ఆయా రాం – గయా రాం సంస్కృతి మార్చుకోవడం మంచిదే
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారే నేతలు వెంటనే తమ పదవులు కోల్పోయేలా చట్టం తెస్తామని కాంగ్రెస్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి, చేసేది మరొకటి ఉంటుందని సామాజికమాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘దేశంలో ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. అయితే తను ప్రారంభించిన ‘ఆయా రాం– గయా రాం సంస్కృతి’పై ఇప్పటికైనా కాంగ్రెస్ విధానం మార్చుకోవడం మంచిదే.
కానీ ఇచ్చిన హామీలకు పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయి. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకోబోమని ఒకవైపు చెప్తూనే, తెలంగాణలో మాత్రం బీఆర్‌ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇచ్చింది. మరో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయకున్నా పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీకి నిబద్ధత ఉంటే ఈ అంశంపై మాట్లాడాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడం ద్వారా తాము అబద్ధాలు చెప్పమని రాహుల్ దేశం ఎదుట నిరూపించుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment