
విశాఖపట్నం, సాక్షి: అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion).. మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది.
అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే..
తాము వైఎస్సార్ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం. దీంతో చేసేది లేక కూటమి నేతలు వెనుదిరుగుతున్నట్లు సమాచారం.
జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.