మూటలపై ఉన్న శ్రద్ధ.. ఇచ్చిన మాటపై లేదా?
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ
ఎమర్జెన్సీ రోజులను తలపించేలా రాష్ట్రంలో నిర్బంధ పాలన
నమ్మి అధికారం ఇస్తే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు
ఈ కుటిల చర్యలకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ గుర్తులు చెరిగిపోవడం ఖాయం..
మేం అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాలను గాందీభవన్‌కు సాగనంపుతాం
గత పదేళ్లలో పెంచిన సంపదను దోచుకుంటున్నారని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ముఖ్యమంత్రి పంపుతున్న మూటలపై ఉన్న శ్రద్ధ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటలపై లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. రాష్ట్రంలో చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణను ఆగమాగం చేసిందని, అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని ఆరోపించారు.
సీఎం మతిలేని నిర్ణయాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం.. ఇప్పుడు అధోగతి పాలవుతుంటే కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేటీఆర్ పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘విషమే తప్ప విషయం లేని సీఎం చేతిలో ఏడాది పాలనలో తెలంగాణ బతుకు ఛిద్రమవుతున్నా కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. కాంగ్రెస్‌ను నమ్మితే రైతుకు గోస తప్ప భరోసా లేదని తొలి ఏడాది పాలనలోనే తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యో గాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులతో ఫొటోలకు పోజులు కొట్టి అడ్రస్ లేకుండా పోయిన మీరు కూడా కాంగ్రెస్ చేసిన మోసంలో భాగస్వాములేనని యువత బలంగా నమ్ముతోంది.
ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువునా మోసం చేశారు. హైడ్రా, మూసీ పేరిట నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేసిన పాపం మీ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తలుపుతట్టే ఏకైక గడపగా తెలంగాణ భవన్ నిలిచింది.
ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు..
ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా సాగుతున్న మీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి చరిత్రను లిఖించింది. తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని అవమానించి, ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
సచివాలయం, అమరవీరుల స్తూపం మధ్య తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా ప్రతిష్టించారు. రేవంత్ చేసిన కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెరగడం ఖాయం. అసలైన తెలంగాణ చరిత్ర, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన, తెలంగాణ సమాజంపైన ఉంది.
ఆ విగ్రహాలను గాంధీ భవన్‌కు సాగనంపుతాం
ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిర, రాజీవ్ గాందీ, ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చుతాం. సచివాలయం ముందు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలను మీ పార్టీ కార్యాలయం గాందీభవన్‌కు సకల మర్యాదలతో సాగనంపుతాం.
మీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ తరహా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌ను సీఎం ఇకనైనా మానుకోవాలి. మేం పదేళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకుని, ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తామంటే సహించేది లేదు’’ అని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment