సాక్షి, హైదరాబాద్: తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేయకపోతే బీఆర్‌ఎస్ చేసిందా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సంస్కారం లేకుండా రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేస్తున్నారని, సంస్కారం లేని వారి గురించి తాను ఎక్కువ మాట్లాడబోనని వ్యాఖ్యానించారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అసమ్మతి నేత జగదీశ్వరరావు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆయనను బుజ్జగించిన జానారెడ్డి ఆదివారం తన నివాసంలో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పారు.
అనంతరం జగదీశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇతర నేతలతో కలసి జానారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని, 1995 నాటికే దేశంలోని ఐదు లక్షల గ్రామాలకు విద్యుత్ అందించింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. తమ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్, రూపాయికి కిలోబియ్యం, ఆహారభద్రత, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాలు అమలయ్యాయని, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వచ్చాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు కోల్పోయింది కాంగ్రెస్ నేతలయితే, ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకుంది బీఆర్‌ఎస్ నేతలని ధ్వజమెత్తారు.
గత తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్ చేస్తానని చెప్పిన పనుల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుడికి సీఎం పదవి, మూడెకరాల భూమి పంపిణీ ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ‘అటవీ హక్కులు కాంగ్రెస్ కల్పించకపోతే పోడు భూములు వచ్చేవా? 2004లోనే ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి వారి కరెంటు బిల్లులను మాఫీ చేసింది కాంగ్రెస్ కాదా? అంతకంటే మీరు ఎక్కువేం చేశారు? మేం ఇచ్చిన వాటిని కొనసాగించారు’అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఐదున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతానని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీని ప్రజలు సహించే స్థితిలో లేరని జానా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment