ఎల్‌ఓపీ ఇచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్
వాస్తవానికి 150 సీట్లకు అనుమతులు ఇచ్చింది మూడో వంతు సీట్లే
మిగిలిన నాలుగు కళాశాలలకు అనుమతులపై స్పష్టత కరవు
విద్యార్థుల జీవితాలతో బాబు ప్రభుత్వం చెలగాటం
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పాడేరు వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కళాశాలకు మంగళవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌ఓపీ) ఇస్తూ ఎన్‌ఎంసీ నుంచి సమాచారం అందింది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో పాడేరుతో పాటు మదనపల్లె, మార్కాపురం, పులివెందుల ఆదోని కాలేజీల్లో ఒక్కో దానిలో 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రవేశాలు చేపట్టడానికి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు ఆ కళాశాలల బోధనాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకం, వనరుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఐదు కళాశాలలకు ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు తెచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. ఈ ఏడాది జూన్ నెల 24న కళాశాలలను ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీ చేశాయి. కొంత మేర వనరుల కొరత ఉన్నందున తొలి విడతలో అనుమతులు నిరాకరించారు.
కొరతను అధిగమిస్తే రెండో విడత తనిఖీలు చేసి అనుమతించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండానే చివరి నిమిషంలో అప్పీల్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేపట్టి, తొలి విడత తనిఖీల్లో ఉన్న పరిస్థితులే ఉన్నట్టు గుర్తించింది. ఉన్న వసతులతో ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇస్తే 50 సీట్లకు పులివెందుల కళాశాలకు అనుమతిస్తామని తెలిపింది. అయినా ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇవ్వలేదు.
పాడేరు కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉండటంతో ఎన్‌ఎంసీ ఇక్కడ అండర్‌టేకింగ్ లేకుండానే ఎల్‌ఓపీ మంజూరు చేసినట్టు తెలిసింది. అయినా, 150 సీట్లు రావాల్సిన చోట అందులో మూడో వంతు సీట్లే మంజూరు అయ్యాయి. మిగిలిన నాలుగు వైద్య కళాశాలలకు అనుమతులపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. 2019–24 మధ్య రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం 2023–24లో ఐదు కళాశాలలను ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది.
ఈ ఏడాది మరో ఐదు కళాశాలలకు అనుమతులు వచ్చి 750 సీట్లు సమకూరితే తమకు వైద్య విద్య అవకాశం లభిస్తుందని ఎందరో విద్యార్థులు, తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయినా కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఈ విద్యా సంవత్సరం ఐదు కళాశాలల్లో వంద శాతం సీట్లను చంద్రబాబు ప్రభుత్వం రాబట్టలేక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment