P.K. Mohanty
-
అసెంబ్లీలో బిల్లుపై చర్చ 23 రోజులు.. 56 గంటలు
చర్చ జరిగిన సమయమిదే.. 86 మంది సభ్యులకే మాట్లాడే అవకాశం సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై శాసనసభ మొత్తం 23 రోజుల పాటు సమావేశమైంది. సగటున రోజుకు రెండున్నర గంటల చొప్పున సుమారు 56 గంటలకు పైగా చర్చించింది. ప్రస్తుతం 280 మంది ఎమ్మెల్యేలున్న సభలో 86 మందికి మాత్రమే విభజన బిల్లుపై అభిప్రాయాలు చెప్పే అవకాశం లభించింది. మిగతావారికి మాట్లాడే అవకాశం రాకపోవడంతో సుమారు 150 మంది తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేశారు. బిల్లుకు మొత్తం 9,072 సవరణలను సభ్యులు ప్రతిపాదించారు. ప్రస్తుత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 12నే ప్రారంభమయ్యాయి. - తొలి రోజు నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతిపట్ల సంతాప తీర్మానం చేశారు. రెండో రోజు ఏ అంశంపై చర్చించాలనే విషయంలో సభ్యుల మధ్య గొడవ జరగడంతో సభ వాయిదా పడింది. - మరోవైపు రాష్ట్రపతి పంపిన విభజన బిల్లు డిసెంబర్ 12న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి అందింది. దానిని ఆగమేఘాలపై సీఎం, గవర్నర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సంతకాలు చేయించి 13వ తేదీ మధ్యాహ్నానికి అసెంబ్లీకి పంపారు. అప్పటికే సభ వాయిదా పడటంతో దానిని సభలో ప్రవేశపెట్టలేదు. - అసెంబ్లీ తిరిగి డిసెంబర్ 16న సమావేశంకాగా అప్పటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల అభ్యంతరాల మధ్య ప్రభుత్వం తరఫున విభజన బిల్లును ప్రవేశపెట్టడం వివాదాస్పదమైంది. ఆ రోజు నుంచి సభ గురువారం నిరవధిక వాయిదా పడేవరకు మొత్తం 23 రోజుల పాటు సమావేశమై 56 గంటలకుపైగా చర్చించింది. - డిసెంబర్ 18న రెండు నిమిషాలపాటే సభ సమావేశమై అతితక్కువ సమయం సభ జరిగిన రోజుగా రికార్డుల్లోకి ఎక్కింది. అత్యధికంగా గత నెల 22న 9 గంటల 4 నిమిషాలు విభజన బిల్లుపై చర్చించినట్లు శాసనసభ సచివాలయ గణాంకాలు చెప్తున్నాయి. - పార్టీల వారీగా చూస్తే మొత్తం 86 మంది సభ్యులు మాట్లాడగా వారిలో 42 మంది కాంగ్రెస్ వారే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తరఫున 22 మంది సభ్యులు ప్రసంగించారు. అలాగే 9 మంది టీఆర్ఎస్, ఏడుగురు వైఎస్సార్ కాంగ్రెస్, ఇద్దరు సీపీఐ, ఎంఐఎం, బీజేపీ, సీపీఎం, లోక్‌సత్తా, నామినేటెడ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చొప్పున చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారులు అధికారి ప్రస్తుతం బదిలీ స్థానం కోయ ప్రవీణ్ ఏఎస్పీ, కాజీపేట ఓఎస్డీ, పార్వతీపురం డీవీ శ్రీనివాసరావు ఓఎస్డీ, పార్వతీపురం పోస్టింగ్ ఇవ్వలేదు భాస్కర్ భూషణ్ ఏఎస్పీ, కొత్తగూడెం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) బెల్లంపల్లి వి.భాస్కరరావు అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) బెల్లంపల్లి పోస్టింగ్ ఇవ్వలేదు అంబర్‌కిషోర్ ఏఎస్పీ, ఉట్నూర్ అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)వరంగల్ వై.సాయిశేఖర్ అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)వరంగల్ పోస్టింగ్ ఇవ్వలేదు ఆర్.రామరాజేశ్వరి ఏఎస్పీ, జగిత్యాల అదనపు ఎస్పీ(అడ్మిన్)నల్లగొండ -
అది నివేదికైతే అంగీకరించొద్దు: జానారెడ్డి
కేంద్రానికి జానారెడ్డి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి రాష్ట్ర విభజనపై పంపిన నివేదికను అంగీకరించవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లేదని పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం గాంధీభవన్‌లో మంత్రి రఘువీరారెడ్డి, పీసీసీ నాయకులు బి.కమలాకరరావు, మాదాసు గంగాధర్, కుమార్‌రావు, జెల్లి సిద్ధయ్య, సుధాకర్‌బాబులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జానారెడ్డి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రానికి సీఎస్ పంపింది సమాచారమా? ప్రభుత్వ నివేదికా? అనేది తెలియలేదు. సమాచారమే అయితే అభ్యంతరం లేదు. నివేదిక అయితే మాత్రం మేం అంగీకరించం. ఎందుకంటే అది కేబినెట్ ఆమోదం లేని నివేదిక అవుతుంది. అందుకే దాన్ని ఆమోదించవద్దని కే ంద్రాన్ని కోరుతున్నాం..’ అని చెప్పారు. -
దీపావళి కానుకగా 8.56శాతం డీఏ!
వచ్చే నెల నుంచి కరువు భత్యం మంజూరుకు సీఎస్ హామీ ఐఆర్‌పై సీఎంతో చర్చిస్తామన్నారు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా వచ్చే నెల నుంచి 8.56 శాతం కరువు భత్యం (డీఏ) మంజూరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి.కె. మహంతి సుముఖత వ్యక్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. పదో వేతన సంఘం సిఫారసులు అమల్లోకి వచ్చే వరకూ 45 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని వేతన కమిషన్ చైర్మన్ పి.కె.అగర్వాల్‌కు, సీఎస్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించిన అనంతరం సమాఖ్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి 8.56 శాతం డీఏ ఇస్తామని, ఐఆర్ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని సమాఖ్య ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, కో చైర్మన్ నరేందర్‌రావు తెలిపారు. హామీ ఇచ్చిన సీఎస్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘గత కొంతకాలంగా ఇతర కారణాల వల్ల ఉద్యోగ లోకం సమస్యలపై దృష్టి పెట్టలేకపోయింది. చివరకు బుధవారం సమాఖ్య ద్వారా అన్ని సంఘాల ప్రతినిధులమంతా పీఆర్సీ చైర్మన్‌ను క లిశాం. గత జూలై ఒకటో తేదీ నుంచి వర్తించేలా 45 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరాం. అనంతరం సీఎస్‌ను కలిసి 45 శాతం ఐఆర్ ప్రకటించాలని, తక్షణమే డీఏ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాం..’ అని చెప్పారు. తాము చర్చించి వచ్చిన కొద్దిసేపటికే డీఏకి సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖకు కూడా పంపించారని తెలిపారు. ఐఆర్, ఇతర డిమాండ్ల విషయమై ముఖ్యమంత్రితో చర్చించి ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పారన్నారు. పదోన్నతుల కోసం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ల కమిటీ (డీపీసీ)లను వేయాలన్న తమ డిమాండ్ విషయంలోనూ సీఎస్ సానుకూలంగా స్పందించినట్లు మురళీకృష్ణ, నరేందర్‌రావు వివరించారు. మీడియా సమావేశానంతరం సీమాంధ్ర, తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా సచివాలయ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. చాలాకాలం తర్వాత ఉమ్మడి ప్రెస్‌మీట్: ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో 2 నెలలకు పైగా సచివాలయంలో పోటాపోటీ నిరసనలు, ఆందోళనలు నిర్వహించిన సచివాలయ తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు ఒక్కటయ్యారు. తమ సమస్యలపై కలిసి పోరాడేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో పీఆర్సీ చైర్మన్, సీఎస్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాఖ్య ఉపాధ్యక్షులు టి. వెంకట సుబ్బయ్య, కన్వీనర్ పద్మాచారి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
సీమాంధ్రలోని తెలంగాణ అధికారుల్ని బదిలీ చేయాలి
సీఎస్‌కు తెలంగాణ గ్రూప్-1 అధికారుల వినతి సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో పనిచేస్తున్న తెలంగాణ అధికారులను అక్కడి నుంచి బదిలీ చేయాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరగౌడ్ నేతృత్వంలో గోపీనాథ్‌రెడ్డి, అంజన్‌రావు, ప్రేమ్‌కుమార్, నాగరాజు, యాదగిరితో కూడిన ప్రతినిధిబృందం మంగళవారం సీఎస్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. సీమాంధ్రలో సమ్మె విరమించే వరకు తాత్కాలికంగా అక్కడినుంచి తెలంగాణ అధికారులను ఓడీ మీద శాఖాధిపతుల కార్యాలయాల్లో నియమించాలని ఈ బృందం విన్నవించింది. ఒకవేళ బదిలీ సాధ్యం కానిపక్షంలో వారికి తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ‘‘ఎవరైనా బదిలీ కావాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేస్తే బదిలీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. మిగతా డిమాండ్లకు కూడా సానుకూలంగా స్పందిం చారు’’ అని చంద్రశేఖరగౌడ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. -
దినేష్‌రెడ్డిని కొనసాగించాలని ఆదేశించలేం: క్యాట్
సాక్షి, హైదరాబాద్: తనను మరో ఏడాదిపాటు డీజీపీగా కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దినేష్‌రెడ్డి విన్నపాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తోసిపుచ్చింది. ఇప్పటికే డీజీపీగా ఆయన రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేశారని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని తేల్చిచెప్పింది. అయితే దినేష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారణకు స్వీకరించిన క్యాట్... దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. దినేష్‌రెడ్డి పదవీ విరమణకు నోటిఫికేషన్ దినేష్‌రెడ్డిని డీజీపీగా కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని క్యాట్ స్పష్టం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే... ప్రభుత్వం ఆయన పదవీ విరమణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 1953 సెప్టెంబర్ 18న జన్మించిన దినేష్‌రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి అందులో పేర్కొన్నారు. -
12 అర్ధరాత్రి నుంచి సమ్మె : ఏపీ ఎన్జీవోల ప్రకటన
సీఎస్‌కు సమ్మె నోటీసు: సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు సమరశంఖం పూరించారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. సమ్మెలో దాదాపు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, మునిసిపల్ ఉద్యోగులు, విద్యుత్ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు పాల్గొననున్నారు. ఈ మేరకు వివిధ శాఖలు, విభాగాలకు చెందిన దాదాపు 70 సంఘాల పక్షాన ఏపీఎన్జీవోలు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి సమ్మె నోటీసు ఇచ్చారు. అనంతరం ఏపీఎన్జీవో నేతలు సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించటం స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అని.. కేవలం 10 - 11 ఎంపీ స్థానాల కోసం రాష్ట్రాన్ని విభజించటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ఉద్యోగుల శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని సీఎస్‌ను కోరామన్నారు. విభజనను జీర్ణించుకోలేకపోతున్నారు... రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎంతకైనా తెగించి ఉద్యమించటానికి సిద్ధమని ప్రకటించారు. తమచేత ఉద్యోగాలు చేయిస్తారో, ఉద్యమాలు చేయిస్తారో.. కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, నేతలు చంద్రశేఖరరెడ్డి, వీరేంద్రబాబు, వెంకటేశ్వరరెడ్డి, గంగిరెడ్డి, లూక్, సత్యనారాయణ, శోభ, రత్నకుమారి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ విభజనను సీమాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎక్కడో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిక్షా కార్మికుడు సైతం హైదరాబాద్ తమది కాదన్న మాటకు బాధపడుతూ స్వచ్ఛందంగా ఆందోళనకు దిగుతున్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర ఎంపీలంతా రాజీనామా చేయాలి... సీమాంధ్ర ఎంపీలు అందరూ లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలకు, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తే.. పార్లమెంటులో రాజకీయ శూన్యత ఏర్పడి విభజన ఆగిపోతుందని విశ్వసిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఎంపీలను వారి పార్టీలకు రాజీనామాలు చేయమని తాము అడగటం లేదని, పదవులను మాత్రమే త్యజించాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం చిన్న ఉద్యమం చేయటానికి కూడా పార్టీలు, నాయకులు ముందుకురాకపోవటం సీమాంధ్ర ప్రజల దురదృష్టమని విచారం వ్యక్తంచేశారు. ఈ నెల 12వ తేదీలోగా సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాలకు, మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలంతా పదవులు త్యజిస్తే.. సమ్మె విషయంలో పునరాలోచన ఉంటుందని సంఘాల నాయకులు చెప్పారు. భావి తరాల భవిత కోసమే... తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో తాము ఉద్యమం చేయటం లేదని.. రాష్ట్ర విభజనను అడ్డుకోవటానికి ఏమీ చేయలేకపోయారని భవిష్యత్ తరం తమను నిందించకూడదనే ఈ ఆందోళనకు దిగుతున్నామని పేర్కొన్నారు. విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లలో ఆస్తులను అమ్ముకుని హైదరాబాద్‌లో చిన్న గూడు కొనుక్కున్న ఉద్యోగులను హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మని అంటే ఎక్కడికి వెళతారని వారు ప్రశ్నించారు. రాజధాని అంటే.. ఆస్తులు, పెట్టబడులు, లక్షలాది ఉద్యోగాలతో పాటు బంధాలు, ప్రేమలు, అభిమానాలు, అనుబంధాల సమ్మిళితమని పేర్కొన్నారు. సమ్మె వల్ల తమకు ఒక నెల జీతమే పోతుందని, విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని చెప్పారు. విభజన నష్టంతో పోలిస్తే.. ఉద్యోగులకు జరిగే నష్టం ఎక్కువేమీ కాదన్నారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటుందని, విభజన వల్ల జరిగే కష్టం, నష్టంతో పోలిస్తే సమ్మె వల్ల కలిగే ఇబ్బంది పెద్దదేమీ కాదని చెప్పారు. జాతీయ పార్టీల నేతలనూ కలుస్తాం...: రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను కలవటంతో పాటు 12వ తేదీ తర్వాత ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల నేతలనూ కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఏకాభిప్రాయం ఉన్న చోట్ల చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అభ్యంతరం లేదని.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వ పెద్దలనూ నిలదీస్తామన్నారు. రాజకీయ అంశాలపైన ఉద్యోగులు సమ్మె చేయవచ్చా? అని విలేకరులు అడిగినప్పుడు.. ‘‘సాధారణ పరిస్థితుల్లో అయితే చేయకూడదు. విభజన అంశం.. రాజకీయ, సామాజిక కోణాల్లో చూడాలి. సమాజం మీద, ఉద్యోగుల మీద నేరుగా ప్రభావించే సమయాల్లో నిరసన వ్యక్తం చేయటానికి సమ్మె చేయచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవటానికి, సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనల్లో భాగం పంచుకోవటానికి ఉద్యోగులుగా మా వంతు బాధ్యతను నిర్వర్తించటం మా కర్తవ్యంగా భావిస్తున్నాం’’ అని వారు వివరించారు. విభజనను ఆపి అభిప్రాయాలు సేకరించాలి ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని, వారి సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశామని కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సీడబ్ల్యూసీలో నిర్ణయాన్ని నిలిపివేసి ఇరు ప్రాంతాల ప్రజలు, ఉద్యోగుల నుంచి హైలెవల్ కమిటీ అభిప్రాయాలు సేకరించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో 3.5 లక్షల మంది ఉద్యోగులు... ఈ నెల 12వ తేదీ (సోమవారం) అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారని సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయులు, మునిసిపల్ ఉద్యోగులు, విద్యుత్ శాఖ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉంటారని చెప్పారు. ఈమేరకు ఆయా సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 4న విజయవాడలో జరిగిన సమావేశంలో దాదాపు 70 సంఘాలు సమ్మెలో పాల్గొంటామని తెలిపాయని, అన్ని సంఘాల తరఫున తామే (ఏపీఎన్జీవో) సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు.