మీరిచ్చిన హామీలేమైనయ్ రాహుల్‌గాంధీ?
నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల హామీ ఏది?
సొంత ట్యాక్స్‌లు వసూలు చేస్తున్న సీఎం, మంత్రులు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకొని తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టాను మించిపోయాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను నయవంచన చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి హింసించే పులకేశిలా వ్యవహరిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయనను ఉద్దేశిస్తూ కేటీఆర్ సోమవారం సుదీర్ఘ బహిరంగ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తడిగుడ్డతో రాష్ట్ర ప్రజల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోసగించడమే కాంగ్రెస్ నైజం
ప్రజలను నమ్మించి మోసం చేయటమే కాంగ్రెస్ నైజమని, ఆరు గ్యారంటీల పేరుతో ఆ విషయాన్ని మరోసారి నిరూపించిందని కేటీఆర్ విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత తీసుకున్న రాహుల్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగిచూడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా వస్తా అని బీరాలు పలికిన రాహుల్.. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.
రాహుల్‌గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు, రైతులు, పోలీసులు, హైడ్రా, మూసీ బాధితులు, ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు, ఆటో డ్రైవర్ల ముందుకు, తెలంగాణ ప్రజల ముందుకొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. పాలన అనుభవం లేని బ్లాక్ మెయిలింగ్ ముఖ్యమంత్రి కారణంగా తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణను దోచుకుంటూ రాష్ట్రాన్ని కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారని ఆరోపించారు.
సీఎం ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా, మంత్రులు తలోరకమైన ట్యాక్స్ వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నార ని మండిపడ్డారు. రూ.1.50 లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ ప్రాజెక్టులో ఢిల్లీ కాంగ్రెస్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయిస్తే వెంటనే పదవిని కోల్పోయేలా చట్టం చేస్తామని ప్రకటించిన రాహుల్.. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నా మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన రాహుల్‌గాంధీ రాష్ట్రాన్ని అవినీతి తెలంగాణగా మార్చినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు.
నీళ్లలో ధాన్యం.. ధర్నాలో రైతులు
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేటీఆర్ సోమ వారం ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల తీరు అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. ‘నీళ్లలో ధాన్యం ఉంటే.. ధర్నాలో రైతు ఉన్నాడు. షరతుల్లో మిల్లర్లు ఉన్నారు. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం పెళ్లిళ్లలో ఉన్నారు’అని విమర్శించారు.
సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ‘మిల్లర్ల కతలు..రైతుల వెతలు’కథనాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మిల్లర్లతో చర్చలు లేవు..రైతుకు భరోసా కరువు..అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్, ధాన్యం కొంటే 500 బోనస్..అసలు కొనకుంటే అంతా బోగస్’ అన్నట్టుగా తయారైందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment