అది నివేదికైతే అంగీకరించొద్దు: జానారెడ్డి
కేంద్రానికి జానారెడ్డి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి రాష్ట్ర విభజనపై పంపిన నివేదికను అంగీకరించవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లేదని పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం గాంధీభవన్‌లో మంత్రి రఘువీరారెడ్డి, పీసీసీ నాయకులు బి.కమలాకరరావు, మాదాసు గంగాధర్, కుమార్‌రావు, జెల్లి సిద్ధయ్య, సుధాకర్‌బాబులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జానారెడ్డి నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రానికి సీఎస్ పంపింది సమాచారమా? ప్రభుత్వ నివేదికా? అనేది తెలియలేదు. సమాచారమే అయితే అభ్యంతరం లేదు. నివేదిక అయితే మాత్రం మేం అంగీకరించం. ఎందుకంటే అది కేబినెట్ ఆమోదం లేని నివేదిక అవుతుంది. అందుకే దాన్ని ఆమోదించవద్దని కే ంద్రాన్ని కోరుతున్నాం..’ అని చెప్పారు.