
సమావేశంలో మాట్లాడుతున్న జానారెడ్డి
మిర్యాలగూడ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక బట్టబయలు చేసిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఆ నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ నెల 4, 5 తేదీల్లో మీడియా సమావేశంలో వెల్లడిస్తామన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగ్ నివేదిక టీఆర్‌ఎస్ సర్కార్‌ను దోషిగా నిలబెడుతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం ఆ నివేదికే తప్పుల తడకంటూ బుకాయిస్తున్నారని మండిపడ్డారు.
నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని తెలిపారు. కేసీఆర్ ఇంకా మాయ మాటలతో గారడి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇక ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. కేసీఆర్ రాజ్యాంగ వ్యవస్థనే తప్పుదోవ పట్టించేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటుందన్నారు. రాజకీయ అవగాహన లేని వారి వెకిలి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment