బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అదానీ నుంచి రూ.100 కోట్ల విరాళం తీసుకోవడంపై రాహుల్‌గాంధీ ఫోన్ చేసి తిడితే నష్ట నివారణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గాడు. అదానీ విరాళంగా రూ.100 కోట్ల చెక్‌ను ఇచ్చి 38 రోజులు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నగదుగా ఎందుకు మార్చుకోలేదు? చెక్ చూపించి వెనుక నుంచి డబ్బులు దోచుకునే కుట్ర జరుగుతోందా?..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు.
‘అదానీ ఫ్రాడ్ అని రేవంత్‌కు ఇప్పుడే తెలిసిందా? అదానీని రాహుల్‌గాంధీ ఫ్రాడ్ అంటుంటే రేవంత్ మాత్రం ఫ్రెండ్ అంటూ రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌కు అంటగడుతూ అసత్య ప్రచారం చేస్తున్న సీఎం తన పేరును అబద్ధాల రేవంత్‌రెడ్డిగా మార్చుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు తలసాని, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రేవంత్ అసలైన శాడిస్ట్..: ‘అదానీ విషయంలో రాహుల్‌గాందీకి, రేవంత్‌కు నడుమ ఏకాభిప్రాయం కనిపించడం లేదు. రాహుల్‌తో తిట్లు తిన్న అసహనంతో నన్ను రేవంత్ ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడు. చిట్టి నాయుడికి చిప్ దొబ్బినట్లు కనిపిస్తోంది. అదానీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో అదానీకి రెడ్ సిగ్నల్ ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పా? తెలంగాణ వనరులను దొంగకు దోచిపెట్టడాన్ని ప్రశ్నించిన నేను సైకోనా? తాను తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న రేవంత్ అసలైన శాడిస్ట్.
రేవంత్ మాదిరిగా కాళ్లు పట్టుకోవడం, లుచ్చా పనులు చేయడం, మస్కా కొట్టడం, గౌతమ్ భాయ్ అంటూ తిరిగే రకం కాదు మేము. నేను దావోస్‌లో అదానీతో కలిసి దిగిన ఫోటోను బహిరంగంగా ట్విట్టర్‌లో పెట్టా. కానీ రేవంత్ తరహాలో ఆయనను ఇంటికి పిలుచుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు. కోహెనూర్ హోటల్లో కాళ్లు పట్టుకోలేదు. అదానీ కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు నాకు లేదు..’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదానీకి అనుమతులపై అబద్ధాలు
‘సీఎం ప్రతి అంశంపైనా అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతూ రాష్ట్ర గౌరవం మంటగలుపుతున్నాడు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను అదానీతో ముడి పెడుతూ సీఎం ప్రెస్‌మీట్లు పెడుతున్నాడు. రక్షణ శాఖ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇచ్చిన అనుమతులు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అంటగడుతున్నాడు. డ్రై పోర్టు, విద్యుత్ ట్రాన్స్‌మిషన్ అనుమతులతో మాకు సంబంధం లేదు..’ అని మాజీమంత్రి స్పష్టం చేశారు.
గురుకుల మరణాలన్నీ సర్కారు హత్యలే
‘గురుకుల పాఠశాలల్లో చదివే 48 మంది పిల్లలు చనిపోయినా సీఎం సమీక్ష నిర్వహించడం లేదు. గురుకుల విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు రేవంత్‌రెడ్డే కారణం..’ అని కేటీఆర్ ఆరోపించారు.
జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్
బంజారాహిల్స్ (హైదరాబాద్): కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలపై పగ పెంచుకుని వేధిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ, హైడ్రా బాధితులు, ఆటోడ్రైవర్లు తదితర నగర ప్రజలు.. ప్రభుత్వం పెడుతున్న బాధలు చెప్పుకునేందుకు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌గా మారిందని చెప్పారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశాన్ని మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించారు.
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. రేవంత్‌రెడ్డి ఎత్తైన కుర్చీలో కూర్చొని గొప్ప మనిíÙని కావాలని భావిస్తున్నాడని, కానీ కేసీఆర్‌లా ప్రజలకు మంచి చేసినప్పుడు మాత్రమే వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోగలమని గుర్తించడం లేదని అన్నారు.
హైదరాబాద్‌ను నాలుగు ముక్కలు చేసే కుట్ర
ఓఆర్‌ఆర్ లోపల ఉన్న హైదరాబాద్‌ను మూడు లేదా నాలుగు ముక్కలు చేయాలని సీఎం కుట్ర చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే కుట్రలో బీజేపీకి కూడా భాగం ఉందని అన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ అఖండ మెజార్టీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పలువురు బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment