పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
నియోజకవర్గాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో వేర్వేరుగా సమావేశం
విలువలు, విశ్వసనీయతే వైఎస్సార్‌సీపీ నైజం
పార్టీ ప్రజా ప్రతినిధులందరిదీ అదే మాట, అదే బాట
ఏకాభిప్రాయంతోనే ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బొత్స ఎంపిక
రూ.5 లక్షలు.. రూ.10 లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారు
ఆ ప్రలోభాలకు లొంగకుండా మనస్ఫూర్తిగా సహకరించండి
ఎన్నెన్నో హామీలిచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేశారు
మీ జగనే సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వచ్చి ఉండేవి
తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు, ప్రలోభాల కార్యక్రమాలకు ఎవ్వరూ లొంగొద్దు. నేను ఒక్కటే చెబుతున్నా. జగన్ పలావ్ పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతామన్నాడు. చంద్రబాబుని నమ్మి ఓటేశారు. పలావ్ పోయింది.. బిర్యానీ పోయింది. చివరకు పస్తు పడుకోవాల్సిన పరిస్థితి వచి్చంది. చంద్రబాబును నమ్ముకున్న ప్రజలైనా, నాయకులకైనా అంతే. మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేలా, గొప్పగా ప్రజల్లో నిలబడేలా నేను, మీరు అడుగులు ముందుకు వేద్దాం. చంద్రబాబు చేస్తున్న ఈ అధర్మ యుద్ధంలో మనమే గెలవాలి.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
రాజకీయాల్లో ఏ రోజైనా నిలబడాలి అంటే, ప్రజల మన్ననలు ఉండాలంటే.. ఎప్పుడూ షార్ట్ కట్ దారి ఎంచుకోకూడదు. కష్టమైనా కూడా విలువలు, విశ్వసనీయతతో కూడిన దారినే ఎంచుకోవాలి. మీ అందరి దగ్గర నుంచి కూడా నేను ఇదే ఆశిస్తున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజల్లోకి పోతే.. మాట చెప్పాం, నెరవేర్చాం.. అని కాలర్ ఎగరేసుకుని చెప్పాలి. మాలో అబద్ధాలు, మోసాలు, కల్మషం ఉండవని చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణమైన మెజార్టీ ఉందని, నైతికత ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టకూడదని.. అయినా సీఎం చంద్రబాబు అభ్యర్థిని పోటీకి పెట్టారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. మన పార్టీ తరఫున గెలిచిన వాళ్ల వద్దకు మనుషులను పంపించి రూ.5 లక్షలు.. రూ.10 లక్షలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నారని ఎత్తి చూపారు.
విలువలు, విశ్వసనీయతే వైఎస్సార్‌సీపీ నైజమని, ప్రలోభాలకు లొంగకుండా మన పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు మనస్ఫూర్తిగా సహకరించాలని పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సాగిస్తున్న ఈ అధర్మ యుద్ధంలో మనమే గెలవాలని దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారితో ఏమన్నారంటే..
మనమైతే మెజార్టీ లేకుంటే పోటీ పెట్టం
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీతోపాటు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ పోటీ పెట్టకూడదు. కారణం ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే.. టీడీపీ వాళ్లు కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెలిచారు. వారికి, మనకు దాదాపు 387 స్థానాల తేడా ఉంది. గెలిచిన వాళ్లు అంతా మన పార్టీ గుర్తు, జెండా మీద గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదు. మీ జగనే ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉంటే.. వాళ్లకు అక్కడ మెజారిటీ ఉండి ఉంటే, మనం పోటీ కూడా పెట్టి ఉండేవాళ్లం కాదు.
మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం.. మన దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయని.. పోలీసులు, అధికారులు మన చేతిలో ఉన్నారని అధర్మంగానైనా గెలిచే కార్యక్రమం చేస్తే అది ఏ మాత్రం ధర్మం కాదు. చంద్రబాబునాయుడు మాత్రం తన నైజం చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజుకు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరఫున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నారు. మనుషులను పంపించిన మీకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు.
తాడేపల్లిలో సమావేశానికి హాజరైన అరకు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు
అప్పుడే ఎవరైనా ఎదుగుతారు
ఎమ్మెల్సీ ఎన్నికలో రాజకీయాల్లో విలువలను అట్టడుగు స్థానంలోకి తీసుకుపోయే కార్యక్రమం జరుగుతోంది. ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడు విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తేనే ఎదుగుతాడు. ఈ విలువలను, విశ్వసనీయతను వదిలి రాజకీయం చేయడం ఏ రోజైతే మనం మొదలు పెడతామో ఆ రోజు ప్రజలకు సమాధానం చెప్పడం మాట దేవుడెరుగు.. ఇంటిలో కూడా గౌరవం ఉండదన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.
నేను నా జీవితంలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను, అమ్మ తప్ప ఎవరూ లేరు. ఇద్దరమే బయటకు వచ్చాం. నాతో పాటు కొంత మంది ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే.. రాజీనామా చేసి రావాలని చెప్పాను. అక్కడ నుంచి మొదలుపెడితే దేవుని దయతో ప్రతి అడుగులో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశామని తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగలం.
హాజరైన పాడేరు నియోజకవర్గ జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు
మొన్నటి ఎన్నికల్లో మోసపు ప్రచారం
మొన్న ఎన్నికల్లో 10 శాతం ప్రజలు చంద్రబాబునాయుడు మాటలు నమ్మారు. చంద్రబాబు నాయుడు, ఆయన ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు సంతోషమా? అని ప్రచారం చేశారు. అలాగే వాళ్ల అమ్మ కనిపిస్తే నీకు రూ.18 వేలు సంతోషమా? అని అడుగుతూ ప్రచారం చేశారు. ఇలా ఎన్నెన్నో చెప్పారు. ఈ మోసపు ప్రచారంతో ఓ 10 శాతం ప్రజలు మన దగ్గర నుంచి దూరమయ్యారు. కానీ ఏమైంది?. చంద్రబాబు పాలన వచ్చి రెండు నెలలైంది. స్కూళ్లు తెరిచారు, పిల్లలు బడులకు వెళ్తున్నారు.
జగన్ ఉండి ఉంటే అమ్మఒడి కింద రూ.15 వేలు ఇచ్చుండే వాడు. ఇప్పుడు ఆ రూ.15 వేలు పోయే.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు ఇస్తానని చెప్పిందీ పోయింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జగన్ ఉండి ఉంటే రైతు భరోసా కింద రూ.13,500 చేతిలో పడేవి. చంద్రబాబు వచ్చాడు. రూ.20 వేలు ఇస్తానన్నాడు. జగన్ ఇస్తానన్న రూ.13,500 పోయాయి. చంద్రబాబు ఇస్తానన్న రూ.20 వేలు మొత్తమే రాకపోయే.
ఈ రోజు మీ జగన్ ఉండి ఉంటే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రతి మూడు నెలలకొకసారి ఫీజులు జమ అయ్యేవి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఎగిరిపోయాయి. డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వారు కాలేజీలకు వెళ్తున్నారు. ఫీజులు కట్టకపోతే టీసీలు తీసుకుని వెళ్లిపొమ్మని కాలేజీలు చెబుతున్నాయి. వసతి దీవెన పథకం కూడా పోయింది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఏప్రిల్‌లో పడాల్సిన సున్నా వడ్డీ డబ్బులు కూడా రాలేదు.
అదే మన సర్టిఫికెట్
నేను ఒక్కటే చెబుతున్నాను. మోసం, అబద్ధాలతో సాగించే పాలన ఎక్కువ రోజులు ఉండదు. మనం చేసిన పనులకు ఇవాళ తలెత్తుకుని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చెప్పిన మాట ప్రకారం చేశామని తలెత్తుకుని వెళ్లగలుగుతున్నాం. అదీ మనకున్న సర్టిఫికెట్. కానీ.. చంద్రబాబునాయుడుకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రజల్లోకి వెళ్తే.. మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ టెన్, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే సమాధానం చెప్పుకోలేని స్థితిలో టీడీపీ కేడర్ ఉంది.
అదే వాళ్లకూ మనకూ మధ్య ఉన్న తేడా. గతంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తీసుకున్నాడు. ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురికి మాత్రమే టిక్కెట్టిచ్చాడు. వాళ్లకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని.. కేవలం అడ్వాన్స్ ఇచ్చాడు. దాంతో అటువైపు పోయిన వాళ్లందరూ మరలా వెనక్కి వచ్చేస్తామని నాకు ఫోన్ చేశారు. కానీ ఒక్కసారి జారిపోయిన తర్వాత వెనక్కి వస్తే విలువ, గౌరవం పోతుంది. వెనక్కి తీసుకోలేకపోయాం. వాళ్ల రాజకీయ జీవితం సున్నా అయిపోయింది.
చేయలేనిది, జరగనిది మీ జగన్ చెప్పడు
2014 ఎన్నికల్లో మనం ఓడిపోయాం. అప్పుడు కూడా మన వాళ్లు నా దగ్గరికి వచ్చి నా మంచి కోసం, మన మంచి కోసం చాలా చెప్పారు. చంద్రబాబునాయుడు ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ఆడుతున్నారు. రైతులు, మహిళలకు రుణమాఫీ అంటున్నారు. ఇంటింటికీ ఉద్యోగం అంటున్నారు. ఒకవేళ అది ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం అంటున్నారు. కాబట్టి, మనం కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పమన్నారు. ముందైతే చెప్పేయండి.. ఆ తర్వాత సంగతి చూద్దామన్నారు.
కానీ చేయలేనిది, జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడడు. అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఆ తర్వాత చంద్రబాబు పరిపాలన చేశాడు. ఆ ఎన్నికల్లో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. ప్రజలను మోసం చేశాడు అన్నది అందరికీ తెలిసేటట్టుగా 2019 ఎన్నికలు వచ్చే సరికి డిపాజిట్లు దక్కని స్థితిలోకి పోయాడు. అప్పుడు మనం అధికారంలోకి వచ్చాం. మన మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్లు చేశాం. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అంటే అర్థం చెప్పేలా.. అడుగులు వేశాం. గతంలో మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు. కానీ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని నిర్వచనం చెబుతూ మాట తప్పకుండా అమలు చేశాం.
అందరూ చెప్పడం వల్లే ఈ నిర్ణయం
మన్యం ప్రాంతం ఎప్పుడూ నాకు తోడుగా ఉంది. పార్టీ స్థాపించినప్పటి నుంచి వెనక్కు తిరిగి చూస్తే ఎప్పుడూ నాకు తోడుగా నిలబడింది. ఏ ప్రాంతం, ఎవరెటుపోయినా ఇక్కడి నాయకులు మాత్రం ఎప్పుడూ వంద శాతం నాకు తోడుగా ఉన్నారు. మీ ప్రేమలు, ఆప్యాయతలు ఇదే మాదిరిగా కొనసాగించాలని కోరుతున్నాను. కష్టాకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయం, సహకారం ఎక్కువ కావాలని కోరుతున్నా. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అయిపోతాయి.
ఈ ఐదేళ్ల మన పోరాటంలో మీ సహాయ, సహకారాలు మెండుగా ఉండాలని కోరుతున్నాను. బొత్స సత్యనారాయణను మన పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నాం. మన ప్రాంత ప్రజా ప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ పిలిచి ఎవరైతే బాగుంటుందని అడిగాను. అందరూ ఏకగ్రీవంగా చెప్పారు. శకుని పాచికలు మాదిరిగా జరుగుతున్న ఎన్నికలివి. ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి స్ట్రేచర్, ప్రొఫైల్ ఉండి ఓర్చుకోగలిగిన, నిలబడగలిగిన నేత అయితే బాగుంటుందని అందరి నోటి నుంచి బొత్స సత్యనారాయణ పేరు వచ్చింది.
జిల్లా మొత్తం అందరూ అదే చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అదీగాక, ప్రత్యేకంగా చంద్రబాబు లాంటి అన్యాయస్తుడితో యుద్ధం చేస్తున్నాం కాబట్టి.. గట్టిగా నిలబడగలిగిన నాయకుడిని నిలబెడితేనే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే బొత్స కూడా మన వాళ్లకు గట్టి తోడుగా నిలబడగలుగుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నాం. మీ అందరూ బొత్సకు మనస్ఫూర్తిగా సహకరించాలని, పేరుపేరునా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment