నేడు వికారాబాద్‌కు పొన్నాల
- సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టనున్న కాంగ్రెస్
- హాజరుకానున్న జానా, డీఎస్, ఉత్తమ్ సహా పలువురు నేతలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఓటమి భారంతో కుంగిపోకుండా.. శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం వికారాబాద్‌లో జరిగే నియోజకవర్గ స్థాయి కార్యకర్తలసమావేశంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యే ఈ కార్యక్రమంలో సీఎల్‌పీ నేత జానారెడ్డి సహా అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు గౌలికార్ ఫంక్షన్‌లో సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
తనపై నమ్మకంతో రెండోసారి డీసీసీ పదవి కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం నమ్మకాన్ని నిలబెడతానని క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో క్యామ మాట్లాడారు. సీనియర్లతో ఏలాంటి బేధాభిప్రాయాలకు తావివ్వకుండా సమన్వయంతో వ్యవహరిస్తానని చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా ఉద్యమాలు సాగిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో 109 హామీలిచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. గద్దెనెక్కిన తర్వాత కేవలం రెండు, మూడు హామీలను మాత్రమే అమలు చేసిందని, మిగతావాటిని బుట్టదాఖలు చేసే యత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచైనా హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేస్తామని మల్లేశ్ స్సష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 48డివిజన్లలో పార్టీని పటిష్టంచేసేందుకు త్వరలోనే డివిజన్లవారీగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ పార్టీ బలోపేతానికి పాటుపడతానని క్యామ మల్లేశ్ అన్నారు.