎక్కడైనా ఒక వలంటీరు మహా అయితే లక్ష రూపాయలకు ఎవరినైనా మోసం చేశారనుకుంటే , అది ఫిర్యాదుగా వస్తే వారిపై పోలీసులు చర్య తీసుకుంటారు. మరి ఇన్నివందల కోట్ల అక్రమాలకు పాల్పడితే అసలేమీ జరగనట్లు ఈనాడు ఎందుకు బుకాయిస్తోంది. తమపై కేసులే పెట్టరాదని, విచారణే చేయరాదని కోట్లు వెచ్చించి కోర్టులకు ఎందుకు వెళుతున్నారు?
✍️ మార్గదర్శి అవకతవకల ఆరోపణలకు సంబంధించి.. ఇప్పటికే 800 మందికి నోటీసులు ఇచ్చారంటే కనీసం రూ. 800 కోట్లు , ఇంకా ఆ పైన నగదు రూపంలోనో, లేదా అక్రమంగానో డిపాజిట్లు తీసుకున్నట్లే కదా? లేదూ .. అసలు తాము అలా కోట్లలో డిపాజిట్లు తీసుకోలేదని మార్గదర్శి ఎందుకు చెప్పలేకపోతోంది. ఆర్బీఐ చట్టం వీరికి వర్తించదా?.. తవ్వే కొద్ది ఇంకా ఇలాంటివి ఎన్ని బయటపడతాయో తెలియదు. ఇదంతా నల్లధనమా? తెల్లధనమా అన్నది కూడా తేలాలి కదా? వెంటనే దీనిపై కూడా కోర్టుకు వెళ్లి స్టే కోసం ప్రయత్నించవలసిన అవసరం ఏమి ఉంది. తమ వద్ద డిపాజిట్ లు చేసినవారంతా కచ్చితమైన వారైతే, అందులో నల్లదనం లేకపోతే కంగారు పడవలసిన అవసరం ఏమి ఉంటుంది. పలు కార్పొరేట్ సంస్థలు కూడా నిర్దిష్ట అనుమతులతో డిపాజిట్లు తీసుకుంటాయి. వారిపై రాని ఆరోపణలు వీరిపై ఎందుకు వస్తున్నాయి?బ్యాంకులు ఇచ్చే డిపాజిట్ల వడ్డీ కన్నా తక్కువకే మార్గదర్శిలో కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారంటే ఏమిటి ఆ రహస్యం? ఇలాంటి అనేక యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని ఈనాడు మీడియా.. ఒక చిన్న వలంటీర్ మీద ఎంత దారుణమైన.. అడ్డగోలు కధనాలు రాస్తోంది.
✍️ దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారి సమర్దన. పోనీ తాము ఆ వ్యవస్థను తీసివేస్తామని అనగలుగుతున్నారా అంటే అదేమీ లేదు. పైగా పౌర సేవలకే పరిమితం చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. పౌర సేవలు అందించాలంటే వాలంటీర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే,దానిని ప్రభుత్వ అదికారులకు అందచేయకుండానే స్కీములు అమలు చేయడం సాధ్యం అవుతుందా?. పవన్ కళ్యాణ్ అంటే అజ్ఞానంతోనో, అనుభవం లేకనో మాట్లాడారంటే పోనీలే అనుకోవచ్చు. కానీ.. నలబై ఐదేళ్ల రాజకీయ అనుభవం, పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్న చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతున్నారే. గతంలో జన్మభూమి కమిటీలు ఎలాంటి సమాచారం తీసుకోకుండానే వివిద స్కీములు అమలు చేశాయా?.. అప్పట్లో ఆ కమిటీలలో ఉన్న టీడీపీ నేతలు లంచాలు వసూలు చేస్తే వారిపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలే తీసుకోలేకపోయింది. పవన్ కల్యాణ్ ఆ రోజుల్లో బెల్లం కొట్టిన రాయిమాదిరి నోరు మూసుకుని కూర్చున్నారు. ఇప్పుడు మాత్రం లంచాలకు దాదాపు అవకాశం లేని వాలంటీర్ల మీద పడి ఏడుస్తున్నారు.
✍️ భార్యాభర్తల తగాదాలతో వలంటీర్లకు ఏమి పని అని చంద్రబాబు అడిగారు.తప్పు లేదు. కాని ఎక్కడ ఏ దంపతుల వివాదాలలో వీరు జోక్యం చేసుకున్నారో చెప్పాలి కదా? గుడ్డకాల్చి ముఖాన వేయడంలో చంద్రబాబు దిట్ట. వేల కోట్ల అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన రామోజీరావునేమో సమర్ధిస్తున్నారు. ఏభై ఇళ్లకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఒక చిన్న స్థాయి వాలంటీర్ నేమో చంద్రబాబు తిడుతున్నారు. రామోజీరావుకు పద్మవిభూషణ్ వచ్చింది కనుక ఆయన ఎలాంటి ఆర్దిక అవకతవకలకు పాల్పడినా నోటీసులు ఇవ్వరాదని, ఆయన సంస్థలలో జరిగే అక్రమాల జోలికి వెళ్లరాదని చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రామోజీ రావు వంటివారు ఎలాంటి ఆర్దిక నేరాభియోగాలకు గురైనా వారి జోలికి వెళ్లబోమని టీడీపీ మేనిఫెస్టోలో ఏమైనా ప్రకటిస్తారేమో తెలియదు.
✍️ పవన్ కల్యాణ్ కూడా వార్డుస్థాయి వాలంటీర్ల మీద విరుచుకుపడుతున్నారే తప్ప వందలు, వేల కోట్ల అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన రామోజీరావును, వేల కోట్ల మేర బ్యాంకులకు టోపీ పెట్టిన టిడిపి,ఇతర నేతలను పల్లెత్తి మాట అనడం లేదు సరికదా.. కనీసం ప్రశ్నించడం లేదు. అది ఆయనకు ఉన్న నిబద్దత. మరో విషయం కూడా ఉంది.
✍️ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతిపై విచారణకు ఆ దేశ ప్రధాని ఆదేశించిన సంగతిపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదు?గతంలో ఈశ్వరన్ ను అమరావతికి తీసుకువచ్చి సింగపూర్ దేశమే కదలి వచ్చిందని ప్రచారం చేసి, ఆయన సంస్థలకు 1,600 ఎకరాలు కట్టబెట్టాలని ప్రయత్నించిన నేపధ్యంలో చంద్రబాబుకు ,ఈశ్వరన్ కు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలి కదా! అదే కనుక ఇదే కనుక ఏ జగన్ కో, లేక మరో పార్టీ నేతకో ఇలాంటి వ్యక్తితో స్నేహం ఉంటే ఈపాటికి ఈనాడు, ఇతర ఎల్లో మీడియా ,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు నానా యాగీ చేసేవారా? కాదా? ఇప్పుడేమో తేలుకుట్టిన దొంగల మాదిరి నోరు మెదపడం లేదు. ఇంత భారీ కుంభకోణాల వార్తలను ఇవ్వకుండా పేదరికంతో ఉండి, వలంటీర్ పని చేసుకుని పొట్ట పోసుకుంటున్నవారి కడుపుమీద కొట్టడానికి మాత్రం ఈనాడు తంటాలు పడుతోంది.
✍️ ఆ మీడియా చెత్తవార్తలను ప్రచారం చేయడం, చంద్రబాబు, పవన్ లు వాటిని అందుకోవడం... ఇదే నిత్యకృత్యం అయింది. పవన్ కల్యాణ్ మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు ఉపయోగపడుతున్నారంటూ చిల్లర ఆరోపణ చేసిన తర్వాత.. ప్రముఖ నటుడు, చలనచిత్రాభివృద్ది సంస్థ అధ్యక్షుడు పోసాని కృష్ణ మురళి స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. పవన్ కల్యాణ్కు పలు ప్రశ్నలు సంధించారు. అలాగే.. చంద్రబాబు కుమారుడు లోకేష్ గతంలో పలువురు అమ్మాయిలతో కలిసి విలాసవంతంగా గడుపుతున్న ఫోటోలను చూపి దీనిని కదా మహిళల ట్రాఫికింగ్ అంటే.. పవన్ వీటి గురించి ఎందుకు మాట్లాడలేదని పోసాని ప్రశ్నించారు.
✍️ చంద్రబాబు తన మామ ఎన్.టి.ఆర్.ను పదవినుంచి దించేసి , ఆయన స్థాపించిన టిడిపిని కైవసం చేసుకునేందుకు మహిళను ఉపయోగించారని ,దానిని ట్రాఫికింగ్ అంటారని పోసాని వ్యాఖ్యానించారు. అలాగే టీవీ5లో సినీ నటీనటులను తీవ్ర అభ్యంతర భాషలో మాట్లాడినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పలేదని ఆయనఅడిగారు.నిజమే ఇలాంటి భారీ మోసాలు, మహిళలను తమ రాజకీయ అవసరాలకోసం వాడుకోవడం, వందల ,వేల కోట్ల అక్రమ డిపాజిట్లు, అంతర్జాతీయ స్థాయిలో స్నేహం ఉన్న ఒక మంత్రిపై అవినీతి ఆరోపణలు.. అమరావతి భూ స్కాములు ఇలాంటివాటిపై అక్షరం రాయలేని ఈ పత్రికలు, టీవీలు, నోరు విప్పలేని చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటివారు అమాయకులైన వాలంటీర్లపై, కేవలం ఐదు వేల రూపాయలతో పనిచేసే వాలంటీర్లపై నోరు పారేసుకుని దురద తీర్చుకుంటున్నారు. తద్వారా తమ స్థాయి ఎంత అధమస్థానానికి చేరిందో చెప్పకనే చెబుతున్నారు.
::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment