టీఆర్‌ఎస్ బలోపేతమంటే.. తెలంగాణ బలోపేతమే | congress senior leader D.srinivas join trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ బలోపేతమంటే.. తెలంగాణ బలోపేతమే

Published Thu, Jul 9 2015 4:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్ బలోపేతమంటే.. తెలంగాణ బలోపేతమే - Sakshi

టీఆర్‌ఎస్ బలోపేతమంటే.. తెలంగాణ బలోపేతమే

* టీఆర్‌ఎస్‌లో డీఎస్ చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్య
* బంగారు తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లోకి: డీఎస్

సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్‌ఎస్‌లో ఎవరు చేరినా.. టీఆర్‌ఎస్ బలోపేతమవుతుందని అంటున్నారు. ఎలాంటి డౌట్ లేదు. టీఆర్‌ఎస్ బలోపేతం కావడం అంటే తెలంగాణ బలోపేతం కావడం. తెలంగాణను తెచ్చిందే టీఆర్‌ఎస్. అది చరిత్ర. ఎవరూ కాదనలేరు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. పార్టీలు, రాజకీయాలు వేరు.

శతృత్వాలు ఉండవు. డీఎస్‌తో నాకు 35 ఏళ్లుగా సంబంధాలున్నాయి. మాకు పదవులు లేనప్పుడు కూడా కలిసే ఉన్నాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. డీఎస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. డీఎస్‌కు చిన్న చిన్న పదవులు లెక్కకాదని, రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో వందల మందికి టికెట్లు ఇచ్చారన్నారు. డీఎస్ తెలంగాణ మేధావి అని, పరిపక్వత ఉన్న రాజకీయ నాయకుడని కితాబిచ్చారు.
 
సెల్యూట్ చేస్తున్నా..
‘‘తెలంగాణ బలోపేతం గురించి ఆలోచన చేసిన డీఎస్‌కు సెల్యూట్ చేస్తున్నా. పరిపక్వత ఉన్న వారికే ఈ ఆలోచన సాధ్యం. పదవులు లెక్కే కాదు. వర్తమాన రాజకీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వాన్ని రూపు దిద్దుకుంటోంది. పార్టీలో చేరే వారు చేరొచ్చు. వారిని గౌరవించుకుంటం. డీఎస్‌కు అన్నీ తెలుసు. పది జిల్లాల్లో మూల మూలన పరిచయాలు ఉన్నాయి, వివాద రహితుడు, సం స్కారం ఉన్న వ్యక్తి. ఒక తమ్ముడిలా ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. ఆయన సీనియారిటీ, అనుభవాన్ని తెలంగాణకు ఉపయోగించుకుంటం. రెండు మూడు రోజుల తర్వాత డీఎస్ ఇంటికి స్వయంగా వెళ్లి అన్ని విషయాలు చర్చిస్తామ’’ని కేసీఆర్ పేర్కొన్నారు.
 
దొంగను పట్టుకుంటే.. ఇంత గొడవా?
‘‘తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డపడుతున్నారు. దొంగను పట్టుకుంటే చంద్రబాబు ఒకటే గొడవ. మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కుతుండు. కరెంటు ఇవ్వరు, ఇయ్యం.. ఏం చేసుకుంటరంటడు. కార్పొరేషన్ల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తరు. ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు ఇవ్వరు. మీ బతుకేదో మీరు బతకండి. తెలంగాణ వేరైంది. దాని బతుకేందో అది బతుకుతది. హైదరాబాద్‌ను పట్టుకుని ఒకటే గుంజులాట.. ఇక అటు ఏపీ సహకరించడం లేదంటె..

ఇటు ఇక్కడి రాజకీయ నాయకులకూ ఓపిక లేకుండా పోయింది. ఏం జరగాలన్నా ఓ ఐదేళ్ల దాకా ఓపిక అవసరం కదా.. చాతనైతే సహకరించాలె. కానీ గొంతు పిస్కుడాయే..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
 
అండగా ఉండేందుకే..: డీఎస్
‘‘టీఆర్‌ఎస్‌లో చేరాలన్న నిర్ణయాన్ని నిర్దిష్టంగా తీసుకున్నా. ఇప్పుడు కేసీఆర్ నాకు కండువా కప్పారుగానీ... 2004లోనే మేం కండువాలు కప్పుకున్నాం. తెలంగాణ ఇచ్చింది సోనియా అయితే, తెచ్చింది కేసీఆర్.. ఆయన ఒత్తిడితోనే తెలంగాణ కల సాకారమైంది. బంగారు తెలంగాణ సాధన కోసం అంతా కలిసి పనిచేయాలి. నా అంతరాత్మ ప్రబోధం మేరకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా..’’ అని డీఎస్ చెప్పారు.

కేసీఆర్‌కు అన్నివేళలా అండగా ఉంటానని, తన వెంట పార్టీలోకి వచ్చిన వారి బాగోగులు చూసుకుంటానని చెప్పారు. తెలంగాణ సీఎం పనిచేస్తుంటే పక్క రాష్ట్ర సీఎం పనిలేక ఆటంకాలు పెడుతున్నారంటూ చంద్రబాబును విమర్శించారు.
 
ఇది సెక్యులర్ తెలంగాణ
ఇది సెక్యులర్ తెలంగాణ అని, గంగా జమున తహజీబ్ ప్రతీకగా ఉన్న తెలంగాణ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత పాలకులు తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేశారని.. ఈ తెలంగాణలో మనదైనటువంటి సంస్కృతితో ముందుకు వెళదామని చెప్పారు. ‘‘పాత వైభవం, పాత సంస్కృతి, మనదైనటువంటి సంస్కృతి, మనదైనటువంటి ఆలోచనా విధానంతో ప్రస్ఫుటంగా, ప్రబలంగా, అద్భుతంగా ముందుకు వెళదాం.

హైదరాబాద్ రంజాన్ పండుగకు ఒకప్పుడు పెట్టింది పేరు. మహబూబ్ అలీఖాన్ రంజాన్ పండుగ రోజున  చల్లే రూపాయలు తెచ్చుకునే వారు. అంత గొప్పగ జరిగేది. మధ్యలో వచ్చిన వారికి రంజాన్ తెలియదు, బక్రీద్ తెలియదు. హైదరాబాద్ సంస్కృతిని ధ్వంసం చేశారు. హిందూ ముస్లింలు ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోవాలి. 750 సంవత్సరాల ముస్లిం రాజుల పాలనలో ఒక్కసారి కూడా మతకలహాలు జరగలేదు.

మధ్యలో కొందరు లుచ్చాలు, గూండాలు మతకల్లోలాలు సృష్టించారు. స్వాతంత్య్రానికి ముందు మహాత్మాగాంధీ కూడా నిజాం గొప్పతనాన్ని, హైదరాబాద్ గొప్పతనాన్ని పొగిడారు. హైదరాబాద్‌ను చూసి ఉత్తర భారతం నేర్చుకోవాలన్నారు. ఈ గొప్ప తనాన్ని భవిష్యత్ తరాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలి..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement