ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు  | AP Aided Faculty Association of Degree Colleges on Fake News On Govt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు 

Nov 14 2021 4:52 AM | Updated on Nov 14 2021 4:52 AM

AP Aided Faculty Association of Degree Colleges on Fake News On Govt - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఆక్టా రాష్ట్ర ప్రతినిధులు సాంబిరెడ్డి, శ్రీనివాస్, మోహనరావు, మోజెస్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల అధ్యాపక సంఘం (ఆక్టా) హితవు పలికింది. శనివారం గుంటూరులో ఆక్టా ముఖ్య సలహాదారుడు కె.సాంబిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఎయిడెడ్‌ విద్యా సంస్థలను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకే ప్రభుత్వం విలీన ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కొన్ని కళాశాలలు ఆస్తులతో సహా విద్యా సంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడ్డాయని పేర్కొన్నారు. ఆయా విద్యా సంస్థలను వాటి పేర్లతోనే నడుపుతామని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడం తగదన్నారు.

అనంతపురంలో జరిగిన ఘటనలో ప్రభుత్వ తప్పిదం లేదన్నారు. విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. వారిపై ఫీజుల భారం ఉండదన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. విలీనం చేయడం ఇష్టం లేని యాజమాన్యాలు.. విద్యా సంస్థలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని నాలుగో ఆప్షన్‌ ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆక్టా రాష్ట్ర అధ్యక్షుడు కె.మోహనరావు మాట్లాడుతూ.. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకుండా 1999లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం వల్లే ఎయిడెడ్‌ విద్యాసంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రధాన కార్యదర్శి రాయపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఎయిడెడ్‌ విషయంలో ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం 4వ ఆప్షన్‌ కూడా ఇచ్చినందున.. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది యాజమాన్యాలే అని స్పష్టం చేశారు. సమావేశంలో ఆక్టా రాష్ట్ర నాయకులు కె.మోజెస్, రమేష్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement