![Government-owned schools in the state are set to open today - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/1/AP-Students.jpg.webp?itok=vmvfar7C)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలు నేటినుంచి తెరుచుకోనున్నాయి. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రొటోకాల్ పాటిస్తూ పాఠశాలలకు టీచర్లు మాత్రమే హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాక మాత్రమే విద్యార్థులను స్కూళ్లకు అనుమతిస్తారు. టీచర్లు రోజువిడిచిరోజు (ఒకరోజు కొందరు, మరోరోజు కొందరు) వచ్చేలా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఎవరు ఎప్పుడు పాఠశాలకు హాజరుకావాలన్న ప్రణాళికను ప్రధానోపాధ్యాయులు రూపొందించి అమలు చేస్తారు. 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి బోధనాభ్యసన సన్నద్ధతకు వీలుగా ఏర్పాట్లు చేపట్టనున్నారు. ముందుగా టీచర్లను సన్నద్ధం చేస్తూ అదే సమయంలో కోవిడ్ కారణంగా ఇళ్లవద్దనే ఉంటున్న పిల్లలకు చదువులకోసం తగిన సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
నేడు మాత్రం టీచర్లంతా హాజరుకావాలి
నేడు (గురువారం) ఒక్కరోజు అన్ని పాఠశాలల టీచర్లంతా స్కూళ్లకు హాజరుకావాలి. మరుసటి రోజు నుంచి రోజూ సగం మంది వంతున రావాలి. హైస్కూళ్లలో రోజూ తప్పనిసరిగా సగం మంది టీచర్లు ఉండేలా ప్రధానోపాధ్యాయుడు చూసుకోవాలి. విద్యార్థులకు డిజిటల్ పరికరాల అందుబాటు, వారితో అభ్యసన ప్రక్రియ సాగించే విధానాలపై ఎక్కడికక్కడ ప్రణాళికలు రూపొందించుకోవాలి. తమ తరగతి పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటే వాట్సప్ గ్రూపులు ఏర్పాటుచేయించి వాటిద్వారా బోధనాభ్యసన ప్రక్రియలు సాగించాలి.
జూలై 2 నుంచి 15వ తేదీ వరకు పునశ్చరణ చేయించాలి. జూలై 15 నుంచి ఎస్సీఈఆర్టీ పిల్లలకు వర్క్‌షీట్లు పంపిణీ చేస్తుంది. తల్లిదండ్రులు మాత్రమే పాఠశాలలకు వెళ్లి వర్క్‌షీట్లు తీసుకోవాలి. రేడియో, దూరదర్శన్ ద్వారా విద్యాబోధనకు షెడ్యూల్‌ను ఎస్సీఈఆర్టీ విడుదల చేయనుంది. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు వంటి కార్యక్రమాలు సమర్థంగా జరిగేలా టీచర్లు చూడాలి. జగనన్న విద్యాకానుక కిట్‌లను విద్యార్థులు స్కూళ్లకు వచ్చేనాటికి పంపిణీకి వీలుగా సిద్ధం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment