వారిని కర్ర పట్టుకుని కాపలా కాయాలా?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపించారు. శుక్రవారం ఉదయం గాంధీభవన్లో తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశమైంది. పార్టీ సభ్యత్వ నమోదు, నేతల వలసలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజా సమస్యలను విస్మరించి రాజకీయాలే ఎజెండాగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కేసీఆర్ ధోరణి ప్రజాస్వామ్యానికే ముప్పుగా అభివర్ణించారు. ఇతర పార్టీలను లొంగదీసుకోవాలనే కేసీఆర్ తీరును తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాల్సిందేనని వారు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కౌన్సిల్ చైర్మన్, స్పీకర్పై ఒత్తిడి పెంచుతామని జానారెడ్డి, డీఎస్, పొన్నాల పేర్కొన్నారు.
టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ముందు పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలా రాజీనామా చేసినవారినే టీఆర్ఎస్లో చేర్చుకోవటం నైతికత అన్నారు. స్వార్థం కోసం పార్టీ వీడుతున్న నేతలను కట్టడి చేయటమంటే కర్ర పట్టుకుని కాపలా కాయాలా? అని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. నాయకత్వ లోపంతోనే పార్టీ వీడుతున్నామని ...పార్టీ వీడుతున్నవారు చెబితే లోపాలు సరిచేసుకుంటామన్నారు.