ఏడాదిలోగా మళ్లీ కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తారు | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా మళ్లీ కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తారు

Published Sat, May 4 2024 5:51 AM

KTR Comments On Congress Party

కాంగ్రెస్‌ రాగానే కరెంటు,నీటి కష్టాలు వచ్చాయి

బీజేపీ పాలనలో ప్రజలకు కష్టాలు

బీజేపీలో రేవంత్‌ చేరడం ఖాయం

నగరంలోని రోడ్‌ షోల్లో మాజీ మంత్రి కేటీఆర్‌

అడ్డగుట్ట, బన్సీలాల్‌పేట్, నాంపల్లి: లోక్‌సభ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లు బీఆర్‌ఎస్‌కు వస్తే ఏడాది లోపే మళ్లీ కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా శుక్రవారం అడ్డగుట్ట డివిజన్‌ తుకారాంగేట్‌లో, సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం బన్సీలాల్‌పేట్‌ కమాన్‌ వద్ద, నాంపల్లి నియోజకవర్గం నోబుల్‌ టాకీస్‌ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోల్లో కేటీఆర్‌ మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఇప్పటివరకు చేసిందేమీ లేదని, ఇక చేసేది కూడా ఏమీ లేదని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. ఇక పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి మెజారిటీ సీట్లు వస్తే మళ్లీ కేసీఆర్‌ చక్రం తిప్పుతారన్నారు.

తెలంగాణకు మోదీ ఏం చేశారు
మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్‌ విమర్శించారు. జన్‌ధన్‌ ఖాతాలు తెరిస్తే ప్రతీ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని, ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని, ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తామని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని, బుల్లెట్‌ రైళ్లను తీసుకొస్తామని, నల్లధ నం వెలికితీస్తామని చెప్పిన మోదీని.. ఇప్పుడు అడిగితే తెల్లముఖం వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కుర్‌కురే ప్యాకెట్లు పంచడం తప్ప కిషన్‌ చేసిందేంటి?
ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆయన చేసిన ఒకటే ఒక్క పని కుర్‌కురే ప్యాకెట్లు పంపిణీ చేయడమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు రూపాయి పని కూడా చేయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అక్కరకు రాని చుట్టమని నిందించారు. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలను కష్టాల్లోకి తోసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇవి తప్పనికిషన్‌ రెడ్డి రుజువుచేస్తే రేపటికల్లా నా ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేస్తానని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

గ్రేటర్‌ ప్రజలు గ్రేట్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో తెలివిని ప్రదర్శించి బీఆర్‌ఎస్‌కు 16 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని, ఆ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నానని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ప్రజలు అప్పుడే కరెంట్‌ కోతలు...నీటి కష్టాలతో బాధపడుతున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తరువాత కచ్చితంగా రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్‌ ఆరోపించారు. ’’రాహుల్‌ గాంధీ ఏమో మోదీని చౌకీదార్‌ చోర్‌ అంటే మోదీ బడే భాయ్‌ అని రేవంత్‌రెడ్డి అంటున్నారు.

రాహుల్‌ ఏమో గౌతమ్‌ అదానీ ఫ్రాడ్‌ హై అని అంటే... గౌతమ్‌ అదానీ హమారా ఫ్రెండ్‌ హై అని రేవంత్‌ అంటున్నారు.  లిక్కర్‌ స్కామ్‌ లేదనీ. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం సరికాదని రాహుల్‌ గాంధీ అంటే... కేసీఆర్‌ కూతురును అరెస్టు చేయడం కరెక్టేనని,  రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఈ మాటలను బట్టి రేవంత్‌ తీరు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు’’  అని కేటీఆర్‌ అన్నారు.

Advertisement
Advertisement