'పీసీసీ చీఫ్ పదవి ఆశించడం లేదు'
న్యూఢిల్లీ: తాను పీసీసీ అధ్యక్ష పదవి ఆశించడం లేదని తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... పీసీసీ అధ్యక్షుణ్ని అధిష్టానం మార్చాలనుకుంటే సలహాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడు పొన్నాల సందర్భాను సారంగా మాట్లాడలేకపోతున్నారని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మేధోమథనం సదస్సు ఎప్పుడనేది పొన్నాల తనతో చెప్పలేదని అన్నారు. అలాగే నిన్న ప్రకటించిన సీఎల్పీ కమిటీ ఏర్పాటుపై కూడా తాను పొన్నాలతో చర్చించలేదని తెలిపారు. పీఏసీ ఛైర్మన్ ఎవరనేది తానే నిర్ణయిస్తానని జానారెడ్డి వెల్లడించారు.