
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్ అవుతున్నాడు.. మాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.
హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్‌లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.
విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.
చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.
ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్‌కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.
ఇంకోపక్క.. ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.
చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.
యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్‌లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.