గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన కేటీఆర్
రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఇతర రాష్ట్రాల్లో అనర్హత వేటు వేయాలంటున్నారు
రాజ్యాంగ రక్షకుడినన్న రాహుల్ ఈ విషయంపై స్పందించాలి
రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఈసీ, సుప్రీంల గడప తొక్కుతాం
ఢిల్లీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని వదిలిపెట్టేది లేదని దీనిపై ప్రతిస్థాయిలో పోరాడతామని బీఆఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. రాజ్యాంగ రక్షకుడిని అని చెప్తున్న లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాటలకు, చేతలకు పొంతన లేదని దుయ్యబట్టారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అవలంభిస్తున్న ద్వంద్వ విధానాన్ని ఇటు పార్లమెంటులో అటు ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు.
‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి.. పార్టీ మారే వారు పిచ్చికుక్కల్లాంటి వారు..’అని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారంటూ.. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏ రాయితో కొట్టాలని కేటీఆర్ నిలదీశారు. పార్టీ ఫిరాయింపులకు, ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. మంగళవారం ఢిల్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీపకొండ దామోదర్‌రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో రూ.50 కోట్లా, రూ.100 కోట్లా?
‘రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, రక్షకుడిని నేనే అంటూ ఆస్కార్ తరహాలో నటించిన రాహుల్ గాంధీ..కాంగ్రెస్‌లోకి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరికను స్వాగతించారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక అంశాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, గోవాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అటు కోర్టుల్లో, ఇటు చట్టసభల్లో పోరాడుతోంది. మరోపక్క తెలంగాణలో మాత్రం ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది.
ఇది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. రాహుల్ దీనిపై నోరు విప్పాలి. ద్వంద్వ వైఖరిని వీడాలి. ఆయన రాజ్యాంగాన్ని చదవడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి. కర్ణాటకలో ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు రూ.50 కోట్లు ఖర్చు చేశారని సీఎం సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. మరి తెలంగాణలో రూ.50 కోట్లా, రూ.100 కోట్లా? ఎంత వెచ్చిస్తున్నారు..’అని కేటీఆర్ ప్రశ్నించారు.
పాత్రధారి హైదరాబాద్‌లో, సూత్రధారులు ఢిల్లీలో..
‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. దానిని మర్చిపోయి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలు మొదలుపెట్టింది. అధిష్టానం అనుమతితోనే రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. సీఎం స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారు. పాత్రధారి హైదరాబాద్‌లో సూత్రధారులు ఢిల్లీలో ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ఆరు, ఏడుగురు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. ప్రజలు వీళ్ల పదవులు ఊడగొట్టడం ఖాయం. వీరంతా ప్రజా క్షేత్రంలో పరాభవం ఎదుర్కోక తప్పదు. ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం..’అని బీఆర్‌ఎస్ నేత అన్నారు.
ఫిరాయింపులపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు
‘కాంగ్రెస్ వైఖరిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుల గడపతొక్కుతాం. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ విషయంలో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం. అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో గత నాలుగు రోజులుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపాం. కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎండగట్టేందుకు అవసరమైన అన్ని వేదికలను ఉపయోగించుకుని, భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోరాడతాం..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
పార్టీ విలీనాన్ని రాజ్యాంగం అనుమతిస్తుంది
‘పార్టీ విలీనానికి, ఫిరాయింపునకు వ్యత్యాసం ఉంది. పార్టీ విలీనాన్ని రాజ్యాంగం అనుమతిస్తుంది. కానీ పార్టీ ఫిరాయింపు మాత్రం రాజ్యాంగ విరుద్ధం. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు 38 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఏడుగురిని కాంగ్రెస్ తమ పారీ్టలో చేర్చుకుంది. అది మూడింట ఒక వంతు కాదు.. మూడింట రెండో వంతూ కాదు. మూడింట రెండో వంతు విలీనం అయితే రాజ్యాంగబద్ధం. దీనిని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు..’అని కేటీఆర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment